
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి పెద్దపల్లి పర్యటనకు బయల్దేరే సమయంలో సీఎం హెలికాప్టర్‌లోని ఓ బ్యాగ్ నుంచి వెలువడిన పొగలు కలకలం సృష్టించాయి. ఆ సమయంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. టేకాఫ్‌కు కొద్ది సమయం ముందు సీఎంవో, సీఎస్‌వో అధికారులు ఈ పొగలను గుర్తించారు. సీఎం సీఎస్‌వో ఎం.కె.సింగ్ ఆ బ్యాగును వెంటనే హెలికాప్టర్ నుంచి బయటకు లాగేశారు.
హెలికాప్టర్ సమీపంలో బందోబస్తు నిర్వహిస్తున్న కరీంనగర్ పోలీసు సిబ్బంది ఆ బ్యాగును వేగంగా తీసుకెళ్లి హెలిప్యాడ్‌కు దూరంగా విసిరేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్యాగ్‌లోని వైర్‌లెస్ సెట్ ద్వారా పొగలు వచ్చినట్టు తెలుస్తోంది. వైర్‌లెస్ సెట్ బ్యాటరీ వైర్లు కలవడం వల్ల ఓవర్‌హీట్ అయి అకస్మాత్తుగా పొగలు వెలువడినట్లు సమాచారం. హెలికాప్టర్ గాల్లోకి లేవకముందే బ్యాగ్‌ను గుర్తించి కింద పడేయడంతో ప్రమాదం తప్పినట్లయింది. తర్వాత సీఎం షెడ్యూల్ ప్రకారం హెలికాప్టర్‌లో పెద్దపల్లికి చేరుకున్నారు.
ఈ ఘటనపై అధికారులు నోరు విప్పడం లేదు. గత నెలలో ప్రాజెక్టుల బాట సమయంలో కూడా కరీంనగర్ నుంచి బయలుదేరే సమయంలో హెలికాప్టర్‌లో సాంకేతిక లోపంతో రెండుసార్లు పైకి లేచి కిందకు దిగింది. ఇప్పుడు బ్యాగ్‌లోంచి పొగలు రావడం కలకలం సృష్టిస్తోంది. రెండు ఘటనలు కరీంనగర్ ఉత్తర తెలంగాణ భవన్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. తాజా ఘటనపై పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ చేపట్టాయి.
కేటీఆర్, కవిత ట్వీట్
సీఎం హెలికాప్టర్‌లో పొగలు రావడంపై మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత ట్వీటర్‌లో స్పందించారు. సీఎం కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపామని, కేసీఆర్ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ‘చింతించాల్సిన అవసరం లేదు.. ఆల్ ఈజ్ వెల్..’అని కవిత ట్వీట్ చేశారు.