టెర్మినల్‌ 4@లింగంపల్లి | South Central Railway activities for development of suburban stations | Sakshi
Sakshi News home page

టెర్మినల్‌ 4@లింగంపల్లి

Published Tue, Sep 11 2018 1:14 AM | Last Updated on Tue, Sep 11 2018 1:17 AM

South Central Railway activities for development of suburban stations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, పలు బహుళ జాతీయ కంపెనీలకు నిలయంగా ఉన్న నగరం పశ్చిమ భాగం శరవేగంగా దూసుకెళుతోంది. అంటే కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, మియాపూర్‌ పరిసర ప్రాంతాల్లో రియల్‌ రంగం పరుగులు తీస్తోంది. వివిధ ప్రాంతాల ప్రజలు స్థిరనివాసాలు ఏర్పరుచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదేసమయంలో సికింద్రాబాద్‌ స్టేషన్‌పై భారాన్ని వీలైనంత తగ్గించాలన్న ప్రతిపాదన చాలారోజుల నుంచి దక్షిణ మధ్య రైల్వేలో ఉంది.

ఇందులో భాగంగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదేశాల మేరకు, దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్‌ శివారు స్టేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించారు. అందుకే, ఇప్పుడున్న హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడకు తోడుగా నాలుగో టెర్మినల్‌గా లింగంపల్లిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల ప్రజలు ప్రయాణాలు సాగించేందుకు వీలుగా ఉండేలా.. లింగంపల్లి స్టేషన్‌లో గత 4 ఏళ్లుగా సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే ఇక్కడి నుంచే పలు కీలక రైళ్లను ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వీటికి చక్కటి ఆదరణ ఉండటంతో భవిష్యత్తులో మరిన్ని రైళ్లు ఇక్కడ నుంచే ప్రారంభమయ్యేలా రైల్వే ప్రణాళికలు రచిస్తోందని సీపీఆర్వో ఉమాశంకర్‌ తెలిపారు. 

సదుపాయాలకూ పెద్దపీట.. 
టెర్మినల్‌లో రైళ్లు ఆగాలంటే వాటి నిర్వహణ చాలా ముఖ్యం. రైలు శుభ్రపరచడం, నీళ్లు నింపడం, బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు తదితర నిర్వహణ లింగంపల్లిలో జరుగుతోంది. దాదాపుగా రూ.7 కోట్లు వెచ్చించి ఈ సదుపాయాలు కల్పించారు. రూ.2.5 కోట్లతో కొత్తభవనం నిర్మించారు. బుకింగ్‌ ఆఫీసు, వీఐపీ లాంజ్, వెయిటింగ్‌ హాల్స్, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి (రూ.3.2 కోట్లు), ప్లాట్‌ఫాంల విస్తరణ, తాగునీటి సదుపాయాలు కల్పించారు. మొత్తానికి రూ.18 కోట్లు పెట్టి సదుపాయాలు కల్పిస్తున్నారు.  

ఈదుల నాగులపల్లిపైనా దృష్టి.. 

శివారు స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ఈదులనాగులపల్లిపైనా దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. రింగురోడ్డును ఆనుకుని ఉండటంతో దీన్నీ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉంది. ఈ స్టేషన్‌ పరిసరాల్లోనూ నివాస ప్రాంతాలు పెరుగుతున్నాయి. నగరానికి, ఔటర్‌కి సమీపంలో ఉండటంతో దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుతో పాటు నగరం చుట్టుపక్కలకు రవాణా మరింత అనుకూలంగా మారుతుంది. ఇక్కడి టెర్మినల్‌కు 300 ఎకరాలు అవసరమవగా ఇప్పటికే 150 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి. త్వరగా ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉన్నాయి.

లింగంపల్లి నుంచి ప్రయాణం సాగించే వివిధ రైళ్లు 
- న్యూహమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (19315/19316)
- లింగంపల్లి– ఇండోర్‌ రైలును మే 27 నుంచి ప్రారంభించారు.  

స్టాప్‌ సౌకర్యం కల్పించినవి.. 
- తిరుపతి–షిరిడీ–తిరుపతి (నం.17417/17418) వీక్లీ 
- హైదరాబాద్‌ – గుల్బర్గా– హైదరాబాద్‌ (నం.11308/11307) ఇంటర్‌సిటీ డెయిలీ
- యశ్వంత్‌పూర్‌– టాటానగర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (నం.18112/18111)

లింగంపల్లి వరకు పొడిగించినవి
- గౌతమి ఎక్స్‌ప్రెస్‌ (12737/38)
- కాకినాడ్‌ టౌన్‌ ఎక్స్‌ప్రెస్‌ (12775/76)
- విజయవాడ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ (12795/96)  
- నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ (12733/34)
- రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ (17429/30)
- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (12749/50)
- కొల్లాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (11304/03) 

లింగంపల్లిలో ఆగే దూరప్రాంత రైళ్లు.. 
- గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ (12735/36),
- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (18519/ 20)
- కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11019/20)
- హైదరాబాద్‌–పుణే ఎక్స్‌ప్రెస్‌ (17014/13). 

ప్రయాణికుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి
దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌  
ప్రయాణికుల భద్రత పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్‌ అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో ప్రయాణికులు, సిగ్నలింగ్‌ వ్యవస్థ, కాపలా, కాపలా లేని లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రైల్వే భద్రతలో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డులను జీఎం అందజేశారు. విజయవాడ రైల్వే డివిజన్‌కు చెందిన లోకో పైలట్‌ కాళీ ప్రసాద్, గుంతకల్‌ డివిజన్‌కు చెందిన లోకో పైలట్‌ ఎస్‌.నాయుడు, గుంటూరు డివిజన్‌కు చెందిన లోకో పైలట్‌ వీవీ రావు, సికింద్రాబాద్‌కు చెందిన పోస్ట్‌మ్యాన్‌ పి.కృష్ణ సహా 8 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థ, కాపలా, కాపలా లేని లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు సిగ్నలింగ్‌ వ్యవస్థను సరిచూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైల్వే భద్రత, ప్రయాణికుల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించి చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జీఎం జాన్‌ థామస్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement