seeds distributes
-
AP: ఏపీ సీడ్స్‌కు జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు సామజిక బాధ్యత కింద జాతీయ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సర్టిఫైడ్ విత్తనాలను ఖరీఫ్ సీజన్‌కు ముందే పంపిణీ చేసి.. రైతుల ఆదరణను ప్రభుత్వం చూరగొందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా ఖర్చుల భారం లేకుండా ఊళ్లోనే విత్తనాలు అందాయని చెప్పారు. విత్తన పంపిణీ వల్ల 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకురిందన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, కమిషనర్ అరుణ్ కుమార్, సీడ్స్ ఎండి శేఖర్ బాబు ఇతర సిబ్బందిని మంత్రి కన్నబాబు అభినందించారు. -
స్వల్ప ఊరట
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: సబ్సిడీ సోయా విత్తనాల ధరను స్వల్పంగా తగ్గిస్తూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది కంటే క్వింటాలుపై రూ.50 తగ్గించింది. 2018 ఖరీఫ్ సీజనులో క్వింటాలు విత్తనాలకు రైతులు చెల్లించాల్సిన మొత్తం రూ.3,700 ఉండేది. ఈసారి ధర రూ.3,650లకు తగ్గించింది. ప్రభుత్వం ఒక్కో క్వింటాలుపై రూ.2,500 సబ్సిడీని భరిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి ఇటీవల ఆదేశాలందాయి. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు సర్కారు ఏటా సబ్సిడీపై సోయా విత్తనాలను సరఫరా చేస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లోని విత్తన ఏజెన్సీల నుంచి సేకరిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ సీడ్ కార్పొరేషన్, హాకా వంటి సంస్థల ద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తోంది. కాగా గతేడాది ఖరీఫ్ సీజనులో ఈ విత్తన ధర క్వింటాలుకు రూ.6,200 చొప్పున నిర్ణయించగా, ఈసారి రూ.6,150 చొప్పున విక్రయించాలని సర్కారు నిర్ణయించింది. పెరుగుతున్న విత్తన ధరలు.. సోయా విత్తనాల కొనుగోలు ధర ఏటా పెరుగుతూ వస్తోంది. 2017 ఖరీఫ్ సీజనులో క్వింటాలుకు రూ.5,475 చొప్పున కొనుగోలు ధరగా నిర్ణయించింది. 2018 ఖరీఫ్ సీజను నాటికి ఈ ధర క్వింటాలుకు రూ.6,200లకు పెరిగింది. రైతులపై భారం పడకుండా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని కూడా గత ఏడాది పెంచింది. క్వింటాలుపై రూ.1,825 నుంచి రూ.2,500లకు పెంచింది. దీంతో రైతులపై భారం పడలేదు. వరి తర్వాత సోయానే అధికం.. జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజనులో వరి తర్వాత సోయానే అ«త్యధికంగా సాగు చేస్తారు. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 4.32 లక్షల ఎకరాలు కాగా, గతేడాది సుమారు 83 వేల ఎకరాల్లో సోయా పంట సాగైంది. ఈసారి ప్రాజెక్టుల నీటి మట్టం ఆశాజనకంగా కనిపించక పోవడంతో సోయా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ సారి పంట సాగు విస్తీర్ణం 1.12 లక్షల ఎకరాలకు పెరగనున్నట్లు అంచనా వేస్తోంది. సుమారు 30 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను సబ్సిడీపై అందించాలని భావిస్తోంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు అధికారులు ప్రతిపాదనలు పంపారు. -
మూడో రోజు 16,820 క్వింటాళ్ల పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మూడో రోజు విత్తన పంపిణీ కొనసాగింది. మొదటి రెండు రోజులతో పోలిస్తే పంపిణీ సరళి కాస్తంత మెరుగుపడింది. మూడో రోజు 14,595 మంది రైతులకు 16,820 క్వింటాళ్లు విత్తనకాయలు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి శుక్రవారం ప్రకటించారు. మూడు రోజుల్లో 27,158 మంది రైతులకు 31,608 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సర్వర్ మొరాయించడంతో బయోమెట్రిక్ మిషన్లు పనిచేయక రైతులు గంటల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సెంట్రల్ సర్వర్ ఫెయిల్ కావడంతో ఇబ్బందులు తలెత్తినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఉదయం 7 గంటలకే పంపిణీ కౌంటర్ల వద్ద రైతులు వేచి ఉండటం, సర్వర్ పని చేయకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. ఇక విత్తన నాణ్యతపై జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో రైతులు పెదవి విరుస్తున్నారు. పుల్లలు, నాసులు, కల్తీకాయలు ఎక్కువగా ఉన్నట్లు రైతులు ఫిర్యాదులు వచ్చాయి. అనంతపురం, ఉరవకొండ, మరికొన్ని మండల కేంద్రాల్లో రైతులు, రైతు సంఘాల నాయకులు ఈ అంశంపై అధికారులు, ఏజెన్సీలతో వాదులాటకు దిగారు. నిబంధన మేరకు విత్తనకాయల్లో నాణ్యత ప్రమాణాలు ఉన్నట్లు అధికారులు వాదిస్తున్నారు. 74 శాతం గట్టిదనం, 70 శాతం మొలక, 96 శాతం ఫిజికల్ఫ్యూరిటీ, 4 శాతం వ్యర్థాలు ఉండవచ్చనే నిబంధనలను ఏజెన్సీలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, పంపిణీ సంస్థలు బాగా ఉపయోగించుకోవడంతో రైతులకు నాసిరకం విత్తనం తప్పలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రేపటి నుంచి విత్తన పప్పుశనగ పంపిణీ
అనంతపురం అర్బన్ : జిల్లాలో నల్లరేగడి భూములున్న 27 మండలాల పరిధిలో ఈనెల 6వ తేదీ నుంచి పప్పుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు జేసీ–2 సయ్యద్ ఖజామొహిద్దీన్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో పప్పుశనగ పంపిణీపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎకరాకు 25 కేజీలు చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాలకు విత్తనాలను 40 శాతంతో అందించాలన్నారు. పంపిణీ క్రమంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. క్వింటాలు ధర రూ.9,866 ఉందని, ప్రభుత్వ సబ్సిడీ రూ.3,946లు పోగా మిగితా మొత్తాన్ని రైతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు ప్రతి రైతు తన పాసు పుస్తకం, ఆధార్ కార్డు, సెల్ఫోన్లను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. గతంలో వేరుశనగ విత్తన కాయ పంపిణీలో ఏ విధంగా బయోమెట్రిక్ విధానం అమలు చేశారో, ఇప్పుడూ అదే పద్ధతి పాటిస్తారన్నారు. రైతు సెల్‌ఫోన్‌కు వచ్చే పాస్‌వర్డ్‌ను విత్తన పంపిణీ కేంద్రంలో చూపిస్తే విత్తనాలను అందిస్తారన్నారు. ఇప్పటికే జిల్లాలో 25 వేల క్వింటాళ్లు పప్పుశనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన 25 వేల క్వింటాళ్లను కూడా సిద్ధం చేసుకోవాలని జేడీఏను ఆదేశించారు. విత్తనాలతో పాటు విత్తన శుద్ధి చేసేందుకు టైకోడెర్మావెరడీ అనే మందును 500 గ్రాముల ప్యాకెట్ రూ.100కే రైతులకు అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.