చిన్నగాటుతో కాలేయం సమీపంలోని బుల్లెట్ తొలగింపు
సోమాలియావాసికి అపోలో ఆస్పత్రిలో చికిత్స..డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు ఓ వ్యక్తి కాలేయం సమీపంలో ఉన్న బుల్లెట్‌ను చిన్నగాటుతో విజయవంతంగా తొలగించారు. సర్జరీ చేసిన 24 గంటల్లోనే బాధితుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు సోమవారం మీడియాకు విడుదల చేశారు. సోమాలియా దేశానికి చెందిన మహమూద్(50)కు తొమ్మిది నెలల క్రితం బుల్లెట్ గాయమైంది. అది ఛాతీ నుంచి దూసుకెళ్లి కాలేయం సమీపంలో ఉండిపోయింది.
స్థానిక ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. కానీ, ఛాతీలో ఉన్న బుల్లెట్‌ను తీయలేకపోయారు.అప్పటి నుంచి అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల హైదరాబాద్ అపోలోలోని కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పి.శివచరణ్‌రెడ్డిని సంప్రదించాడు. తక్కువ కోత(0.5 సెంటీమీటర్లతో కూడిన రెండు చిన్న రంధ్రాలు)తో బుల్లెట్‌ను విజయవంతంగా బయటికి తీశారు. సాధారణంగా ఇలాంటి చికిత్సల్లో ఛాతీపై 15–20 సెంటీమీటర్ల గాటు పెట్టి సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ, అపోలో వైద్యులు అధునాతన ల్యాప్రోస్కోపిక్ చికిత్స ద్వారా ఛాతీలోని బుల్లెట్‌ను బయటికి తీశారు. ‘ఈ తరహా చికిత్స వల్ల ఛాతీపై తక్కువ గాటు, తక్కువ రక్తస్రావం ఉంటాయి. నొప్పి, ఇన్‌ఫెక్షన్ వంటివి ఉండవు. రోగి త్వరగా కోలుకుంటారు.’ అని డాక్టర్ శివచరణ్‌రెడ్డి తెలిపారు.