అనంతపురం అర్బన్ : జిల్లాలో నల్లరేగడి భూములున్న 27 మండలాల పరిధిలో ఈనెల 6వ తేదీ నుంచి పప్పుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు జేసీ–2 సయ్యద్ ఖజామొహిద్దీన్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పప్పుశనగ పంపిణీపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎకరాకు 25 కేజీలు చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాలకు విత్తనాలను 40 శాతంతో అందించాలన్నారు. పంపిణీ క్రమంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
క్వింటాలు ధర రూ.9,866 ఉందని, ప్రభుత్వ సబ్సిడీ రూ.3,946లు పోగా మిగితా మొత్తాన్ని రైతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు ప్రతి రైతు తన పాసు పుస్తకం, ఆధార్ కార్డు, సెల్‌ఫోన్‌లను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. గతంలో వేరుశనగ విత్తన కాయ పంపిణీలో ఏ విధంగా బయోమెట్రిక్ విధానం అమలు చేశారో, ఇప్పుడూ అదే పద్ధతి పాటిస్తారన్నారు. రైతు సెల్‌ఫోన్‌కు వచ్చే పాస్‌వర్డ్‌ను విత్తన పంపిణీ కేంద్రంలో చూపిస్తే విత్తనాలను అందిస్తారన్నారు. ఇప్పటికే జిల్లాలో 25 వేల క్వింటాళ్లు పప్పుశనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన 25 వేల క్వింటాళ్లను కూడా సిద్ధం చేసుకోవాలని జేడీఏను ఆదేశించారు. విత్తనాలతో పాటు విత్తన శుద్ధి చేసేందుకు టైకోడెర్మావెరడీ అనే మందును 500 గ్రాముల ప్యాకెట్ రూ.100కే రైతులకు అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రేపటి నుంచి విత్తన పప్పుశనగ పంపిణీ
Published Tue, Oct 4 2016 11:38 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement