కాంగ్రెస్‌లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు గ్రూప్ పాలిటిక్స్ సాధారణమే. తెలంగాణ రాష్ట్రంలో అయితే నాయకులు మరో ఆకు ఎక్కువే చదివారు. సీనియర్లు, జూనియర్లుగా..కొత్త, పాత నేతలుగా విడిపోయి కొట్లాడుకుంటారు. తాజాగా ఓరుగల్లు కాంగ్రెస్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నేతల మధ్య వైరం కొంప ముంచేట్లు ఉందని కేడర్ ఆందోళన పడుతోంది. ఇంతకీ ఓరుగల్లు కోటలో ఏం జరుగుతోందో చదవండి
స్వపక్షంలో విపక్షం
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో టిక్కెట్ రాజకీయాలు జోరందుకున్నాయి. గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదని పార్టీ హైకమాండ్ భావిస్తోంటే.. జిల్లా నేతల గ్రూప్ రాజకీయాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హన్మకొండతో పాటు జనగామలో గ్రూప్ వార్ సాగుతోంది. స్వపక్షంలోనే విపక్షంలా మారి ఒకరికొకరు ప్రత్యర్థులుగా తయారయ్యారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మధ్య జరుగుతుంటే.. జనగామలో పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి మధ్య వార్ మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతూ పోటాపోటీ కార్యక్రమాలతో కత్తులు దూసుకుంటున్నారు.
ఒకరికి ఒకరు మోకాలడ్డు..
వరంగల్ పశ్చిమ టికెట్ కోసం పోటీ పడుతున్న నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి పోటాపోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రను ఇద్దరు నేతలు వేర్వేరుగా చేపట్టడంతో పాటు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడంతో నిరసన దీక్షను కూడా వేర్వేరుగా చేపట్టారు.
ఇద్దరు మధ్య గొడవపై అధిష్టానం ఆరాతీయడంతో జంగా కాస్త వెనక్కి తగ్గారు. నాయిని మాత్రం జంగాపై చేసిన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గలేదు. ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూనే ఎదుటివారిని సస్పెండ్ చేయాలంటూ పార్టీ నాయకత్వాన్ని ఇద్దరూ డిమాండ్ చేస్తున్నారు. జంగా రాఘవరెడ్డి జనగామ, పాలకుర్తి నియజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ పోటీదారులకు కాస్త కలవరంగానే మారారు.
చేయికి చేయి.. పోటాపోటీ
జనగామ టిక్కెట్ రేసులో పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉన్నారు. గత కొంత కాలంగా పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ఇద్దరూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నియోజక వర్గంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఇద్దరు నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.
పార్టీ శ్రేణుల మద్దతు తనకే ఉందని కొమ్మూరి చెబుతుండగా.. అధిష్టానం తనను కాదని మరొకరికి టికెట్ ఇచ్చే అవకాశమే లేదన్న ధీమాతో పొన్నాల పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు.
జనగామలో చేయిచ్చేదెవరికి.?
పొన్నాల లక్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలు చిరకాల రాజకీయ ప్రత్యర్థులు. గతంలో ప్రత్యర్థులుగా తలబడ్డ ఇద్దరు నేతలు 2018 ఎన్నికలకు ముందు ఒకే గూటి పక్షులై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొమ్మూరి 2018 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పొన్నాలతో దోస్తీ కట్టి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొన్నాల గెలుపు కోసం కృషి చేశారు.
అయితే పొన్నాల ఓటమి పాలు కావడంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. ఓటమి అనంతరం పొన్నాల లక్ష్మయ్య కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీ నేతల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. కష్టకాలంలో కార్యకర్తలను, పార్టీని వదిలేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కాంగ్రెస్ రాజకీయాలు ఒకపట్టాన కొలిక్కి రావు. హైకమాండ్ చెప్పినా వినని నాయకులు చాలామందే ఉంటారు. టిక్కెట్ల విషయంలో అయితే అసలు రాజీపడరు. చివరికి జనగామ టిక్కెట్ విషయంలో ఎవరు నెగ్గుతారో చూడాలి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment