ఊరూరా..‘షీ’ వలంటీర్స్‌! | She Volunteers In Telangana Villages For Women Safe | Sakshi
Sakshi News home page

ఊరూరా..‘షీ’ వలంటీర్స్‌!

Published Mon, Apr 30 2018 1:44 AM | Last Updated on Mon, Apr 30 2018 1:44 AM

She Volunteers In Telangana Villages For Women Safe - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మహిళా భద్రతకు పెద్దపీట వేస్తూ పోలీసు శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా మహిళా భద్రత విభాగం చీఫ్‌గా ఇటీవల నియమితులైన ఐజీ స్వాతి లక్రా నేతృత్వంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మహిళా భద్రత కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో షీ టీమ్స్‌ ఏర్పాటు, భరోసా కేంద్రం, చైల్డ్‌ కోర్టు.. ఇలా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు నిర్వహించి పోలీస్‌ శాఖ విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యవస్థలనే జిల్లాల్లోనూ ఏర్పాటు చేసి మహిళా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పోలీస్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. 

ప్రత్యేక విభాగం.. 
రాష్ట్ర పోలీస్‌ శాఖలో ఇప్పటివరకు ప్రత్యేకంగా మహిళా భద్రత విభాగం అంటూ ఏదీ లేదు. సీఐడీలోని ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్, జిల్లాల్లోని మహిళా పోలీస్‌ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. విప్లవాత్మకంగా తీసుకువచ్చిన షీ టీమ్స్, భరోసా, చైల్డ్‌ కోర్టు తదితరాలను ఒకే యూనిట్‌ కిందికి తీసుకొచ్చేందుకు పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి స్వాతి లక్రా నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ విభాగం కింద ప్రతి గ్రామంలో మహిళా భద్రతతోపాటు చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నియంత్రణకు వలంటీర్ల వ్యవస్థను తీసుకురానున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 

మహిళల కేసుల్లో న్యాయ సహాయం, ఇతర సేవలందించేందుకు ప్రతి జిల్లా పోలీసు శాఖల ఆధ్వర్యంలో కౌన్సెలర్లను నియమించాలని పోలీస్‌ శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. వీరంతా గ్రామాల్లో పర్యటించి అంగన్‌వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను వలంటీర్లుగా నియమించుకోవాలని భావిస్తున్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే జరిగే పరిణామాలను వివరించడం, పాఠశాలల్లో విద్యార్థులకు మహిళా భద్రత, లైంగిక వేధింపుల నియంత్రణపై అవగాహన తరగతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచే మహిళ భద్రతను పటిష్టం చేయవచ్చని, విద్యార్థి దశ నుంచే లింగ బేధ సమస్యలు, లైంగిక వేధింపులు– నియంత్రణపై అవగాహన ఏర్పాడుతుందని, భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఉంటుందని పోలీస్‌ శాఖ భావిస్తోంది. 

జిల్లా కేంద్రాల్లో ‘భరోసా’ కేంద్రాలు 
ప్రతి జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, మహిళల సంబంధిత కేసుల్లో బాధితులకు న్యాయ సహాయం, పునరావాసం కల్పించేందుకు ఈ ఏర్పాటు చేయనున్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పోలీస్‌ స్టేషన్లలో ఉమెన్‌ హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నెల మహిళా భద్రత, లైంగిక వేధింపుల నియంత్రణపై వలంటీర్లతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామ సర్పంచ్‌తోపాటు ఉపాధ్యాయులు, తదితరులను వలంటరీల కమిటీల్లో ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఈ వలంటీర్ల వ్యవస్థను రూపొందించి మహిళా రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement