పాపం.. పొన్నాల | sorry ponnala lakshmaiah | Sakshi
Sakshi News home page

పాపం.. పొన్నాల

Published Fri, Jul 4 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

పాపం.. పొన్నాల

పాపం.. పొన్నాల

  •      మెజారిటీ ఉన్నా ‘చే’జారిన జనగామ మునిసిపాలిటీ పీఠం
  •      సొంత ఇలాకాలో దెబ్బమీద దెబ్బ
  •      ముత్తిరెడ్డి వ్యూహాలకు కాంగ్రెస్ కుదేలు
  •      బీజేపీ, స్వతంత్రులు, ఇతర పార్టీల    పొత్తుతో ముందడుగు
  •      క్లైమాక్స్‌లో వ్యూహాత్మక అడుగులు వేసిన స్థానిక ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి
  • జనగామ : తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఎమ్మెల్యేగా ఘోర పరాభవం చవిచూడడమే కాకుం డా సొంత నియోజకవర్గ కేంద్ర ‘పుర’ పోరులో నూ చతికిల పడ్డారు. మునిసిపాలిటీలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎత్తులకు కాంగ్రెస్ పార్టీ కుదేలయింది. జనగామ మునిసిపాలిటీ పరిధిలో 28 వార్డులుండగా 14 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.

    టీఆర్‌ఎస్ కేవలం 6 స్థానాలు మాత్రమే గెలుచుకున్నా చైర్‌పర్సన్ పదవి ఆ పార్టీకి చెందిన గాడిపెల్లి ప్రేమలతా రెడ్డినే వరించింది. అసాధ్యం అనుకున్న దానిని బీజేపీ, సీపీఎం, ఇండిపెండెంట్ల మద్ధతుతో సుసాధ్యం చేసుకున్నారు. 30 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవమున్న పొన్నాల లక్ష్మ య్య తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్తిరెడ్డి వ్యూహాలను ఎదుర్కోలేక పోయారు. అనుచరుల ఏమరపాటు, తప్పిదాలు ఆయనకు మరింత అప్రతిష్టను తెచ్చిపెట్టాయి. ఫలితంగా ‘పుర’ అధ్యక్ష స్థానానికి పార్టీ దూరమైంది.
     
    రూ.అర కోటి ఖర్చు..
     
    ‘పుర’ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి మొన్న టి వరకు కాంగ్రెస్ పార్టీ నడిపింది. 28వ డివిజన్ కౌన్సిలర్ యాదమ్మతోపాటు 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, వారి కుటుంబసభ్యులు, క్యాంపు ఇన్‌చార్జ్‌లు, నాయకులు కలిపి సుమారు 45 నుంచి 50 మంది ఎంజాయ్ చేశారు. ఇందుకు అవసరమైన నిధులను చైర్మన్ ఆశావహుల నుంచి ముందస్తుగా డిపాజిట్ రూపంలో వసూలు చేసి ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. 51 రోజులపాటు కొనసాగిన క్యాంపు లో దాదాపు రూ.అరకోటి ఖర్చయినట్లు కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. పొన్నాల సొంత నియోజకవర్గం కావడం తో సహజంగానే ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్యేగా ఓడినందున పుర పీఠం దక్కినా పరువు నిలుస్తుందని పాకులాడారు. అయినా ఫలితం దక్కలేదు.
     
    ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అపర చాణక్యం
     
    కాంగ్రెస్ పార్టీ రూ.లక్షలు ఖర్చు పెడుతూ క్యాంపు నిర్వహిస్తే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాత్రం జనగామ కేంద్రంగా ఎత్తులు వేస్తూ ముందుకుసాగారు. ఒకానొక దశలో చైర్మన్ పదవిపై పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అనుకునేంత నిశ్శబ్దంగా ఉన్నారు. కాంగ్రెస్ మినహా ఉన్న నలుగురు బీజేపీ కౌన్సిలర్లతో మాట్లాడి వైస్ చైర్మన్ పదవి అప్పగింత నిబంధనతో ఒప్పందం చేసుకున్నారు. బయట ఉన్న ఇండిపెండెంట్లతోపాటు సీపీఎం కౌన్సిలర్‌ను తన వైపు తిప్పుకోవడంతో సంఖ్య 13కు చేరింది. ఎంపీతోపాటు తన ఓటుతో బలం 15కు చేరింది.

    ఇదే క్రమంలో కాంగ్రెస్ క్యాంపులో ఉన్న కౌన్సిలర్ యాదమ్మ కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకున్నారు. బయటకు విషయం పొక్కకుండా వారితో జనగామ పోలింగ్‌స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేయించారు. కొద్ది రోజుల క్రితం ఈ కేసును హైదరాబాద్‌కు బదలాయింప జేశారు. కాంగ్రెస్ క్యాంపు వివరాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ వచ్చారు. చైర్మన్ ఎన్నికకు గడువు దగ్గరపడుతున్న క్రమంలో వ్యూహాల పదును పెం చారు.

    యాదమ్మతో మాట్లాడాలని ఆమె కుటుంబసభ్యులతో మంగళవారం ఫోన్ చేయించి సమాచారం సేకరించారు. హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్‌లో ఉన్నట్లు తెలుసుకుని ఆదే రోజు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హఠాత్తుగా పోలీసులు రిసార్ట్స్‌కు చేరుకుని చట్టం ప్రకారం యాదమ్మను బయటకు తీసుకువచ్చారు.

    ఆ తర్వాత యాదమ్మను తమ వైపు తిప్పుకోగా కాంగ్రెస్ బలం 14కు పడిపోయి టీఆర్‌ఎస్ మ్యాజిక్ ఫిగర్ 16కు చేరింది. ఏది ఏమైనా చైర్మన్ గిరీ చేజారింది. ఇండిపెండెంట్ యాదమ్మ మద్ధతు, ఎక్స్ అఫీషియో మెంబర్లుగా భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మద్దతుతో పీఠం గులాబీకి దక్కింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement