సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా వ్యాఖ్యానించారు. గురువారం గాంధీభవన్‌లో ఓబీసీ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుంతియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిరంతరం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచిస్తుందని చెప్పారు. బీసీ వర్గాలకు పార్టీ పదవుల్లో, ప్రభుత్వంలోనూ సమతూకం పాటిస్తూ సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ విజయం సాధించిన మూడు రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఓబీసీలకు పెద్ద పీట వేసిందని గుర్తుచేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టీపీసీసీ ఓబీసీ చైర్మన్‌గా డా.కత్తి వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల చైర్మన్‌లు ఓబీసీ విభాగం పక్షాన ప్రచారంలో ముందుండి కాంగ్రెస్‌ను గెలిపిస్తామని ప్రతినబూనారు. అనంతరం 17 పార్లమెంట్ స్థానాల్లో ఓబీసీ కో ఆర్డినేటర్లను నియమిస్తూ కత్తి వెంకటస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సమన్వయ కర్త ప్రొఫెసర్ ప్రకాష్ సొనవానే, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment