సింగూరు ప్రాజెక్టు
సాక్షి, జోగిపేట(అందోల్): రాష్ట్ర రాజకీయాల్లో ‘అందోల్’ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి గెలుపొందిన మెజార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కాగా దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రాజనర్సింహ కుటుంబ సభ్యులు అత్యధికంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 19?52లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజనర్సింహ మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
నియోజకవర్గ చరిత్ర
1952లో అందోల్ నియోజకవర్గం ఏర్పడింది. 2009వ సంవత్సరం వరకు అందోల్, పుల్కల్, మునిపల్లి, సదాశివపేట, పుల్కల్, రేగోడ్, అల్లాదుర్గం మండలాలు మాత్రమే ఉన్నాయి. పునర్విభజన అనంతరం సదాశివపేట మండలం సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోకి వెళ్లగా, అందోల్ నియోజకవర్గం పరిధిలోకి కొత్తగా రాయికోడ్, టేక్మాల్ మండలాలు చేర్చారు. 1952 నుంచి 67వ సంవత్సరం వరకు జనరల్ క్యాటగిరీ కాగా, 1967 నుంచి ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 12 సార్లు జరిగిన ఎన్నికల్లో రాజనర్సింహ కుటుంబ సభ్యులే ఆరుసార్లు ఎన్నికయ్యారు.
కాంగ్రెస్, టీడీపీల మధ్యే పోటీ
నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీల మధ్యే ఎక్కువసార్లు పోటీ జరిగింది. 1967, 1972, 1978లో స్వతంత్ర, జనతాపార్టీ అభ్యు›ర్థులు పోటీలో ఉండగా, 1983 నుంచి 2009 వరకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. 2014వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయలేదు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున బాబూమోహన్ పోటీ చేసి గెలుపొందారు. నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి, నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు మాజీ మంత్రి గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి జనతాపార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
జోగిపేట ఎమ్మెల్యేలు బస్వమాణయ్య, లక్ష్మారెడ్డి
1952లో ఏర్పడిన నియోజకవర్గంలో ఒక్కసారి మాత్రమే జోగిపేటకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓపెన్ క్యాటగిరీ ఉన్న సమయంలో వైశ్యుడైన బస్వమాణయ్య 1957వ సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోగిపేటకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భాలు లేవు. 1967 నుంచి రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడడంతో ఇక్కడ పోటీ చేసే అవకాశం లేకపోవడంతో జోగిపేట పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శేరి లక్ష్మారెడ్డి మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రిజర్వుడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ప్రధాన పార్టీలు స్థానికులకు అవకాశం కల్పించలేదు.
హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజనర్సింహ
అందోల్ రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే రాజనర్సింహ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్‌లో కార్పొరేటర్‌గా ఉన్న రాజనర్సింహను కాంగ్రెస్ పార్టీ అందోల్‌లో పోటీ చేయించింది. 1967, 1972, 1978లలో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1983లో స్థానిక రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాజనర్సింహకు కాకుండా సంగారెడ్డికి చెందిన హెచ్.లక్ష్మణ్‌జీకి ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా రాజనర్సింహ ఓటమి చెందారు. ఇదే సంవత్సరంలో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఎన్నికైన లక్ష్మణ్‌జీ
1983లో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి పట్టణానికి చెందిన హట్కర్ లక్ష్మణ్ జీ గెలుపొందడం సంచలనం కలిగించింది. అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అందోల్‌లో టీడీపీ తరఫున పటాన్‌చెరుకు చెందిన డాక్టర్ యాదయ్య ఓటమి చెందారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా లక్ష్మణ్ గెలుపొంది ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
ప్రజల జీవన స్థితిగతులు
ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. 80 శాతానికి పైగా వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాలపై జీవిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని పుల్కల్ మండలం సింగూరులో ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా అందోలు, పుల్కల్ మండలాలకు 40వేల ఎకరాలకు సాగునీరును అందిస్తారు. కేవలం హైద్రాబాద్ జంట నగరాలకు త్రాగునీటిని, నిజాంసాగర్, ఘనపూర్ ఆయకట్టుకు సేద్యానికి నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కాలువల నిర్మాణం, భూసేకరణకు రూ.89.98 కోట్లు మంజూరు చేసి స్వయంగా పనులకు శంకుస్థాపన చేసారు. ఆ కళ 2016–17 సంవత్సరంలో సాకారమైంది. నియోజకవర్గంలో పెద్దగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లాల్సిన పరిస్థితి.
‘అందోల్’ రెడ్డిరాజుల కోట
జోగిపేట(అందోల్): మెతుకు రాష్ట్రానికి అందోల్ ముఖ్య పట్టణంగా ఉండేది. రెడ్డిరాజుల కాలంలో శంకరమ్మ, సదాశివరెడ్డి, అల్లమరెడ్డి, సూర్యప్రతాపరెడ్డిలు పరిపాలించేవారు. వీరి రాజ్యంపై నిజాం దండయాత్రకు వచ్చినప్పుడు కప్పం కడతాం అన్న ఒప్పందాన్ని వారితో కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో రెడ్డిరాజులే స్వతంత్రంగా పరిపాలించుకునేందుకు వీలు కలిగింది. అప్పట్లో అందోలులో మూడు గౌనిలు, 36 బురుజులు, ఆరు చిన్న దొడ్డీలు, ఒక సొరంగమార్గం నిర్మించుకున్నారు.
రెడ్డి రాజులు కలబ్‌గూరులో కాశీ విశ్వనాథ ఆలయం, అందోల్‌లో రంగనాథ ఆలయం, రంగంపేటలోనూ రంగనాథ ఆలయాలను నిర్మించి ఆస్థానాలు ఏర్పరచుకున్నారు. అందోల్‌లో ఇప్పటికి బురుజులు చెక్కు చెదరలేదు. శత్రువులను ఎదుర్కొనేందుకు వీలుగా కోటల నిర్మాణం చేపట్టారు. అప్పట్లో రెడ్డిరాజుల వంశీయురాలైన శంకరమ్మకు శార్దూలం అనే బిరుదు కూడా అప్పట్లో నామకరణం చేశారు. మంజీర నది పరివాహక ప్రాంతం ఒడ్డున రెడ్డి రాజులు విహర యాత్రకు వెళుతున్న సమయంలో ఆ ప్రదేశం నచ్చి అక్కడే ఉండి పోవడానికి నిశ్చయించుకొని ‘అందోల్’ నుంచే తన పరిపాలనను సాగించారు.
Comments
Please login to add a commentAdd a comment