సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ పద్మవ్యూహం లేదు. వాహనాల రణగొణ లేదు. అంతటా నిశ్శబ్దమే. ‘చెవు’లూరించే వాతావరణమే. కర్ణభేరి దద్దరిల్లే ధ్వనులకు విరామం. నగరవాసులకు శబ్ద విముక్తి. ఇదీ ఇటీవల సిటీలో నెలకొన్న పరిస్థితి. లాక్‌డౌన్ నేపథ్యంలో ముఖ్య కూడళ్లు, ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం సగానికి పైగా తగ్గింది. నగరంలో లక్షలాది వాహనాలు ఇళ్లకే పరిమితం కావడంతో వాయు నాణ్యతలోనూ మెరుగుదల కనిపిస్తోంది. నిత్యం 90– 100 డెసిబుల్స్‌కు పైగా శబ్ద కాలుష్యం నమోదయ్యే అబిడ్స్, పంజాగుట్ట, ప్యారడైజ్, బాలానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ప్రస్తుతం 40– 50 డెసిబుల్స్ మాత్రమే శబ్ద కాలుష్యం నమోదవుతుండడం విశేషం. దీంతో ప్రస్తుతం ఇళ్లకే పరిమితమైన నగరవాసులు కంటి నిండా నిద్రకు నోచుకుంటున్నారు. పీసీబీ ప్రమాణాల ప్రకారం పారిశ్రామిక వాడల్లో పగలు 75 డెసిబుల్స్.. రాత్రి 70 డెసిబుల్స్, వాణిజ్య ప్రాంతంలో పగలు 65.. రాత్రి 55 డెసిబుల్స్, నివాస ప్రాంతాల్లో పగలు 55.. రాత్రి 45 డెసిబుల్స్, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, జూపార్క్ తదితర సున్నిత ప్రాంతాల్లో పగలు 50.. రాత్రి 40 డెసిబుల్స్‌కు మించి శబ్ద కాలుష్యం మించరాదు. కానీ నగరంలో ఏడాదికి సుమారు 300 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం 90– 100 డెసిబుల్స్ నమోదయ్యేది. ఇటీవల పలు పారిశ్రామిక వాడలు, వాణిజ్య, నివాస, సున్నిత ప్రాంతాల్లో ఈ నెల 15న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శబ్ద కాలుష్యాన్ని నమోదు చేసింది.
కారణాలివీ..
♦ లాక్‌డౌన్ నేపథ్యంలో నగరంలో నిత్యం రాకపోకలు సాగించే 50 లక్షల వాహనాలు ఇళ్లకే పరిమితమయ్యాయి.
♦ మూడు కిలోమీటర్ల నిబంధన, ట్రాఫిక్ పోలీసులు పలు వాహనాలను సీజ్ చేస్తుండటంతో సిటీజన్లు ఎక్కువ దూరం ప్రయాణించడంలేదు.
♦ ఆర్టీసీ బస్సులు, ఆటోలు సైతం రోడ్డెక్కకపోవడం.
♦ నిర్మాణ రంగ కార్యకలాపాలు నిలిచిపోవడంతో డంపర్లు, లోడర్లు, ఆర్‌ఎంసీ కాంక్రీట్ వాహనాలు సైతం నగరంలో రాకపోకలు సాగించడంలేదు.
♦ నగరంలో సుమారు 15లక్షల మేర ఉన్న 15ఏళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు గడప దాటకపోవడంతో రణగొణ ధ్వనుల నుంచి విముక్తి లభించింది.
మెరుగుపడిన వాయు నాణ్యత..
♦ నగరంలో వాయు నాణ్యతా సూచి సైతం 50 పాయింట్ల లోపుగా నమోదవడంతో వాయు నాణ్యత పరంగా అత్యంత సంతృప్త నగరంగా గ్రేటర్ హైదరాబాద్ నిలిచింది. ప్రధానంగా లక్షలాది వాహనాలు రోడ్డెక్కకపోవడంతో ఇంధన వినియోగం తగ్గి వాహన కాలుష్యం తగ్గుముఖం పట్టడం విశేషం. ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లతో పాటు సూక్ష్మ, స్థూల ధూళి కణాల కాలుష్యం తగ్గడంతో సిటీజన్లు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment