అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మూడో రోజు విత్తన పంపిణీ కొనసాగింది. మొదటి రెండు రోజులతో పోలిస్తే పంపిణీ సరళి కాస్తంత మెరుగుపడింది. మూడో రోజు 14,595 మంది రైతులకు 16,820 క్వింటాళ్లు విత్తనకాయలు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి శుక్రవారం ప్రకటించారు. మూడు రోజుల్లో 27,158 మంది రైతులకు 31,608 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సర్వర్ మొరాయించడంతో బయోమెట్రిక్ మిషన్లు పనిచేయక రైతులు గంటల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సెంట్రల్ సర్వర్ ఫెయిల్ కావడంతో ఇబ్బందులు తలెత్తినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
ఉదయం 7 గంటలకే పంపిణీ కౌంటర్ల వద్ద రైతులు వేచి ఉండటం, సర్వర్ పని చేయకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. ఇక విత్తన నాణ్యతపై జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో రైతులు పెదవి విరుస్తున్నారు. పుల్లలు, నాసులు, కల్తీకాయలు ఎక్కువగా ఉన్నట్లు రైతులు ఫిర్యాదులు వచ్చాయి. అనంతపురం, ఉరవకొండ, మరికొన్ని మండల కేంద్రాల్లో రైతులు, రైతు సంఘాల నాయకులు ఈ అంశంపై అధికారులు, ఏజెన్సీలతో వాదులాటకు దిగారు. నిబంధన మేరకు విత్తనకాయల్లో నాణ్యత ప్రమాణాలు ఉన్నట్లు అధికారులు వాదిస్తున్నారు. 74 శాతం గట్టిదనం, 70 శాతం మొలక, 96 శాతం ఫిజికల్‌ఫ్యూరిటీ, 4 శాతం వ్యర్థాలు ఉండవచ్చనే నిబంధనలను ఏజెన్సీలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, పంపిణీ సంస్థలు బాగా ఉపయోగించుకోవడంతో రైతులకు నాసిరకం విత్తనం తప్పలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మూడో రోజు 16,820 క్వింటాళ్ల పంపిణీ
Published Fri, May 26 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM
Advertisement