
అపస్మారకస్థితిలోనే ఎస్‌ఐ సిద్ధయ్య
నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం-చిన్నకోడూరు మధ్య శనివారం పోలీసులకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన...
- అత్యంత విషమంగా ఆరోగ్యం
- చికిత్సకు సహకరించని శరీరం
- మెదడులో ఒక బుల్లెట్ పొత్తికడుపులో మరొకటి
- శస్త్రచికిత్సపై ఎటూ తేల్చుకోలేకపోతున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం-చిన్నకోడూరు మధ్య శనివారం పోలీసులకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆత్మకూర్(ఎం) ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య(29) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సిద్ధయ్య ఇంకా అపస్మారకస్థితిలోనే ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆదివారం ఉదయం వైద్యులు విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో స్పష్టం చేశారు.
రక్తపోటును సాధారణ స్థితికి తీసుకొచ్చి, అధిక రక్తస్రావాన్ని నివారించినప్పటికీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. ఇప్పటివరకూ ఆయన కళ్లు తెరచి కూడా చూడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న మెదడు, పొత్తికడుపులో ఉండిపోయిన బుల్లెట్లను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాలా? లేదా అనే విషయంపై వైద్యులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పది మంది వైద్యుల బృందం ఇప్పటి వరకు సిద్ధయ్యకు మూడు శస్త్రచికిత్సలు చేసింది.
సుమారు ఎనిమిది గంటల పాటు శ్రమించి ఎడమ చెవి వెనుక భాగం నుంచి మెదడు వరకు దూసుకుపోయిన ఒక బుల్లెట్ ను, ఛాతీకి ఎడమవైపు నుంచి భుజంవైపు దూసుకుపోయిన మరో బుల్లెట్‌ను తొలగించారు. పొత్తికడుపును పూర్తిగా ఓపెన్ చేసి ఇన్‌ఫెక్షన్ సోకిన భాగాలను శుభ్రం చేసినప్పటికీ.. పొత్తికడుపులో ఉన్న బుల్లెట్ వ ల్ల ప్రాణహాని లేకపోవడంతో దాన్ని అలాగే వదిలేశారు.
అలాగే శరీరం శస్త్రచికిత్సకు సహకరించకపోవడంతో చిన్నమెదడులోకి చొచ్చుకెళ్లిన మరో బుల్లెట్‌ను కూడా వదిలేశారు. సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిన తర్వాత మరోసారి శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించనున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ముష్కరుల కాల్పుల్లోనే గాయపడిన రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి కూడా ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలగంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.