బీజేపీలో చేరిన సోమారపు సత్యనారాయణ
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : రాజకీయ అరంగేట్రంలో అరితేరిన సోమారపు సత్యనారాయణ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది రోజులకే కాషాయ కండువా కప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్‌ఎస్ పార్టీల్లో కీలక పాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం బీజేపీలో చేరి అన్నివర్గాల్లో చర్చలేపుతున్నారు. ఏపార్టీలో ఉన్నప్పటికీ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవికి డైరెక్ట్‌గా ఎన్నికలు నిర్వహిస్తే తాటు పోటీలో ఉండి విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్న ఆయన బీజేపీలో చేరడంతో ఈ ప్రాంతంలో బీజేపీకి పట్టు పెరిగే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఇంజినీర్‌గా పనిచేసిన సోమారపు సత్యనారాయణ మొదట కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. నోటిఫైడ్ ఏరియాగా ఉన్న ఈప్రాంతంలో 1998 జూన్ 30న నిర్వహించిన మొట్టమొదటి రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ సాధించి టీడీపీ అభ్యర్థి గోపు అయిలయ్యయాదవ్‌పై గెలుపొందారు. 2004 జూలై 2 వరకు చైర్మన్‌గా కొనసాగినప్పటికీ పలు కారణాల వల్ల అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో మంథనికి మారారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. పునర్విభజనలో మేడారం నియోజకవర్గం రద్దయి రామగుండం జనరల్ నియోజకవర్గంగా మారడంతో తిరిగి మళ్లీ ఇక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.
రామగుండం ఎమ్మెల్యేగా..
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి బాబర్ సలీంపాషాపై విజయం సాధించాడు. ఆతర్వాత వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసి ప్రత్యర్థి ఆలిండియా పార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై విజయం సాధించాడు. 2016లో తెలంగాణా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా బరిలో దిగి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై ఓటమి పాలయ్యారు. తిరిగి కోరుకంటి చందర్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో ఇరువురి మధ్య రాజకీయ వైరం ప్రారంభమైన క్రమంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ సేకరణలో తమను గుర్తించలేదని, కనీసం సభ్యత్వం కూడా ఇవ్వలేదని పేర్కొంటూ ఈనెలలో రాజీనామా చేశారు.
బీజేపీ తీర్థం..
టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన వారం రోజుల్లోగా బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధిష్టానం చర్చించడంతోపాటు ఇద్దరు ఎంపీలు తన ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో ఆదివారం రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment