పారిస్: ఫ్రాన్స్‌లో పోలీసు కాల్పుల్లో యువకుడి మృతి ఘటన అనంతరం మొదలైన ఉద్రిక్తతలు మూడో రోజు రాత్రి కూడా కొనసాగాయి. నిరసనకారులు వీధుల్లో అడ్డంకులు ఏర్పాటు చేసి, కార్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పుపెడుతున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. బాణసంచా కాల్చి పోలీసుల పైకి వదులుతున్నారు. పారిస్ శివారుల్లో ఆందోళనకారులు ఒక బస్‌డిపోకు, రోడ్లపై కార్లకు నిప్పుపెట్టారు.
పారిస్‌లోని 12వ డిస్ట్రిక్ట్ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. రివోలీ వీధిలోని కొన్ని దుకాణాలను, నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ ఫోరం డెస్ హాలెస్‌ను దోచుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు 40వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. శివారు ప్రాంతాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పారిస్‌లో బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపివేశారు.
ఆందోళనకారుల దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న 667 మంది ఆందోళనకారుల్లో 307 మంది పారిస్ రీజియన్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు. ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు కఠినంగా వ్యవహరిస్తామని అంతరంగిక శాఖ మంత్రి గెరాల్డ్ ప్రకటించారు. ఇలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 17 ఏళ్ల నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో మరో ఇద్దరిని కూడా పోలీసులు తనిఖీల సమయంలోనే కాల్చి చంపినట్లు చెబుతున్నారు. ఫ్రాన్స్ అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు కూడా పాకాయి. బాహాబాహీకి దిగిన 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల ఆందోళనకారులు భవంతులకు, వాహనాలకు నిప్పుపెట్టారని ప్రభుత్వం తెలిపింది.
టీనేజర్లను బయటకు రానివ్వకండి:
తల్లిదండ్రులకు మాక్రాన్ వినతి
దేశమంతటా వ్యాపిస్తున్న అల్లర్లను అణచివేసే క్రమంలో టీనేజీ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ తల్లిదండ్రులను కోరారు. దేశంలో అల్లర్లకు సోషల్ మీడియానే హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. శుక్రవారం ఆయన సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమై శాంతి భద్రతలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి అనంతరం అశాంతిని వ్యాపింపజేయడంలో సోషల్ మీడియానే ప్రముఖంగా ఉందన్నారు. హింసాత్మక ఘటనలకు ప్రేరణ కలిగిస్తున్న సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్ చాట్, టిక్‌టాక్ వంటివి సున్నిత అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని కోరారు. వీడియో గేమ్‌లు యువత మెదళ్లను విషతుల్యం చేస్తున్నాయని, దీంతో కొందరు అస్తమానం వీధుల్లోనే గడుపుతున్నారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment