కరీంనగర్: సింగరేణి యాజమాన్యం మహిళా ఉద్యోగులకు వీఆర్‌ఎస్ అవకాశం కల్పిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పదేళ్ల సర్వీసు ఉండి, 55 ఏళ్లలోపు వయసు ఉన్న వారికే వీఆర్‌ఎస్ వర్తింపజేస్తూ యాజమాన్యం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అంతే కాకుండా కొడుకులున్న వారికే డిపెండెంట్ ఉద్యోగం లభిస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఈ స్కీం వర్తించని చాలా మంది మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్‌ఎస్‌పై యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సంతోషకరమైనప్పటికీ.. మాకొడుకులకు ఉద్యోగం ఇచ్చే అవకాశం లేకపాయే అని 55 ఏళ్లు పైపడిన మహిళలు కన్నీరు పెడుతున్నారు. యాజమాన్యం పునారాలోచించి సర్వీసు నిబంధనలను సడలించి అందరికీ న్యాయం చేయాలని మహిళా ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీఆర్‌ఎస్‌తో లబ్ధి పొందుతున్న వారు ఆనందపడుతున్నారు. ఈ విషయమై పలువురు ఉద్యోగులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు వెల్లడించారు. అవి వారి మాటల్లోనే..
ఏళ్ల నుంచి సూత్తానం..
వీఆర్‌ఎస్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు సూత్తానం. సింగరేణి పెద్దసార్లు ఇప్పటికైనా మామీద దయ తలిచిండ్రు. ఎంతో సంతోషం. ఇంకా నాకు 13 ఏళ్ల సర్వీసు ఉంది. పనిచేయడానికి చేతనైతలేదు. ఇంకా ఏం చేయాలో నిర్ణయించుకోలే. - ఎస్.మధునక్క, ఉమెన్‌గార్డ్
మహిళలకు మంచి అవకాశం
1990లో భర్త చనిపోవడంతో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఒక బాబు ఉన్నాడు. ఉన్నత చదువులు చదివించాను. నాపైనే కుటుంబం ఆధారపడి ఉంది. వయసు మీదపడి ఉద్యోగం చేసేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో వీఆర్‌ఎస్ కల్పించడం ఆనందంగా ఉంది. మహిళలకు ఇది మంచి అవకాశం. సర్వీసు నిబంధనలను తగ్గించి అందరికీ న్యాయం చేస్తే బాగుంటుంది. - కోటమ్మ, జనరల్ మజ్దూర్, పీకేఓసీ-2, మణుగూరు
వయసు నిబంధనలు సరికావు
సింగరేణి ఉద్యోగంలో 1987లో చేరాను. ఇద్ద రు కూతుర్లు, ఒక కొడు కు. ఇంకా 7ఏళ్ల సర్వీస్ ఉంది. కొడుకు ఐటీఐ చేశాడు. మహిళలకు వీఆర్‌ఎస్ ఇవ్వడం సంతోషమే .. వయసు నిబంధనలు సరికాదు. రెండు, మూడేళ్ల సర్వీసు ఉండి వయో భారంతో ఇబ్బంది పడుతున్న వారికీ అవకాశం కల్పించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. - పి.సారమ్మ, సెక్యూరిటీ విభాగం, మణుగూరు
ఫలితం లేకుండాపోతోంది
మా తర్వాత పిల్లలకు ఉద్యోగం వస్తుందనే ఆశతో కష్టపడి పనిచేసుకుంటూ వచ్చాం. ఇప్పు డు వీఆర్ ఎస్ నిబంధనలతో మాకు అన్యాయం జరుగుతోంది. గతంలో ఇచ్చిన గోల్డెన్ హ్యాండ్‌షేక్ వంటి స్కీం మహిళా ఉద్యోగుల కూ వర్తింపజేయాలి. తక్కువ సర్వీస్ ఉంది కదా.. అని చెప్పి మాకు వీఆర్‌ఎస్ వర్తింపచేయకపోతే పిల్లల జీవితాలు ఆగమవుతాయి. - కె.శోభాదేవి జూ.అసిస్టెంట్, ఆర్‌కేపీ డిస్పెన్సరీ
జెర దయుంచుండ్రి సార్లూ..!
Published Wed, Feb 11 2015 11:24 AM | Last Updated on Sun, Sep 2 2018 4:19 PM
Advertisement