ప్రత్యేక మెడికల్ ఎంట్రన్స్‌పై ప్రతిష్టంభన | special entrance for management seats in medical colleges | Sakshi
Sakshi News home page

ప్రత్యేక మెడికల్ ఎంట్రన్స్‌పై ప్రతిష్టంభన

Published Sat, Apr 18 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

ప్రత్యేక మెడికల్ ఎంట్రన్స్‌పై ప్రతిష్టంభన

ప్రత్యేక మెడికల్ ఎంట్రన్స్‌పై ప్రతిష్టంభన

  • సొంతంగా పరీక్ష నిర్వహిస్తామని ప్రైవేటు కాలేజీల స్పష్టీకరణ
  • ‘బి’ కేటగిరీలోని 10 సీట్లూ తమకే ఇవ్వాలని విన్నపం
  • కుదరదన్న మంత్రి లక్ష్మారెడ్డి... అర్ధంతరంగా ముగిసిన సమావేశం
  • సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. తామే ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకుంటామని... అందుకు అనుమతించాలని తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ప్రత్యేక ప్రవేశ పరీక్షకు ముందు నుంచే అంగీకరిస్తున్న ప్రభుత్వం... ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలే సొంతంగా పరీక్ష నిర్వహించుకుంటామన్న అంశాన్ని తిరస్కరించినట్లు తెలిసింది. ఈ అంశంపై శుక్రవారం ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు.

    ప్రత్యేక ప్రవేశ పరీక్షకు సానుకూలంగా ఉన్నామని... అయితే ఆ పరీక్షను ప్రభుత్వమే నిర్వహిస్తుందని మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు మాత్రం తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని ఘంటాపథంగా చెప్పాయి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రైవేటు మెడికల్ కాలేజీలు విభేదించడంతో ఎటువంటి నిర్ణయానికి రాకుండానే సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అయితే దీనిపై ప్రైవేటు కాలేజీలు తమ విన్నపాలతో కూడిన లేఖను మంత్రికి అందజేసినట్లు యాజమాన్యాలు తెలిపాయి.  
     
    40 శాతమే కాదు... ‘బి’ కేటగిరీలోని 10 శాతం సీట్లూ మాకే ఇవ్వండి
    తెలంగాణలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. ఆ ప్రైవేటు సీట్లలో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం సీట్లు, ‘బి’ కేటగిరీ 10 శాతం సీట్లను ఎంసెట్ అర్హత ద్వారా కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన ‘సి’ కేటగిరీ 40 శాతంలో 25 శాతం యాజమాన్య కోటా సీట్లు, 15 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఈ 40 శాతం సీట్లను కూడా ప్రస్తుతం ఎంసెట్ పరీక్ష ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. వీటికే ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రైవేటు మెడికల్ యాజమాన్యాలు కోరుతున్నాయి. మంత్రితో జరిగిన సమావేశంలో తాజాగా ప్రైవేటు యాజమాన్యాలు మరో ప్రతిపాదన కూడా చేశాయి. ‘బి’ కేటగిరీలోని 10 శాతం సీట్లను కూడా యాజమాన్య సీట్లతో కలిపి వాటిని కూడా తామే నింపుకునేలా చేయాలని కోరాయి.
     
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే చేస్తుందని వెల్లడించాయి. అలా చేసేట్లయితే 40 శాతంగా ఉన్న 840 సీట్లకు 10 శాతం సీట్లు 210 కలిపితే మొత్తం 1,050 సీట్లకు సొంతంగా పరీక్ష పెట్టుకుని నింపుకోవాలనేది ప్రైవేటు మేనేజ్‌మెంట్ల ఉద్దేశం. పైగా వీటన్నిం టికీ ఒకే ఏకీకృత ఫీజు రూ. 11 లక్షలు వసూలు చేసుకునేలా అనుమతించాలని కూడా కోరినట్లు తెలిసింది. అంటే 15% ఎన్‌ఆర్‌ఐ సీట్లకు వసూ లు చేస్తున్న రూ. 11 లక్షల ఫీజును మరో 35 శాతం సీట్లకు కూడా వర్తింప చేయాలని కోరి నట్లు సమాచారం. ఇన్ని కోర్కెలపై సర్కారు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఇచ్చిన లేఖపై సీఎం చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు కాలేజీలు తమ నిర్ణయాన్ని ప్రభుత్వం పరి గణనలోకి తీసుకుంటుందని అంటున్నారు.
     
    3, 4 రోజుల్లో నిర్ణయం: మంత్రి లక్ష్మారెడ్డి
    ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహణకు సంబంధించి ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో అనేక అభిప్రాయాలు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. సొంతంగా తామే ఎంట్రన్స్ నిర్వహించుకుంటామని యాజమాన్యాలు తన దృష్టికి తీసుకొచ్చాయని వివరించారు. రెండు మూడు రోజుల్లో ఒక సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా వారిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement