ఆపరేషన్‌.. 48 గంటలు | Singareni Worker Died In Warangal | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌.. 48 గంటలు

Published Sat, Dec 29 2018 10:18 AM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM

Singareni Worker Died In Warangal - Sakshi

కోల్‌బెల్ట్‌: సింగరేణి యంత్రాంగం చేపట్టిన 48 గంటల ఆపరేషన్‌ తర్వాత గని కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ టీం సభ్యులు శుక్రవారం గుర్తించారు. సపోర్ట్‌మెన్‌ కార్మికుడు సత్యనారాయణ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1 గనిలో బుధవారం మొదటి షిఫ్టుకు హాజరయ్యాడు. గనిలోని 36వ డిప్‌ 3వ సీం ఎస్‌–7 ప్యానల్‌ వద్ద 11 లెవల్‌లో బారికేడ్‌ వద్ద విధులు నిర్వర్తిసుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో బారికేడ్‌కు రంధ్రం ఏర్పడిందని తెలియడంతో అక్కడికి వెళ్లాడు.

అవుట్‌ మస్టర్‌ పడకపోవటంతో.. 
మధ్యాహ్నం విధుల ముగించుకున్నతర్వాత సత్యనారాయణ అవుట్‌ మస్టరు పడక పోవటంతో అనుమానం వచ్చిన అధికారులు ఆయన ఆచూకీ కోసం గనిలో ఆపరేషన్‌ చేపట్టారు. అతను విధులు నిర్వర్తిస్తున్న 11 లెవల్‌ బారికేడ్‌ వద్ద నుంచి 21 లెవల్‌ వరకు ఆరు రెస్క్యూ టీంలు ఎస్‌డీఎల్‌ యంత్రంతో రెండు రోజుల పాటు ఇసుకను తొలగిస్తూ ఆపరేషన్‌ చేపట్టారు. అయితే 20వ లెవల్‌ వద్ద సత్యనారాయణ వెంట తీసుకువెళ్లిన హెడ్‌ లైట్‌ దొరకటంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

సుమారు 350 మీటర్ల దూరంలోని ఇసుకను తొలగించగా చివరకు 20వ లెవల్‌ ఈస్ట్‌ ఆఫ్‌ 35 డిప్‌ జంక్షన్‌కు 12 మీటర్ల దూరంలో 21వ లెవల్‌ వద్ద మృత దేహాన్ని గుర్తించారు. సత్యనారాయణ శరీరం పూర్తిగా ఉబ్బిపోయి ఉంది. మృత దేహాన్ని బయటకు తీసిన అనంతరం అంబులెన్స్‌లో మంజూర్‌నగర్‌ సింగరేణి ఆస్పత్రికి తరలించారు. బారికేడ్‌కు 0.06 మీటర్ల మేర రంధ్రం పడి ఇసుక, నీరు ఉధృతంగా ప్రవహించినందున సత్యనారాయణ కొట్టుకు పోయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే గాలింపులో భాగంగా 50 మంది మైనింగ్‌ ఉద్యోగులు గనిలోని ఇతర గుళాయిలలో వెతికారు.
 
అధికారుల నిరంతర పర్యవేక్షణ..
గనిలో గల్లంతైన సత్యనారాయణ ఆచూకీని కనుగొనడానికి సింగరేణికి చెందిన జీఎం సేఫ్టీ ఎం.వసంతకుమార్, జీఎం రెస్క్యూ జి.వెంకటేశ్వర్‌రెడ్డి, రీజియన్‌ సేఫ్టీ జీఎం కలువల నారాయణ, బెల్లంపల్లి రీజియన్‌ సేఫ్టీ జీఎం బళ్లారి శ్రీనివాసరావు, ఏరియా జనరల్‌ మేనేజర్‌ కొండబత్తిని గురువయ్య గని వద్ద మకాం వేసి నిరంతరం ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.

గని ప్రమాదంపై డీడీఎంఎస్‌ విచారణ
గని ప్రమాదంలో కార్మికుడు సత్యనారాయణ మృతి చెందటం పట్ల మైనింగ్‌ శాఖ అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. డీడీఎంఎస్‌ సుబ్రహ్మణ్యం గనిలోని సంఘటనా స్ధలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరించారు.

 
కుటుంబ సభ్యుల ఆగ్రహం..
కేటీకే–1 గనిలో గల్లంతైన సత్యనారాయణ ఆచూకీ కనుగొనడానికి 48 గంటల సమయం పట్టడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి ప్రాణాలు కోల్పోయాడని సత్యనారాయణ కుమారుడు శ్రవన్‌ శుక్రవారం గని ఆవరణలో జీఎంను నిలదీశాడు. శ్రవన్‌ బోరున విలపించగా అక్కడే ఉన్న కార్మికులను కంటతడిపెట్టారు. మార్చురి వద్ద మృతుని భార్య అన్నపూర్ణతో పాటు బంధువుల రోధనలు కలచి వేశాయి.

అంత్యక్రియలకు ఏర్పాట్లు..
అనంతరం అంత్యక్రియలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు చెందిన నాయకులు కొక్కుల తిరుపతి, బడితెల సమ్మయ్య, రత్నం అవినాష్‌రెడ్డి, కోటేశ్వర్‌రావు, మల్లేష్, వెంకటేశ్వర్లు, బాలాజీ, కొరిమి రాజ్‌కుమార్, మొటపలుకుల రమేష్, భీమా, రత్నం సమ్మిరెడ్డి, కె.నర్సింగరావు చేపట్టారు. 

అన్ని విధాలుగా ఆదుకుంటాం.. 
గని కార్మికుడు సత్యనారాయణ కుటుంబాన్ని సింగరేణి సంస్థ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటుంది. కుటుంబంలో ఒకరికి 10 రోజులలో సంస్థలో ఉద్యోగం కల్పిస్తాం. గని ప్రమాదంలో మృతి చెందినందున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇతర బెనిఫిట్స్‌ను అందజేసేందుకు సత్వరమే చర్యలు తీసుకుంటాం. – కె.గురువయ్య, ఏరియా జీఎం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement