పంటకు రక్షణ...సోలార్ దీపపు ఎర
వర్గల్: పంటచేనులో పైరును నష్ట పరిచే పురుగుల ఉధృతిని అంచనా వేసేందుకు రైతులు పొలాల్లో విద్యుత్ బల్బులతో కూడిన దీపపు ఎరలు ఏర్పాటు చేస్తారు. ఎరలో చిక్కిన పురుగుల సంఖ్య ఆధారంగా తగు సస్యరక్షణ చేపడుతుంటారు. లేదా వ్యవసాయాధికారుల సలహా తీసుకుంటారు. కోతల కాలం..కరెంటు ఎపుడుంటుందో, ఎపుడుపోతుందో, ఎన్ని సార్లు పోతుందో, అసలు ఆ రోజు వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి గడ్డు కాలంలో కరెంటు ఆధారంగా ఏర్పాటు చేసిన దీపపు ఎరలు చతికిలపడతాయనడంలో సందేహం లేదు. కరెంటు అవసరం లేకుండా కేవలం సూర్య కాంతి ఆధారంగా స్వయం ఇంధనం సమకూర్చుకుని పనిచేసే ‘సోలార్ దీపపు ఎర’లు అందుబాటులోకి వచ్చాయి. చక్కని పనితీరుతో రైతుకు ఉపయుక్తంగా నిలిచిన ఈ సోలార్ ఎరలకు ప్రభుత్వం సబ్సిడీలను సైతం ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
వర్గల్ మండలం అంబర్‌పేటలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శన కోసం వ్యవసాయ శాఖ (ఆత్మ) ఈ సోలార్ దీపపు ఎరను ఏర్పాటు చేయించింది. మంగళవారం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన కార్యక్రమంలో విద్యుత్ అవసరం లేని ఈ ఎర ప్రయోజనాన్ని, ధర తదితర వివరాలను గజ్వేల్ ఏడీఏ శ్రవణ్ కుమార్, ఆత్మ బీటీఎం శ్రీధర్ రావులు వివరించారు.
విద్యుత్ కోతలకు ప్రత్యామ్నాయం
పగటివేళ సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకునే సోలార్ ప్లేట్, దీపపు స్టాండ్ పైన బిగించి ఉంటుంది. దిగువన సోలార్ దీపం అమరి ఉంటుంది. దాని కింద ఇనుప తొట్టె (దాదాపు 8 లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం) ఉంటుంది. దీంట్లో నీటిని నింపి నాలుగు చుక్కలు కిరోసిన్ వేయాలి. పగలు సోలార్ శక్తిని స్వీకరించిన ఈ దీపం చీకటి పడగానే ప్రకాశవంతంగా వెలుగుతుంది. పొలంలో ఉన్న రెక్కల పురుగులు ఈ దీపం వెలుతురుకు ఆకర్షితమై ఎరతో కూడిన ఇనుప తొట్టె ద్రావణంలో పడి చనిపోతాయి. ఎరలో పడిన పురుగుల సంఖ్య ఆధారంగా వాటి ఉధృతి అంచనా వేయవచ్చు.
పురుగుల దాడి తీవ్రత ఆధారంగా తగు సస్యరక్షణ చేపట్టి భారీ నష్టం వాటిల్లకముందే తగు సస్యరక్షణతో పంటను కాపాడుకునే అవకాశముంటుంది. విద్యుత్‌కు ప్రత్యమ్నాయంగా నిలిచే ఈ ఎరలను రైతులకు సబ్సిడీపై ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది కార్యరూపం దాల్చితే 50 శాతం సబ్సిడీ (సగం ధర)కే వీటిని రైతులు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని ధర రూ.2,800. ఒక ఎకరం చేలో రెండు సోలార్ ట్రాప్‌లు ఏర్పాటు చేసుకోవాలని, వీటిని సులువుగా ఎక్కడికైనా తీసుకెల్లవచ్చని అధికారులు వివరించారు. వీటికి సంబంధించిన సమాచారం కోసం రైతులు ఏడీఏగజ్వేల్-సెల్ నంబర్ 8886614286లో సంప్రదించవచ్చు.