
ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థుల చదువుపై విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా నిర్వహించే ప్రత్యేక తరగతులను పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలను ఆయా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తేలిగ్గా తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ మమ
అనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 241, మోడల్ స్కూళ్లు 9 ఉండగా.. వీటిలో సుమారు 16 వేల మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. విద్యా సంవత్సరం ఆరంభం నుంచే టెన్త్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తరగతులు నిర్వహించాలి. ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తూ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా చేయడమే ప్రత్యేక తరగతుల ఉద్దేశం. అయితే, గతేడాది ఆగస్టులోనే స్పెషల్ క్లాసులు ప్రారంభమయ్యాయి.
ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఈ ఏడాది జిల్లా విద్యాశాఖాధికారి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజూ టీచర్లు బోధించిన సబ్జెక్టు, అంశాలు, హాజరైన విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా రిజిస్ట్రర్ కూడా నిర్వహించాలి. ఈమేరకు జూలై నెలాఖరులో ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించి ఈమేరకు చెప్పినట్లు సమాచారం. అధికారికంగా ఎటువంటి సర్క్యులర్ జారీ చేయలేదు. దీన్ని ఆయా హెచ్‌ఎంలు తేలిగ్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సింహభాగం పాఠశాలల్లో తూతూ మంత్రంగా తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఒక్కపూటకే ప్రత్యేక తరగతులు పరిమితం అయ్యాయి. దీంతో పాటు రికార్డుల నిర్వహణను విస్మరించారు. తరగతుల నిర్వహణపై ఎటువంటి పర్యవేక్షణ లేదు. ఇన్‌చార్జి ఎంఈఓలు ఉన్నా.. ఆ బాధ్యతలు వారికి అప్పగించ లేదని సమాచారం. దీంతో వారూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలా దిక్సూచి లేని ప్రయాణంలా ప్రత్యేక తరగుతులు కొనసాగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సిలబస్ 60 శాతమే..
ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచి బోధన అరకొరగానే జరుగుతోంది. పలు అడ్డంకులు ఎదురవడంతో బోధన వెనుకబడింది. వేసవి సెలవుల అనంతరం జూన్ ఒకటిన పాఠశాలలు పునఃప్రారంభమవగా.. కొన్ని రోజుల పాటు టీచర్లు బడి బాట కార్యక్రమంలోనే నిమగ్నమయ్యారు. అనంతరం అదే నెల 6న టీచర్ల బదిలీల ఉత్తర్వులు వెలువడడంతో... ఉపాధ్యాయులంతా అదే చర్చలో పడ్డారు. బదిలీల ప్రక్రియ జులై 15న ముగిసింది. ఇలా దాదాపు నెలన్నర సమయం వృథా అయింది. ఈ ప్రభావం బోధనపై పడింది. వచ్చేనెల ఒకటి నుంచి 8 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం –1 (ఎస్‌ఏ) పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటిరవకు లక్షిత సిలబస్‌లో 60 శాతం పాఠ్యాంశాల బోధన మాత్రమే పూర్తయింది. మరో పది రోజుల్లో మిగిలిన 40 శాతం సిలబస్ పూర్తి కావడం కష్టమే. ఆ తర్వాత వచ్చేనెల 9 నుంచి 21వరకు దసరా సెలవులు. ఇలా పుణ్య కాలమంతా గడుస్తున్నా యంత్రాంగం పకడ్బందీగా పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణలో విఫలమవుతున్నారు. ఈ విషయమై డీఈఓ కె.సత్యనారాయణ రెడ్డి వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
గణితం, సైన్స్‌లోనే అధికంగా> ఫెయిల్..
గతేడాది ఆగస్టు నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి. పదో తరగతి ఫలితాల్లో జిల్లా 87.13 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 16వ స్థానంలో జిల్లా నిలిచింది. అయితే, ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థుల్లో అధిక శాతం మంది గణితం, సైన్స్‌లోనే తప్పారు. సగటున మ్యాథ్స్‌లో 10 శాతం, సైన్స్‌లో ఏడు శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఈమేరకు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నారు. దాదాపు ఆరు నెలలు ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఆ స్థాయిలో ఫెయిలవడం గమనార్హం. ఆ పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా ఇప్పటికైనా విద్యాశాఖ మేల్కొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment