ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం
సాక్షి, హైదరాబాద్: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ పనుల పూర్తికి మరో రెండేళ్లకుపైగా పట్టే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీజలాలను వినియోగించుకొని తెలంగాణలోని అవిభాజ్య మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు పురుడుపోసుకున్నది. 2020 అక్టోబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపూర్తి చేసి తీరుతామంటూ పనులు చేపట్టిన జయప్రకాశ్ అసోసియేట్ అనే సంస్థ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి సొరంగం పనుల్లో ఎప్పుడూ ఓ ఆటంకం ఎదురవుతోంది. తాజాగా టన్నెల్ బోరింగ్ మిషన్ పాడవడంతో దాని మరమ్మతులకు మరో రూ.60కోట్లు అడ్వాన్స్ కోరగా ప్రభుత్వం అందుకు సమ్మతించింది.
అవాంతరాలు.. జాప్యం
2004లో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులకు రూ.2,813 కోట్లతో టెండర్లు పిలవగా 2005 ఆగస్టులో రూ.1,925 కోట్లకు జయప్రకాశ్ అసోసియేట్ ఏజెన్సీ పనులు దక్కించుకుంది. ఈ పనులను 2010 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలు, వరదల కారణంగా పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. పనుల ఆలస్యం కారణంగా వ్యయం రూ.4,200 కోట్లకు పెరిగింది. ఇందులో ఇప్పటివరకు రూ.2,200 కోట్లు ఖర్చు చేశారు. మిగతా పనులు కొనసాగుతుండగా, ఇటీవల ఔట్‌లెట్ టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురైంది. ఈ బోరింగ్ మిషన్ బేరింగ్, కన్వెయర్‌బెల్టు పాడవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ బోరింగ్ మిషన్ మరమ్మతులకే ఏడు నెలలు పట్టనున్న నేపథ్యంలో డెడ్‌లైన్‌లో పనుల పూర్తి సాధ్యమా అన్నదానిపై అనేక సందేహాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment