వెయ్యితో మొదలు
ముకరంపుర :
వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, వికలాంగులు కొత్త పింఛన్ల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. పెరిగిన పింఛన్ డబ్బులు ఎప్పుడెప్పుడు చేతికందుతాయా అని ఆతృతతో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 8నుంచి 11వరకు కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని సర్కారు ప్రకటించడంతో.. మరో 24 గంటలే అంటూ ఉత్కంఠకు లోనవుతున్నారు. మరోవైపు తమ పింఛన్లు ఉంటాయో.. ఊడుతాయోనని అయోమయానికి గురవుతున్నారు.
ఈ తరుణంలో పింఛనుదారులకు సర్కారు మరో ఝలక్ ఇచ్చింది. ఈ నెల 8న ఒక్కో నియోజకవర్గంలో కేవలం వెయ్యి మందికే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్టు పేర్కొంది. పింఛను లబ్దిదారుల ఎంపిక కోసం మార్గదర్శకాలను రెండు మూడుసార్లు మార్చడంతో క్షేత్రస్థాయిలో లబ్దిదారుల ఎంపికకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంప్యూటీకరణ పూర్తి కాకపోవడంతో పాటు లబ్దిదారులు తుది జాబితా ఇంతవరకు సిద్ధం కాకపోవడమే ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ల కోసం 4,73,344, ఆహార భద్రత కార్డుల కోసం 9,32,061 దరఖాస్తులు వచ్చాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటివరకు పింఛన్లకు 83,570, ఆహారభద్రత కార్డులకు 2.21836 మంది అర్జీలు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తుల విచారణ పూర్తయ్యింది. అప్పటికే తిరస్కరించిన దరఖాస్తులను మారిన మార్గదర్శకాల ప్రకారం నోట్ చేసి అర్హులను గుర్తించాలి. కానీ వితంతువులకు భర్త మరణ ధ్రువీకరణపత్రం, వికలాంగులకు సదెరం సర్టిఫికెట్ తప్పనిసరని నిబంధన పెట్టారు.
ఇవి లేని వారిని కంప్యూటరీకరించడం లేదు. అలాంటి దరఖాస్తులను పక్కన పెట్టేయడంతో మరో మూడు నెలల వరకు వారికి పెన్షన్ వచ్చే అవకాశం లేదు. ఆన్‌లైన్ నమోదులో కేవలం అర్హులు, అనర్హులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే నమోదు చేస్తున్నారు. కంప్యూటరీకరణ పూర్తియిన తర్వాత జిల్లాలో ఎంతమంది అర్హులు, ఎంతమంది అనర్హులో తుది జాబితాలో వెల్లడికానుంది. ఈ జాబితాలు ఎంపీడీవోల నుంచి డీఆర్‌డీఏ ద్వారా కలెక్టర్ ఆమోదం పొందాలి.
కానీ అర్హుల వివరాలు మండలం దాటి జిల్లాకు రాలేదు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల కంప్యూటరీకరణ 50 శాతం కూడా పూర్తి కాలేదు. పట్టణాలు. నగరాల్లో ఇంకా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. కంప్యూటరీకరణ పూర్తి కావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ముందుగా ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి మంది చొప్పున జిల్లాలోని 13 సెగ్మెంట్లలో 13వేల మందిని అర్హులుగా గుర్తించి పింఛన్ నగదును అందించనున్నారు. మిగిలిన వారికి కంప్యూటరీకరణ పూర్తయిన తర్వాత పింఛన్లు అందించనున్నట్టు డీఆర్‌డీఏ పీడీ విజయగోపాల్ తెలిపారు.
పాత నిబంధనలతో నిరాశే..
ఆహార భద్రత కార్డులు, సామాజిక పింఛన్లకు గ్రామాల్లో వార్షికాదాయం రూ.60వేలు, పట్టణాల్లో రూ.75 వేలుగా ముందుగా సర్కారు నిర్ణయించింది. అలాగే 3.5 ఎకరాల తరి, 5 ఎకరాల మెట్ట భూమి ఉన్నవారినే అర్హులుగా పేర్కొంది. ఇటీవల ఆదాయ, భూ పరిమితులను పెంచుతూ నిబంధనలను మార్చి ఉత్తర్వులు జారీ చేసింది. వార్షికాదాయ పరిమితిని గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలకు పెంచింది. అలాగే గ్రామాల్లో 7.5 ఎకరాల మెట్ట, 3.75 ఎకరాల తరి భూమి ఉన్నవారు అర్హులంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పాత నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోనివారికి ఆశనిపాతంగా మారింది.