తెగిన ముక్కు తిరిగొచ్చింది!
విజయవంతంగా అమర్చిన అపోలో వైద్యులు
సాక్షి, హైదరాబాద్: కత్తిపోటు ఘటనలో ముక్కు తెగిన ఓ వ్యక్తికి అపోలో ఆస్పత్రిలో విజయవంతంగా చికిత్స చేశారు. టాంజానియాకు చెందిన సిలాహ్ క్వాహు (46)కు 2014 సెప్టెంబర్‌లో జరిగిన ప్రమాదంలో ముక్కు తెగిపోయింది. చికిత్స కోసం స్థానిక వైద్యులను ఆశ్రయించినా పోయిన ముక్కు తిరిగి రాలేదు. ముక్కు లేకపోవడంతో బయట తిరుగలేని పరిస్థితి. దీంతో సిలాహ్ ఇటీవల జూబ్లిహిల్స్ అపోలోకు చెందిన కన్సల్టెంట్ కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్‌ప్రసాద్‌ను సంప్రదించాడు. ఇండియన్ రైనో ప్లాస్టీ పద్ధతిలో చికిత్స చేయాలని డాక్టర్ నిర్ణరుుంచారు.
ఈ మేరకు తొలిదశలో కుడి మోచేతి నుంచి చర్మాన్ని, చెవి భాగంలోని మెత్తని ఎముకలను సేకరించారు. ఎడమ మోచేతిపై ముక్కు ఆకారాన్ని, రక్తనాళాలను వృద్ధి చేశారు. మోచేతిపై తయారైన ముక్కు ఆకారాన్ని తీసి కత్తిపోటు ఘటనలో పోయిన ముక్కు భాగంలో విజయవంతంగా అమర్చారు. వెంట్రుక కన్నా సన్నగా ఉండే దారంతో కుట్లు వేసి, రక్తనాళాలను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాతి దశలో పక్కటెముకల నుంచి కొంత ఎముకను తీసి ముక్కు దూలాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సాధారణ ముక్కు ఏర్పడింది. బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు తెలిపారు.