యాద్గిర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న గొర్రెల కాపరులు
సాక్షి, జనగామ: సబ్సిడీ గొర్రెల కొనుగోలు నిమిత్తం కర్ణాటకకు వెళ్లినవారు ఊహించని షాక్‌కు గురయ్యారు. జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం లింగంపల్లికి చెందిన 12 మంది, చిల్పూర్‌కి చెందిన 20 మంది గొర్రెల కాపరులు వెటర్నరీ అధికారుల సహకారంతో ఈ నెల 15న కర్ణాటకకు వెళ్లారు. చిల్పూర్‌కు చెందిన 20 మంది గొర్రెలను కొనుగోలు చేసి తిరిగొచ్చారు. లింగంపల్లి గొర్రెల కాపరులు శుక్రవారం రాత్రి యాద్గిర్ జిల్లా వడిగర్ల తాలుకా ఖానాపురం ప్రభుత్వ పాఠశాలలో బస చేశారు. వారితో ఉన్న వెటర్నరీ డాక్టర్ కిరణ్ తన బాధ్యతలను గుండాల వెటర్నరీ డాక్టర్ జాటోత్ యాకూబ్‌కు అప్పగించారు. అయితే, యాకూబ్ తిరిగి యాద్గిర్ జిల్లా కేంద్రానికి వచ్చారు.
ఇటీవల ఆ చుట్టుపక్కల గ్రామాలైన వడిగర్ల, ఖానాపురం ప్రాంతాల్లో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సంచరిస్తోందనే వదంతులున్నాయి. అంతకు ముందు దొంగలు చోరీలకు వచ్చి ఇద్దరిని హత్య చేసిన∙ఉదంతాలున్నాయి. దీంతో రాత్రిపూట ఆ ప్రాంతవాసులు గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల ఆవరణలోకి దొంగల ముఠా వచ్చిందని సమాచారం అందడంతో గ్రామస్తులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరారు. గొర్రెల కాపరులకు కన్నడ భాష రాకపోవడంతో స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పోయారు. దీంతో దొంగలుగా భావించి వారిపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాత్రంతా స్టేషన్‌లోనే భయంతో కాలం వెళ్లదీశారు.
బాధితుడి సెల్ ద్వారా వెలుగులోకి..
పోలీసుల అదుపులో ఉన్న బాధితుడు ఒకరు తన సెల్‌ఫోన్ ద్వారా తమ కష్టాలను వాట్సాప్‌లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్‌లో తాము కూర్చున్న విధానం, గ్రామస్తుల చేతిలో గాయపడిన ఫొటోలు పోస్టు చేశాడు. దీంతో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు సిద్ధిరాజ్ యాదవ్ స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. యాదవ నాయకులు, అధికారుల ప్రయత్నాలతో పోలీసులు వారిని విడుదల చేశారు. శనివారం గొర్రెలకాపరులు లింగంపల్లికి తిరుగుపయనమ య్యారు. గొర్రెలకాపరుల వెంట వెటర్నరీ అధికారులుండకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని యాదవ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment