Vinodkumar Yadav
-
పనుల్లో వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తలపెట్టిన రైల్వే పనుల్లో వేగం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌కు ఎంపీలు విన్నవించారు. గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జీఎం ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, లింగయ్య యాదవ్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆర్ఆర్ పాటిల్, మల్లారెడ్డి, బాల్కసుమన్, దత్తాత్రేయ, నంది ఎల్లయ్య హాజరయ్యారు. ఆయా ఎంపీల నియోజకవర్గాల్లో జరుగుతున్న రైల్వేపనుల పురోగతి, పెం డింగ్ పనులు, ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి)లు, ఆర్యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి)లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, కొత్త లైన్ సర్వేలు, భూసేకరణ విషయాలపై చర్చించారు. అనంతరం చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. సంతృప్తికరమే: జితేందర్‌రెడ్డి సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. భూసేకరణ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని జీఎంను కోరాం. షాద్‌నగర్ ఆర్వోబీ నిర్మాణ పనులు చేపట్టాలని విన్నవించాం. నడికుడి రైల్వే లైన్ చేపట్టండి: గుత్తా, లింగయ్య నల్లగొండలో రైల్వే ప్రాజెక్టుల పనులు సంతృప్తికరంగా లేవు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరాం. మాచర్ల–నల్లగొండ రైల్వే లైన్ 20 ఏళ్ల కింద అనుమతులొచ్చినా.. పక్కనపెట్టడం సరికాదు. ఆర్థికంగా ప్రయోజనకరమైన నడికుడి–బీబీనగర్ డబ్లింగ్ పనులను చేపట్టాలి. హాల్టింగులు పెంచాలి: బూర నర్సయ్య రాయగిరి స్టేషన్ పేరును యాదాద్రిగా మార్చాలని జీఎంను కోరాం. భువనగిరిలో శాతవాహన, నాందేడ్, విశాఖపట్నంతో పాటు పలు రైళ్లకు హాల్టింగ్‌లు ఇవ్వాలని లేఖ ఇచ్చాం. హైదరాబాద్–అమరావతి–మచిలీపట్నం వరకు సూపర్ ఫాస్ట్ హైస్పీడ్ ట్రైన్ వేయాలి. రైల్వే విధానం మారాలి: విశ్వేశ్వర్‌రెడ్డి రైల్వే విధానంలో మార్పు రావాలి. రైల్వే అన్ని వర్గాలకు అందుబాటులోకి రావాలి. సూపర్ ఫాస్ట్ పేరుతో చాలా రైళ్లను స్థానికంగా ఆపడం లేదు. కొత్త లైన్ వేయండి: ఆర్ఆర్ పాటిల్ జహీరాబాద్‌కు కొత్త రైళ్లు వేయాలని జీఎంను కోరాం. సిద్దిపేట–సంగారెడ్డి–పటాన్చెరు నుంచి సికింద్రాబాద్‌కు నేరుగా లైన్ వేయాలని విన్నవించాం. శివారు స్టేషన్లను అభివృద్ధి చేయండి: మల్లారెడ్డి చర్లపల్లి టెర్మినల్ పనులు మొదలుపెట్టాలి. సికింద్రాబాద్ స్టేషన్‌పై రద్దీ భారాన్ని తగ్గించేందుకు మల్కాజ్గిరి, మేడ్చల్ వంటి శివారు స్టేషన్లను అభివృద్ధి చేయాలి. కొత్త లైన్, రైళ్లు కావాలి: వినోద్ మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్‌కు రూ.500 కోట్లు కేటాయించారు. వచ్చే బడ్జెట్లో మరిన్ని నిధులివ్వాలని కోరాం. పాలమూరు నుంచి కాచిగూడ మేడ్చల్ నిజామాబాద్ వరకు కొత్త రైలు వేయాలని విన్నవించాం. సదుపాయాలు ఏర్పాటు చేయాలి: బాల్క పెద్దపల్లి నియోజవర్గంలోని రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాలలో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులకు వీలైన సదుపాయాలు కల్పించాలని కోరాం. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే: దత్తాత్రేయ హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్–1, ఎంఎంటీఎస్–2 తెచ్చిన ఘనత బీజేపీదే. రైల్వే తరఫున పూర్తి నిధులు విడుదలయ్యేలా కేంద్రం కృషి చేసినా రాష్ట్రం వాటా అందకపోవడం వల్లే ఎంఎంటీఎస్–2 ప్రారంభం కావడం లేదు. సికింద్రాబాద్–యాదాద్రి, కాజీపేట–సికింద్రాబాద్ మూడో లైన్, చర్లపల్లి టెర్మినల్ పనులు మొదలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే కారణం.. సీఎం వివక్ష చూపిస్తున్నారు: నంది ఎల్లయ్య సమావేశం నుంచి నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య వాకౌట్ చేశారు. తన నియోజకవర్గంలోని రైల్వే ప్రాజెక్టుల కోసం సీఎం అనుమతి కోసం తిరుగుతున్నా అపాయింట్ మెంట్ దొరకడం లేదని, 12 లేఖలు రాసినా స్పందన లేదని వాపోయారు. గద్వాల్–వనపర్తి–నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేటలలో ప్రతిపాదిత రైలు మార్గానికి రైల్వే శాఖ ఓకే చెప్పినా సీఎం ఫైల్‌పై సంతకం చేయడం లేదన్నారు. ఆరు రెట్లు అధిక నిధులు: జీఎం వినోద్ 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.1,890 కోట్లు దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాజెక్టులపై వెచ్చించిందని జీఎం వినోద్ కుమార్ చెప్పారు. చర్లపల్లి టెర్మినల్‌కు నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు మొదలవుతాయన్నారు. ‘తెలంగాణలో 100 కి.మీ. మేర డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఎంఎంటీఎస్–2 పనులు వేగంగా నడుస్తున్నాయి. తెలంగాణ వాటా ఇంకా రూ.336 కోట్లు రావాల్సి ఉంది. అక్టోబర్ కల్లా తెలంగాణలో కాపలా లేని లెవెల్ క్రాసింగ్స్ ఉండవు. ఘట్కేసర్–యాదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి రైల్వే సిద్ధంగా ఉంది. ఇందుకు రాష్ట్రమే ముందుకురావాలి. మనోహరాబాద్–కొత్తపల్లి మార్గంలో భూసేకరణ వేగంగా జరుగుతోంది. కరీంనగర్–హసన్‌పర్తి రైల్వే లైన్ సర్వే వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తాం’అని ఆయన చెప్పారు. -
టెర్మినల్ 4@లింగంపల్లి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్, పలు బహుళ జాతీయ కంపెనీలకు నిలయంగా ఉన్న నగరం పశ్చిమ భాగం శరవేగంగా దూసుకెళుతోంది. అంటే కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో రియల్ రంగం పరుగులు తీస్తోంది. వివిధ ప్రాంతాల ప్రజలు స్థిరనివాసాలు ఏర్పరుచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదేసమయంలో సికింద్రాబాద్ స్టేషన్‌పై భారాన్ని వీలైనంత తగ్గించాలన్న ప్రతిపాదన చాలారోజుల నుంచి దక్షిణ మధ్య రైల్వేలో ఉంది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆదేశాల మేరకు, దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్ శివారు స్టేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించారు. అందుకే, ఇప్పుడున్న హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడకు తోడుగా నాలుగో టెర్మినల్‌గా లింగంపల్లిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల ప్రజలు ప్రయాణాలు సాగించేందుకు వీలుగా ఉండేలా.. లింగంపల్లి స్టేషన్లో గత 4 ఏళ్లుగా సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే ఇక్కడి నుంచే పలు కీలక రైళ్లను ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వీటికి చక్కటి ఆదరణ ఉండటంతో భవిష్యత్తులో మరిన్ని రైళ్లు ఇక్కడ నుంచే ప్రారంభమయ్యేలా రైల్వే ప్రణాళికలు రచిస్తోందని సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. సదుపాయాలకూ పెద్దపీట.. టెర్మినల్‌లో రైళ్లు ఆగాలంటే వాటి నిర్వహణ చాలా ముఖ్యం. రైలు శుభ్రపరచడం, నీళ్లు నింపడం, బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు తదితర నిర్వహణ లింగంపల్లిలో జరుగుతోంది. దాదాపుగా రూ.7 కోట్లు వెచ్చించి ఈ సదుపాయాలు కల్పించారు. రూ.2.5 కోట్లతో కొత్తభవనం నిర్మించారు. బుకింగ్ ఆఫీసు, వీఐపీ లాంజ్, వెయిటింగ్ హాల్స్, ఫుట్ఓవర్ బ్రిడ్జి (రూ.3.2 కోట్లు), ప్లాట్‌ఫాంల విస్తరణ, తాగునీటి సదుపాయాలు కల్పించారు. మొత్తానికి రూ.18 కోట్లు పెట్టి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈదుల నాగులపల్లిపైనా దృష్టి.. శివారు స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ఈదులనాగులపల్లిపైనా దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. రింగురోడ్డును ఆనుకుని ఉండటంతో దీన్నీ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉంది. ఈ స్టేషన్ పరిసరాల్లోనూ నివాస ప్రాంతాలు పెరుగుతున్నాయి. నగరానికి, ఔటర్‌కి సమీపంలో ఉండటంతో దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు నగరం చుట్టుపక్కలకు రవాణా మరింత అనుకూలంగా మారుతుంది. ఇక్కడి టెర్మినల్‌కు 300 ఎకరాలు అవసరమవగా ఇప్పటికే 150 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి. త్వరగా ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉన్నాయి. లింగంపల్లి నుంచి ప్రయాణం సాగించే వివిధ రైళ్లు - న్యూహమ్సఫర్ ఎక్స్‌ప్రెస్ (19315/19316) - లింగంపల్లి– ఇండోర్ రైలును మే 27 నుంచి ప్రారంభించారు. స్టాప్ సౌకర్యం కల్పించినవి.. - తిరుపతి–షిరిడీ–తిరుపతి (నం.17417/17418) వీక్లీ - హైదరాబాద్ – గుల్బర్గా– హైదరాబాద్ (నం.11308/11307) ఇంటర్సిటీ డెయిలీ - యశ్వంత్‌పూర్– టాటానగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (నం.18112/18111) లింగంపల్లి వరకు పొడిగించినవి - గౌతమి ఎక్స్‌ప్రెస్ (12737/38) - కాకినాడ్ టౌన్ ఎక్స్‌ప్రెస్ (12775/76) - విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (12795/96) - నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (12733/34) - రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (17429/30) - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (12749/50) - కొల్లాపూర్ ఎక్స్‌ప్రెస్ (11304/03) లింగంపల్లిలో ఆగే దూరప్రాంత రైళ్లు.. - గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ (12735/36), - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18519/ 20) - కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019/20) - హైదరాబాద్–పుణే ఎక్స్‌ప్రెస్ (17014/13). ప్రయాణికుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ ప్రయాణికుల భద్రత పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో ప్రయాణికులు, సిగ్నలింగ్ వ్యవస్థ, కాపలా, కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రైల్వే భద్రతలో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ‘మ్యాన్ ఆఫ్ ది మంత్’ అవార్డులను జీఎం అందజేశారు. విజయవాడ రైల్వే డివిజన్‌కు చెందిన లోకో పైలట్ కాళీ ప్రసాద్, గుంతకల్ డివిజన్‌కు చెందిన లోకో పైలట్ ఎస్.నాయుడు, గుంటూరు డివిజన్‌కు చెందిన లోకో పైలట్ వీవీ రావు, సికింద్రాబాద్‌కు చెందిన పోస్ట్‌మ్యాన్ పి.కృష్ణ సహా 8 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ, కాపలా, కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు సిగ్నలింగ్ వ్యవస్థను సరిచూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైల్వే భద్రత, ప్రయాణికుల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించి చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జీఎం జాన్ థామస్ పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లలో సమస్యల తిష్ట
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని స్టేషన్లలో కూర్చునేందుకు బెంచీలు కూడా లేవు. ఇక మరుగుదొడ్ల గురించి చెప్పనలవే కాదు. దక్షిణ మధ్యరైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ పగిడిపల్లి– నడికుడి– గుంటూరు జిల్లా మధ్యలోని పలు స్టేషన్లను గురువారం పరిశీలించనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు స్టేషన్లలో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్ శిథిలావస్థలో క్వార్టర్లు వలిగొండ :వలిగొండ రైల్వేస్టేష న్లో అన్ని రైళ్లూ ఆపాలనేది మండల ప్రజల డిమాండ్. ఇక్కడ రేపల్లే, పుష్పుల్ రైళ్లు మాత్రమే ఆపుతున్నారు. ఈ స్టేషన్లో కనీస వసతులు కరువయ్యాయి. క్వార్టర్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరాయి. నీటి ట్యాంక్ కూలిపోయింది. డ్రమ్ములు ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్నారు. దశాబ్దాలుగా ప్రయాణికుల అవస్థలు దామరచర్ల: దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్లో వసతులు లేక ప్రయాణికులు దశాబ్దాలుగా అవస్థలు పడుతున్నారు. రైల్వేస్టేషన్లో ఉన్న నీటి ట్యాంక్ పనిచేయక పోవడంతో ప్రయాణికులు తాగునీటిని కొనుగోలు చేసి దాహం తీర్చుకునే దుస్థితి ఏర్పడింది. ఈ స్టేషన్లో క్యాంటీన్ సౌకర్యం కూడా లేదు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో వీధిదీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులకు నరకప్రాయంగా మారుతోంది. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. అదనపు ప్లాట్‌ఫాం నిర్మించరూ.. రామన్నపేట:రామన్నపేట రైల్వేస్టేషన్లో అదనపుఫ్లాట్పాం నిర్మించాలని ప్రయాణికులు ఎన్నోఏళ్లుగా కోరుతున్నారు. రైళ్లు క్రాసింగ్ అయ్యే సమయంలో ప్రస్తుతమున్న ప్లాట్‌ఫాం దిగి కంకరగుండా నడిచి హాల్ట్ అయిన రైలును ఎక్కడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైల్వేస్టేషన్లో నారాయణాద్రి, పలక్‌నుమా జన్మభూమి సూపర్పాస్ట్రైళ్లు, కాచిగూడ, రేపల్లే ప్యాసింజర్‌రైళ్లు ఆగుతాయి. డెల్టా ప్యాసింజర్‌రైలు రాత్రి హైదరాబాద్ నుంచి గుంటూరువైపు వెళ్లేటప్పుడు మాత్రమే రామన్నపేట స్టేషన్లో ఆగుతుంది. పలక్‌నుమా, జన్మ«భూమి ప్యాసింజర్‌రైళ్లు వారంలో నాలుగైదుసార్లు రామన్నపేటలో క్రాసింగ్ అవుతాయి. వీటిలో ఒకటిమాత్రమే ప్లాట్‌ఫామ్ మీదకు వస్తుంది. మరోదానిని ప్రయాణికులు లగేజీతోసహా మీటరు దిగువన ఉన్న ఫ్లాట్‌ఫామ్‌ను దిగి కంకరగుండా నడిచి ఎక్కవలసి వస్తోంది. వృద్ధులు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్ రెండోవైపున కూడా ప్లాట్‌ఫాం నిర్మించి పూట్ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయడమే సమస్యకు శాశ్వత పరిష్కారం. ఈ స్టేషన్లో మౌలిక వసతులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా ప్రయాణికుల అవస్థలు దామరచర్ల: దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్లో వసతులు లేక ప్రయాణికులు దశాబ్దాలుగా అవస్థలు పడుతున్నారు. రైల్వేస్టేషన్లో ఉన్న నీటి ట్యాంక్ పనిచేయక పోవడంతో ప్రయాణికులు తాగునీటిని కొనుగోలు చేసి దాహం తీర్చుకునే దుస్థితి ఏర్పడింది. ఈ స్టేషన్లో క్యాంటీన్ సౌకర్యం కూడా లేదు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో వీధిదీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులకు నరకప్రాయంగా మారుతోంది. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఎం ఆకస్మిక తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన వినోద్‌కుమార్ యాదవ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ అంతా తిరుగుతూ వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. క్లీనింగ్ యూనిట్, ఫుడ్ ప్లాజా తదితర యూనిట్లను తనిఖీ చేశారు. ప్రయాణికుల ఏసీ, జనరల్ వెయిటింగ్ హాళ్లు, బుకింగ్ కౌంటర్లను పరిశీలించారు. రైల్వే సేవలు అందుతున్న తీరు గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్లో బోయగూడ వైపున్న ప్రవేశంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అక్కడ అభివృద్ధికి అవకాశముందా అని ఆరా తీశారు. ఆయన వెంట డివిజినల్ రైల్వే మేనేజర్ ఆశీష్ అగర్వాల్ తదితరులు ఉన్నారు. -
దక్షిణమధ్య రైల్వే కొత్త జీఎంగా వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే కొత్త జనరల్ మేనేజర్‌గా వినోద్‌కుమార్ యాదవ్ నియమితులయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జీఎంగా ఉన్న రవీంద్రగుప్తా రైల్వే బోర్డు సభ్యు డిగా నియమితులు కావటంతో ఆయన స్థానంలో వినోద్‌కుమార్ వచ్చారు. 1980వ బ్యాచ్ ఇండియన్రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఈఈ)కు చెందిన ఈయన ఇప్పటి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ వర్సిటీ నుంచి ఎంబీఏ మాస్టర్ డిగ్రీ పట్టా, అలహాబాద్ వర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సహకార ప్రాజెక్టులు, పారిశ్రామిక విధానాల రూపకల్పన, ప్రపంచ బ్యాంకు, జైకా ప్రాయోజిత ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం వినోద్‌కు ఉంది. రైల్వేల్లో 1982లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా విధుల్లో చేరిన ఆయన ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఏడీఆర్ఎం ఢిల్లీ, లక్నో డీఆర్ఎంగా పనిచేశారు. డిప్యుటేషన్‌పై డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యూఎన్ఐడీఓ, ఆర్సీఓఎన్ తదితర సంస్థల్లో పనిచేసిన విశిష్ట అనుభవం ఉంది. టర్కీలోని ఐఆర్సీఓఎన్ డిప్యూటీ మేనేజర్‌గానూ వినోద్‌కుమార్ పనిచేశారు.