సాక్షిప్రతినిధి, నిజామాబాద్: సబ్సిడీ సోయా విత్తనాల ధరను స్వల్పంగా తగ్గిస్తూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది కంటే క్వింటాలుపై రూ.50 తగ్గించింది. 2018 ఖరీఫ్ సీజనులో క్వింటాలు విత్తనాలకు రైతులు చెల్లించాల్సిన మొత్తం రూ.3,700 ఉండేది. ఈసారి ధర రూ.3,650లకు తగ్గించింది. ప్రభుత్వం ఒక్కో క్వింటాలుపై రూ.2,500 సబ్సిడీని భరిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి ఇటీవల ఆదేశాలందాయి.
ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు సర్కారు ఏటా సబ్సిడీపై సోయా విత్తనాలను సరఫరా చేస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లోని విత్తన ఏజెన్సీల నుంచి సేకరిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన తెలంగాణ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నేషనల్ సీడ్ కార్పొరేషన్, హాకా వంటి సంస్థల ద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తోంది. కాగా గతేడాది ఖరీఫ్ సీజనులో ఈ విత్తన ధర క్వింటాలుకు రూ.6,200 చొప్పున నిర్ణయించగా, ఈసారి రూ.6,150 చొప్పున విక్రయించాలని సర్కారు నిర్ణయించింది.
పెరుగుతున్న విత్తన ధరలు..
సోయా విత్తనాల కొనుగోలు ధర ఏటా పెరుగుతూ వస్తోంది. 2017 ఖరీఫ్ సీజనులో క్వింటాలుకు రూ.5,475 చొప్పున కొనుగోలు ధరగా నిర్ణయించింది. 2018 ఖరీఫ్ సీజను నాటికి ఈ ధర క్వింటాలుకు రూ.6,200లకు పెరిగింది. రైతులపై భారం పడకుండా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని కూడా గత ఏడాది పెంచింది. క్వింటాలుపై రూ.1,825 నుంచి రూ.2,500లకు పెంచింది. దీంతో రైతులపై భారం పడలేదు.
వరి తర్వాత సోయానే అధికం..
జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజనులో వరి తర్వాత సోయానే అ«త్యధికంగా సాగు చేస్తారు. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 4.32 లక్షల ఎకరాలు కాగా, గతేడాది సుమారు 83 వేల ఎకరాల్లో సోయా పంట సాగైంది. ఈసారి ప్రాజెక్టుల నీటి మట్టం ఆశాజనకంగా కనిపించక పోవడంతో సోయా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ సారి పంట సాగు విస్తీర్ణం 1.12 లక్షల ఎకరాలకు పెరగనున్నట్లు అంచనా వేస్తోంది. సుమారు 30 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను సబ్సిడీపై అందించాలని భావిస్తోంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు అధికారులు ప్రతిపాదనలు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment