
తల్లిదండ్రులను చితకబాదిన ఎస్‌ఐ
సూర్యాపేట : అతను పదుగురికి రక్షణ కల్పించే పోలీసు ఉద్యోగంలో కొనసాగుతున్నాడు.. అవసాన దశలో తల్లిదండ్రి ఆలనా, పాలనా చూస్తూ అండగా నిలవాల్సిన అతనే కర్కోటకుడుగా మారాడు.. వృద్ధులనే కనికరం కూడా లేకుండా చావబాదాడు.. గూడు కూడా లేదంటూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు.. కాటికి కాలుచాపిన వయసులో ఆ వృద్ధ దంపతులు మంగళవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరుల ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు.
పెన్‌పహాడ్ మండలం దూపహాడ్ గ్రామానికి చెందిన మేకల ఇసాక్, మేరమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు గ్రామంలోనే వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్న కుమారుడు మేకల ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభాకర్ కొంత కా లంగా ఆస్తిని పంచాలంటూ తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తమను బెల్టుతో చితకబాది ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడని తల్లిదండ్రి వాపోయారు. ఉన్నతాధికారులు కల్పించుకుని తమ కు న్యాయం చేయాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు.