సాక్షి,హైదరాబాద్ : వినోదం, ఆటలు, స్నేహం పేరిట సామాజిక మాధ్యమం వేదికగా చిన్నారులకు ‘సోషల్ కింకరులు’గాలాలు వేస్తున్నారు. వీరికి చిక్కితే అంతే సంగతులు. మెల్లిగా మాట్లాడి స్నేహం చేస్తారు. వ్యక్తిగత వివరాలు అడుగుతారు. నగ్నఫొటోలు సేకరిస్తారు. వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తారు. పిల్లలతో చేయరాని పనులు చేయిస్తారు. వీరిని వినోదం పంచే వస్తువులుగా, కోరికలు తీర్చుకునే యంత్రాలుగా వాడతారు. వీరి వికృత చేష్టలకు అన్నెంపుణ్యం తెలియని టీనేజర్లు బలవుతున్నారు.
- రష్యాలో ఓ పిచ్చివాడు రూపొందించిన బ్లూవేల్ గేమ్ కారణంగా మన దేశంలో అనేకమంది చిన్నారులు ప్రాణాలు తీసుకున్నారు. పిల్లల తల్లులకు వాడు జీవితాంతం తీరని కడుపు కోత మిగిల్చాడు
- హైదరాబాద్‌లో ఓ కామాంధుడు ఫేస్‌బుక్ వేదికగా 15 ఏళ్ల బాలికకు ఎరవేసి, ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించడంతో బాలికను బండరాయితో మోది పొట్టనబెట్టుకున్నాడు
- హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో చదువుకునే టీనేజీ కుర్రాడిని తప్పుడు చిరునామాతో ఓ మహిళ వలలో వేసుకుంది. ఆ కుర్రాడు పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. తల్లిదండ్రులకు తెలిసి నిలదీయడంతో రేప్ కేసు పెడతానని బెదిరించింది. గత్యంతరం లేక తల్లిదండ్రులు ఆమె అడిగినంత చెల్లించి, పిల్లాడిని మరో ఊరుకు మార్చారు.
తియ్యటి మాటలతో వల..
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది యువకులు టీనేజీ అమ్మాయిలు, అబ్బాయిలకు అమ్మాయిల ఫొటోలతో గాలం వేస్తున్నారు. తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇటీవల సూర్యాపేటలో ఉండే ఓ బాలిక గోదావరిజిల్లాకు చెందిన ఓ యువకుడి వలలో పడింది. అతడి తియ్యటి మాటలకు పొంగిపోయింది. చెప్పినట్లు చేసింది. ఇంట్లో నగలన్నీ ఆ యువకుడికి ఇచ్చింది. ఆ నగలతో సదరు యువకుడు కారు కొనుక్కుని జల్సాలు చేశాడు.
తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలి..
- రోజులో 8 గంటలు నిద్రపోతే, 8 గంటలు కాలేజ్ లేదా స్కూల్లో ఉంటారు. ఇక మిగిలిన 8 గంటల సమయంలోనే కొత్త స్నేహాల కోసం వెదుకుతుంటారు.
- రోజువారీ పనులకు 2 గంటలు పోయినా.. ఇక మిగిలింది 6 గంటలు. ఈ సమయం చాలు.. సైబర్ కింకరులు పిల్లలను గద్దల్లా తన్నుకుపోవడానికి.
- సైబర్ వేధింపులకు గురైన పిల్లలు ముభావంగా, భయం భయంగా ఉంటారు. అన్నం సరిగా తినరు. రాత్రివేళల్లో నిద్రపోకుండా నిత్యం స్మార్ట్‌ఫోన్ చెక్ చేస్తుంటారు.
- అలాంటి వారిని ఏకాంతంగా అసలు వదలకండి. వారి ఫోన్‌కు లాక్ చేస్తామంటే ఒప్పుకోకండి. వారు ఏయే యాప్‌లు వాడుతున్నారో తెలుసుకుని ప్రమాదకర యాప్‌ల గురించి వివరించి హెచ్చరించండి.
- సాధారణ సోషల్ మీడియా వేదికలపై వారి ఫ్రెండ్‌లిస్టుల్లో మీరూ ఉండండి. వారికి ఒకటికి మించి ఖాతాలుంటే వాటి గురించి తెలుసుకోండి.
- నిత్యం ఫోన్‌లో తలమునకలవుతూ.. అకస్మాత్తుగా కోప్పడటం, చిరాకుపడటం చేసే పిల్లల్ని వారి రూముల్లో ఒంటరిగా పడుకోనివ్వద్దు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కనిపెట్టుకోవడం మంచిది.
ఈ యాప్‌లతో జాగ్రత్త !
అంతా అనుకుంటున్నట్లుగా కేవలం ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ యాప్‌లే కాదు. సోషల్ కింకరులు ఎవరికీ అనుమానం రాకుండా ఈ యాప్‌లను రూపొందిస్తున్నారు. విద్యార్థులు వారి ఉచ్చులో పడ్డాకఆ తతంగాన్ని తల్లిదండ్రులు గుర్తించకుండా ఉండేలా డిజైన్ చేస్తున్నారు.
కాలిక్యులేటర్ : ఈ యాప్ చూసేందుకు కాలిక్యులేటర్‌లా ఉంటుంది. తల్లిదండ్రులు ఇదో ఎడ్యుకేషన్ యాప్‌లా భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది రహస్యంగా ఫొటోలు షేర్ చేసుకునేందుకు ఉద్దేశించిన యాప్.
ఓమిగిల్ : ఇది గణితశాస్త్రంలో వాడే ఒమేగాను పోలి ఉంటుంది. ఇది కొత్త వారితో, తెలియని వారితో స్నేహం చేసేందుకు వేదిక. ఇక్కడే చాలామంది పిల్లలు కొత్తవారితో చాట్ చేయాలన్న ఉత్సుకతతో తమ వ్యక్తిగత వివరాలు చెప్పేసి వారి వలలో చిక్కుతారు.
విస్పర్ : ఈ యాప్ కొత్త వ్యక్తులను కలుసుకునేందుకు ఉద్దేశించింది. ఈ యాప్‌లో సమాచారం ద్వారా గాలాలు వేస్తుంటారు.
ఆస్క్ ఎఫ్‌ఎమ్ : ఒకసారి డౌన్‌లోడ్ చేసుకున్నారంటే అంతే. దీన్ని అంత ప్రమాదకరంగా రూపొందించారు. ఒకసారి లాగిన్ అయ్యారో.. ఇక మీరు ఈ సైబర్ రాక్షసుల నుంచి తప్పించుకోలేరు.
హాట్ ఆర్ నాట్ : ఈ యాప్‌తో ఇంకా ప్రమాదకరం. వ్యక్తిగత ఫొటోలు సహా వివరాలన్నీ సేకరిస్తారు. తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తారు. బెదిరింపులతో చిత్రవధ చేస్తారు.
బర్న్ బుక్ : సమాజంలో వ్యక్తులపై వదంతులు పుట్టించేందుకు ఉద్దేశించిన యాప్ ఇది. దీని ద్వారా వ్యక్తిత్వాన్ని హరించేలా కామెంట్లు, ఆడియోలు సృష్టించి బజారు కీడ్చటమే వారి పని.
విష్‌బోన్ : ఈ యాప్ పిల్లల మధ్య అసమాన తలను ఎత్తిచూపుతుంది. ఇందులో నమోదైన వారిని మిగిలినవారితో పోల్చి చూపిస్తుంటుంది. ఎదుటి వారి ముందు అసమానతలు బయట పడ్డందుకు చాలామంది మానసికంగా కుంగిపోతారు.
కిక్ : ప్రపంచ వ్యాప్తంగా సైబర్ వేధింపుల ఫిర్యాదులు అధికంగా నమోదవుతున్న యాప్‌లో ‘కిక్’కూడా ఒకటి. టీనేజర్లే ఈ యాప్ లక్ష్యం. వారి వ్యక్తిగత వివరాలు, ఫొటోలు సేకరించి వేధింపులకు పాల్పడుతున్నారు.
యెల్లో : టీనేజర్లను కామెంట్లు చేసేందుకు ఉద్దేశించిన యాప్. కొత్త పరిచయాలు, తెలియని వ్యక్తులతో చాటింగ్ దీని లక్ష్యం. ఇక్కడ కూడా పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశాలు పుష్కలం.
ఇన్‌స్టాగ్రామ్ : తప్పుడు వివరాలతో పలువురు పిల్లలు నకిలీ ఖాతాలు సృష్టించి కొత్తవారితో చాట్ చేసి చిక్కుల్లో పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment