బయోమెట్రిక్‌తోనే పింఛన్లు: కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని, అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ బయోమెట్రిక్ విధానం ద్వారా పింఛన్లు అందజేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పింఛన్లలో అక్రమాలకు చెక్‌పెట్టేందుకే బయోమెట్రిక్ విధానాన్ని అనురించాలని నిర్ణయించామని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 100 రోజుల పాలనపై రూపొందించిన నివేదికను శనివారం ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. అనంతరం వంద రోజుల పాలనపై పుస్తకావిష్కరణ చేసి, ప్రసంగించారు. ప్రతి గ్రామంలో రోడ్లు, మంచినీరు, మురుగునీటి కాలువల నిర్మాణం తమ ప్రాధాన్యత అని మంత్రి చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలో కోటి ఆరు లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు తేలిందని.. ఇప్పటివరకు 96 లక్షల కుటుంబాల వివరాలను కంప్యూటర్ ద్వారా క్రోడీకరించామని వెల్లడించారు. మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలతోనే ప్రభుత్వం ప్రణాళిక రూపొందించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 2015 ఆగస్టు కల్లా ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు.
ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న వాటర్‌గ్రిడ్‌ను క్లోరిన్ ప్రభావిత నల్గొండ జిల్లా నుంచే ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఏటా రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసి, ఐదేళ్లలో చెరువులన్నిటినీ బాగుచేస్తామన్నారు. అలాగే ఉపాధి హామీ కింద 300 గోదాములను నిర్మిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టు (టీఆర్‌ఐజీపీ) కింద ప్రపంచ బ్యాంకు సహాయంతో రూ. 640 కోట్లు వెచ్చించి గ్రామీణ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఐదేళ్లలో గ్రామ పంచాయతీలన్నింటినీ ఈ-పంచాయతీలుగా మార్చుతామన్నారు. ఉపాధి హామీలో అక్రమాలు, సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. హెల్ప్‌లైన్ నంబర్ 18002002001గా తెలిపారు.