The new pension
-
‘ఆసరా’ కొందరికే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎన్నికల హామీలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పింఛన్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద అర్హుల ఎంపిక కోసం గత ఆగస్టులో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సరిపోల్చుతూ.. తాజాగా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేశారు. ఈ క్రమంలో గతంలో ఉన్న పింఛన్‌దారులను రద్దు చేయడంతో.. కొత్తగా 3,69,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన తనిఖీ బృందాలు 1,23,778 దరఖాస్తులను తిరస్కరించి 2,37,256 మందిని అర్హులుగా తేల్చారు. ఇందులో పావువంతు కొత్తవారు ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నారు. ఈలెక్కన 59,314 మంది కొత్త పింఛన్దారులున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనర్హుల వేటు ప్రక్రియ కూడా పూర్తిచేశారు. గతనెలలో జిల్లా వ్యాప్తంగా 2.54లక్షల మంది పింఛన్లు పొందగా.. తాజాగా ఈ సంఖ్య 2.37లక్షలకు చేరింది. ఇందులో కొత్తగా పింఛన్లు తీసుకునే వారిని మినహాయిస్తే.. గతంలో పింఛన్లు తీసుకున్న 76,728 మంది అనర్హులయ్యారు. సర్వే వివరాలు సరిపోలక.. ఆసరా పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు కీలకమయ్యాయి. అయితే పట్టణ ప్రాంతంలో ఈ సర్వే వివరాలు.. దరఖాస్తులతో పోలిక లేకపోవడంతో పలువురిని తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వారిలో పలువురు సమగ్ర కుటుంబ సర్వే సమయంలో వారి సొంత గ్రామాల్లో వివరాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా పరిశీలనలో మండలాలు యూనిట్‌గా తీసుకుని తనిఖీ బృందాలకు ఇచ్చిన వివరాల ఆధారంగా సర్వే చేయడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. డివిజన్ల వారీగా వచ్చిన దరఖాస్తులు, మంజూరు డివిజన్ దరఖాస్తులు అర్హులు చేవెళ్ల 78,191 58,538 మల్కాజిగిరి 43,954 29,558 రాజేంద్రనగర్ 14,131 7,343 సరూర్‌నగర్ 58,907 37,322 వికారాబాద్ 60,479 36,459 పట్టణప్రాంతం 1,13,456 68,036 -
వెయ్యితో మొదలు
ముకరంపుర : వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, వికలాంగులు కొత్త పింఛన్ల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. పెరిగిన పింఛన్ డబ్బులు ఎప్పుడెప్పుడు చేతికందుతాయా అని ఆతృతతో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 8నుంచి 11వరకు కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని సర్కారు ప్రకటించడంతో.. మరో 24 గంటలే అంటూ ఉత్కంఠకు లోనవుతున్నారు. మరోవైపు తమ పింఛన్లు ఉంటాయో.. ఊడుతాయోనని అయోమయానికి గురవుతున్నారు. ఈ తరుణంలో పింఛనుదారులకు సర్కారు మరో ఝలక్ ఇచ్చింది. ఈ నెల 8న ఒక్కో నియోజకవర్గంలో కేవలం వెయ్యి మందికే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్టు పేర్కొంది. పింఛను లబ్దిదారుల ఎంపిక కోసం మార్గదర్శకాలను రెండు మూడుసార్లు మార్చడంతో క్షేత్రస్థాయిలో లబ్దిదారుల ఎంపికకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంప్యూటీకరణ పూర్తి కాకపోవడంతో పాటు లబ్దిదారులు తుది జాబితా ఇంతవరకు సిద్ధం కాకపోవడమే ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ల కోసం 4,73,344, ఆహార భద్రత కార్డుల కోసం 9,32,061 దరఖాస్తులు వచ్చాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటివరకు పింఛన్లకు 83,570, ఆహారభద్రత కార్డులకు 2.21836 మంది అర్జీలు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తుల విచారణ పూర్తయ్యింది. అప్పటికే తిరస్కరించిన దరఖాస్తులను మారిన మార్గదర్శకాల ప్రకారం నోట్ చేసి అర్హులను గుర్తించాలి. కానీ వితంతువులకు భర్త మరణ ధ్రువీకరణపత్రం, వికలాంగులకు సదెరం సర్టిఫికెట్ తప్పనిసరని నిబంధన పెట్టారు. ఇవి లేని వారిని కంప్యూటరీకరించడం లేదు. అలాంటి దరఖాస్తులను పక్కన పెట్టేయడంతో మరో మూడు నెలల వరకు వారికి పెన్షన్ వచ్చే అవకాశం లేదు. ఆన్లైన్ నమోదులో కేవలం అర్హులు, అనర్హులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే నమోదు చేస్తున్నారు. కంప్యూటరీకరణ పూర్తియిన తర్వాత జిల్లాలో ఎంతమంది అర్హులు, ఎంతమంది అనర్హులో తుది జాబితాలో వెల్లడికానుంది. ఈ జాబితాలు ఎంపీడీవోల నుంచి డీఆర్డీఏ ద్వారా కలెక్టర్ ఆమోదం పొందాలి. కానీ అర్హుల వివరాలు మండలం దాటి జిల్లాకు రాలేదు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల కంప్యూటరీకరణ 50 శాతం కూడా పూర్తి కాలేదు. పట్టణాలు. నగరాల్లో ఇంకా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. కంప్యూటరీకరణ పూర్తి కావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ముందుగా ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి మంది చొప్పున జిల్లాలోని 13 సెగ్మెంట్లలో 13వేల మందిని అర్హులుగా గుర్తించి పింఛన్ నగదును అందించనున్నారు. మిగిలిన వారికి కంప్యూటరీకరణ పూర్తయిన తర్వాత పింఛన్లు అందించనున్నట్టు డీఆర్డీఏ పీడీ విజయగోపాల్ తెలిపారు. పాత నిబంధనలతో నిరాశే.. ఆహార భద్రత కార్డులు, సామాజిక పింఛన్లకు గ్రామాల్లో వార్షికాదాయం రూ.60వేలు, పట్టణాల్లో రూ.75 వేలుగా ముందుగా సర్కారు నిర్ణయించింది. అలాగే 3.5 ఎకరాల తరి, 5 ఎకరాల మెట్ట భూమి ఉన్నవారినే అర్హులుగా పేర్కొంది. ఇటీవల ఆదాయ, భూ పరిమితులను పెంచుతూ నిబంధనలను మార్చి ఉత్తర్వులు జారీ చేసింది. వార్షికాదాయ పరిమితిని గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలకు పెంచింది. అలాగే గ్రామాల్లో 7.5 ఎకరాల మెట్ట, 3.75 ఎకరాల తరి భూమి ఉన్నవారు అర్హులంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పాత నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోనివారికి ఆశనిపాతంగా మారింది. -
బయోమెట్రిక్‌తోనే పింఛన్లు: కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని, అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ బయోమెట్రిక్ విధానం ద్వారా పింఛన్లు అందజేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పింఛన్లలో అక్రమాలకు చెక్‌పెట్టేందుకే బయోమెట్రిక్ విధానాన్ని అనురించాలని నిర్ణయించామని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 100 రోజుల పాలనపై రూపొందించిన నివేదికను శనివారం ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. అనంతరం వంద రోజుల పాలనపై పుస్తకావిష్కరణ చేసి, ప్రసంగించారు. ప్రతి గ్రామంలో రోడ్లు, మంచినీరు, మురుగునీటి కాలువల నిర్మాణం తమ ప్రాధాన్యత అని మంత్రి చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలో కోటి ఆరు లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు తేలిందని.. ఇప్పటివరకు 96 లక్షల కుటుంబాల వివరాలను కంప్యూటర్ ద్వారా క్రోడీకరించామని వెల్లడించారు. మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలతోనే ప్రభుత్వం ప్రణాళిక రూపొందించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 2015 ఆగస్టు కల్లా ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న వాటర్‌గ్రిడ్‌ను క్లోరిన్ ప్రభావిత నల్గొండ జిల్లా నుంచే ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఏటా రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసి, ఐదేళ్లలో చెరువులన్నిటినీ బాగుచేస్తామన్నారు. అలాగే ఉపాధి హామీ కింద 300 గోదాములను నిర్మిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టు (టీఆర్ఐజీపీ) కింద ప్రపంచ బ్యాంకు సహాయంతో రూ. 640 కోట్లు వెచ్చించి గ్రామీణ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఐదేళ్లలో గ్రామ పంచాయతీలన్నింటినీ ఈ-పంచాయతీలుగా మార్చుతామన్నారు. ఉపాధి హామీలో అక్రమాలు, సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. హెల్ప్‌లైన్ నంబర్ 18002002001గా తెలిపారు.