సింగరేణి సంస్థలో తెలంగాణ వాదంతో గెలిచిన టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో ఏర్పడిన అంతర్గత నాయకత్వ సమస్య కార్మికుల పాలిట శాపంగా మారింది. తమ పెత్తనం సాగాలనే ఉద్దేశంతో ఇద్దరు నాయకులు తమ బలాన్ని నిరూపించుకునే క్రమంలో వారి మధ్య గొడవ కోర్టుకు చేరడంతో కార్మికుల సమస్యలన్నీ గాలిలో కలిసిపోయాయి.
గోదావరిఖని, న్యూస్‌లైన్ : 2012 జూన్ 28న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గెలుపొందింది. ఆనాటి నుంచి ఏడాది పాటు సాఫీగానే సాగగా... 2013 ఏప్రిల్ నుంచి యూనియన్‌లోని ఇద్దరు అగ్ర నాయకులు కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి మధ్య వైరం మొదలైంది. దీంతో సమావేశాలు నిర్వహించుకుని ఒకరినొకరు తొలగించినట్టు ప్రకటించారు. చివరకు కోర్టు సూచన మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేంద్ర లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో యూనియన్‌కు చెందిన ఆరుగురు ఆఫీస్ బేరర్లకు గోదావరిఖనిలో అంతర్గత ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఆకునూరి కనకరాజు, ప్రధానకార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి ప్యానెల్ గెలుపొందింది. కానీ వారికి అధికారపూర్వకంగా కోర్టు నుంచి లేఖ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఏరియాల వారీగా ఉపాధ్యక్షులను కొనసాగించాలని ఆ ఏరియాల ఉపాధ్యక్షులు, అలాగే ఎన్నికలు నిర్వహించే అధికారం సెంట్రల్ లేబర్ కమిషనర్‌కు లేదని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ సమస్య ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
దీనివల్ల 2013 ఏప్రిల్ నుంచి గనులు, డిపార్ట్‌మెంట్లు, ఏరియాల వారీగా కార్పొరేట్ స్థాయిలో జరగాల్సిన స్ట్రక్చర్డ్ సమావేశాలు నిర్వహించకపోవడంతో కార్మికుల సమస్యలు అనేకం పెండింగ్‌లోనే ఉన్నాయి. కార్మికుల ప్రమోషన్లు, మ్యాచింగ్ గ్రాంట్‌పై నిర్ణయం తదితర అంశాలన్నీ పరిష్కారానికి నోచుకోలేదు. ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిన హెచ్‌ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలతో కూడా యాజమాన్యం కార్పొరేట్ స్థాయిలో నిర్వహించాల్సిన జేసీసీ సమావేశాలు జరగకపోవడంతో ఆయా సంఘాల నాయకులు కేవలం ఏరియాల స్థాయిలో జరిగే సమావేశాల్లోనే సమస్యలను విన్నవించాల్సి వస్తోంది. టీబీజీకేఎస్‌లో ఏర్పడిన అంతర్గత నాయకత్వ పోరును పరిష్కరించేందుకు గతం నుంచి టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
జూన్ 2 తర్వాత తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడనుండగా.. శనివారం కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీబీజీకేఎస్‌లోని కెంగెర్ల మల్లయ్య వర్గం కలిసింది. ఈ సందర్భంగా జూన్ 2 తర్వాత యూనియన్ అంతర్గత సమస్య పరిష్కారం చేస్తానని కేసీఆర్ వారికి హమీ ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వంలోనైనా యూనియన్ సమస్య సమిసిపోతే తమ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని 65 వేల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సింగరేణిలో తేలని గుర్తింపు లొల్లి
Published Sun, May 25 2014 3:12 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement