గాల్లో తేలినట్టుందే,గుండె పేలినట్టుందే...అని పాడుకున్నంత వీజీ కాదు గాల్లో విన్యాసాలు చేయడం అంటే. అయితే సాహసమే నా పథం అంటోన్న సిటీ దేనికైనా సై అంటోంది. అడ్వంచర్ వైపు దూసుకుపోతోంది.కాలేజీ యువత కావచ్చు కార్పొరేట్ ఉద్యోగులు కావచ్చు కరోడ్‌పతులైన వ్యాపారులు కావచ్చు కారెవరూ సాహస యాత్రలకు అతీతం అన్నట్టుగా సిటీ అడ్వంచరిజమ్ జూమ్‌అవుతోంది.
సాక్షి, సిటీబ్యూరో: సినీ, పొలిటికల్ సెలబ్రిటీల కారణంగా బంగీ జంపింగ్, స్కై డైవింగ్ వంటివి ఇప్పుడు బాగా పాప్యులర్ అయ్యాయి. ‘నేల మీద ఉన్నప్పుడు ఏమైనా చేయవచ్చు. అయితే గాల్లో చేసే సాహసాలు అద్భుతమైన అనుభవాలు’ అని చెప్పారు నగరానికి చెందిన ‘రియల్’ సంస్థ సుచిర్ ఇండియా సీఈఓ వై.కిరణ్‌కుమార్. బిజినెస్‌తో పాటు గత కొంతకాలంగా ఆయన సాహసయాత్రల్లో సైతం బిజీగా ఉన్నారు. అడ్వంచర్ ట్రిప్స్ అంటే అమిత ఇష్టం అని చెబుతున్న కిరణ్ బంగీ జంపింగ్ దగ్గర్నుంచి స్కై డైవింగ్ దాకా ఎన్నో అనుభవాలను చవి చూశారు. ఆయన చెబుతున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
దూకడం (వి)మానం...
‘ఒక్కసారి స్కై డైవింగ్ అలవాటైతే మానడం కష్టం. దాదాపు పదేళ్ల క్రితం న్యూజిల్యాండ్‌లో మొదలుపెట్టి ఇప్పటికి 70కిపైగానే డైవ్స్ చేశా. తాజాగా హవాయి ఐల్యాండ్స్‌లో 20 వేల అడుగుల ఎత్తు నుంచి దూకా. తొలిసారి డైవ్ చేసినప్పుడు కళ్లు తిరగడం వంటివి సహజమే. దాదాపు 10 వేల అడుగులకన్నా పైన ఎత్తులో ఎగిరే విమానం నుంచి దూకడం అంటే సాధారణ విషయం కాదు. స్కై డైవ్ చేసే సాహసికుడు, మరో నిపుణుడు కలిసి ఫ్‌లైట్‌లో గాల్లోకి వెళతారు. నిర్ణీత ఎత్తుకు చేరగానే...డైవ్‌కి సిద్ధమవుతారు. తగిన జాగ్రత్తలవీ చెప్పాక... ఒన్ టూ త్రీ అంటూ.. కాస్త బలంగానే వెనుక నుంచి నెట్టేస్తారు. కాళ్లు వెనుక పెట్టి జంప్ చేయాలి. కింద అగాధంలా కనపడి భయమనిపించినా కిందకు చూసేటప్పుడు కళ్లు మూసి ఉంచకూడదని ముందుగానే హెచ్చరిస్తారు. ఇరువురూ దూకిన కాసేపటికి పారాచ్యూట్ విచ్చుకుంటుంది. గాల్లో 4 నుంచి 5 నిమిషాలు పైనే ఉంటారు. ఇక కిందకి దిగేటప్పుడు కాళ్లు ఫోల్డ్ చేయకూడదు. కాళ్లు భూమికి తగలగానే ఆగకూడదు. దిగీ దిగగానే కాస్తంత దూరం పరుగు తీశాక మాత్రమే ఆగాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వస్త్రధారణ, అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి.
స్కైకి చలో... డైవ్ కరో...
నగరం నుంచి సాహసికులు ఇప్పుడు బంగీ జంపింగ్స్, స్కై డైవింగ్ కోసం దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అవసరమైతే విదేశాలకు కూడా పయనమవుతున్నారు. మహారాష్ట్రలోని అంబీ వ్యాలీ, కర్ణాటకలోని మైసూర్, మధ్య ప్రదేశ్‌లోని థనా, ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ తదితర ప్రాంతాలు దేశంలో స్కై డైవింగ్‌కు పేరొందాయి. దేశంలో స్కై డైవింగ్‌కు అత్యల్పంగా 3 వేల అడుగుల నుంచి అత్యధికంగా 10 వేల అడుగుల వరకూ అందుబాటులో ఉంటే... మరింత ఎత్తు నుంచి డైవ్ చేయాలనుకుంటే మాత్రం విదేశాలకు వెళ్లాల్సిందే. ధరలు కూడా మన దేశంలో అత్యధికంగా రూ.40 వేల వరకు.. విదేశాల్లో మరింత అధికంగా ఉన్నాయి. స్కై డైవింగ్స్ కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా వంటివి బాగా వెళతారు.
డైవర్స్...పారా హుషార్
ఈ గాల్లో విన్యాసాలు ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్టు చేయలేరు. వయసు 55 దాటిన వాళ్లు చేయడానికి అనుమతించరు. హెవీగా తిన్న తర్వాత జంప్స్ ఒప్పుకోరు. హృద్రోగాలు, హైబీపీ, అవయవాల సమస్యలు ఉండకూడదు. స్కై డైవ్స్‌కి బరువు 90 కిలోలకు మించకూడదు. వీటి కోసం కొన్ని వారాల ముందే స్లాట్స్ బుక్ చేసుకోవాలి. మనకు ఇచ్చిన సమయానికి రెండు గంటల ముందే రిపోర్ట్ చేయాలి. ఏ సాహసమైనా ఒకటి రెండుసార్లు మాత్రమే భయం అనిపిస్తుంది. అలవాటైతే ఆడుకోవడమే. ఇలాంటి సాహసాలు కొత్త రకం అనుభూతినివ్వడమే కాక అద్భుతమైన రీతిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలో ఇతరత్రా సమస్యలను ఎదుర్కోవడంలో కూడా మనకు ఉపకరిస్తాయనేది నిజం.
Comments
Please login to add a commentAdd a comment