సిద్దిపేట జోన్: ధాన్యం సేకరణలో భాగంగా జిల్లా యంత్రాంగం ప్రవేశపెట్టిన వినూత్న ప్రయోగానికి సత్ఫలితాలు లభించాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు దీటుగా రబీలో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు వ్యవసాయ పరపతి సంఘాలను (పీఏసీఎస్) రంగంలోకి దింపారు. దీంతో ఈ యేడు రబీలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పోటీ పడి పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. జిల్లా పౌర సరఫరాల శాఖ రికార్డుల ప్రకారం ఈ యేడు సేకరించిన ధాన్యంలో అర్ధభాగం పరపతి సంఘాలదే కావడం విశేషం.
దీంతో జిల్లాలోని 105 సొసైటీల్లో అత్యుత్తమంగా కొనుగోలు చే సిన ఐదు పీఏసీఎస్ సొసైటీలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో సిద్దిపేట డివిజన్‌కు చెందిన సిద్దిపేట, దుబ్బాక, నంగునూరు పీఏసీఎస్ సొసైటీలు వరుసగా మూడు నుంచి ఐదు స్థానాలు ఆక్రమించడం విశేషం. సుమారు రూ. 6 కోట్ల విలువైన ధాన్యం లావాదేవీలను కొనసాగించడం విశేషం. ధాన్య సీమగా పేరొందిన మెతుకు సీమలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు పుష్కలం. ప్రతి యేటా లక్షలాది క్వింటాళ్ల ధాన్యం దిగుమతి కావడం సహజం.
ముఖ్యంగా మధ్యతరహా ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఘనపూర్, సింగూరు ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాలన్ని వరి సిరులతో కళకళలాడుతుంటాయి. గత సంవత్సరం ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై ద్వారా కొనుగోలు ప్రక్రియను నిర్వహించిన జిల్లా అధికారులు సానుకూల ఫలితాలు మరింత మెరుగ్గా వచ్చేందుకు తొలిసారిగా క్షేత్రస్థాయిలో పీఏసీఎస్‌లను రంగంలోకి దించింది. ఎక్కడికక్కడా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరను అందించేందుకు పీఏసీఎస్ సొసైటీలకు పూర్తి అధికారాలను కట్టబెట్టింది.
ఈ క్రమంలో జిల్లాలోని 105 సొసైటీలకు సంబంధిత ఆదేశాలను జారీ చేసింది. ఈ లెక్కన రబీలో పౌరసరఫరాల శాఖ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి 69 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా వాటిలో సొసైటీలు 34 వేల టన్నులు సేకరించడం విశేషం. వాటిలో అత్యధికంగా మెదక్ సొసైటీ కొనుగోలు చేయగా ద్వితీయ స్థానంలో కొల్చారం మండలం రంగంపేట సొసైటీ నిలిచింది. వాటి తర్వాత స్థానాలను సిద్దిపేట డివిజన్ పరిధిలోని దుబ్బాక, సిద్దిపేట, గంగాపూర్‌లు కైవసం చేసుకున్నాయి.
జిల్లా సహకార సంఘం రికార్డుల ప్రకారం దుబ్బాక పీఏసీఎస్ సొసైటీ 350 మంది రైతుల నుంచి 18,050 క్వింటాళ్లను సేకరించి 26 రోజుల్లోనే రూ. 2,42,77,250 డబ్బులను రైతులకు చెల్లించింది. అదే విధంగా సిద్దిపేట సొసైటీ 361 రైతుల నుంచి 25 రోజుల్లో 16,186 క్వింటాళ్లను కొనుగోలు చేసి వాటికి సంబంధించి రూ. 2, 17,70,412లు చెల్లించింది. అదే విధంగా చిన్నకోడూరు మండలం గంగాపూర్ సొసైటీ 368 మంది రైతుల నుంచి 45 రోజుల్లో రూ. 14,200 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 1,90,99,000 రైతులకు చెల్లించి రికార్డు స్థాయిలో నిలిచాయి. ఈ యేడు పూర్తి స్థాయిలో సొసైటీలకు కొనుగోలు ప్రక్రియను అప్పగించి మరింత మెరుగైన ఫలితాలు సాధించేం దుకు ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం.
ధాన్యం కొనుగోళ్లలో సిద్దిపేట డివిజన్ టాప్
Published Mon, Aug 4 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement
Advertisement