'కార్మికులకు స్మార్ట్ కార్డులు'
భువనగిరి: అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లాలో మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో కార్మికులకు స్మార్టు కార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రై వేట్ సంస్థల్లో పనిచేసే కార్మికులకు గుర్తింపు సంఖ్యను అందజేసి, వారిని సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా చేస్తామన్నారు.
కేంద్ర కార్మిక శాఖలోని రూ.27 వేల కోట్ల నిధులను రెండు నెలల్లోనే అన్ని రంగాల కార్మికులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీడీ కార్మికులు, అంగన్‌వాడీ సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని చెప్పారు. అలాగే, జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తమని పేర్కొన్నారు. అనంతరం ఆయన భువనగిరి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.