‘మేనేజ్‌మెంట్’ బేరాలు
సాక్షి, హైదరాబాద్: టాప్ కాలేజీలుగా చలామణీ అవుతున్న కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇంకా కన్వీనర్ కోటా ప్రవేశాలు ప్రారంభం కాకముందే మేనేజ్‌మెంట్ సీట్లు అమ్మేందుకు సమాయత్తమవుతున్నాయి. దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు పేరుమోసిన కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే డొనేషన్లు కూడా అమాంతం పెంచేశాయి.
అటు ఉన్నత విద్యా శాఖ కాని, ఉన్నత విద్యా మండలి కానీ ఈ వ్యవహారంపై దృష్టిసారించకపోగా, అధికారుల దృష్టికి తీసుకెళ్తే సరైన ఆధారాలు లేవని చేతులెత్తేస్తున్నారు తప్ప కనీసం నిబంధనల అమలును కూడా పట్టించుకోవడం లేదు.
సందిగ్ధతను ఆసరాగా చేసుకొని..
గతేడాది లోపాల కారణంగా 143 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించలేదు. ఈ ఏడాది కూడా ఎన్ని కాలేజీలకు అనుమతి వస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ అనుబంధ గుర్తింపు వచ్చినా ఎన్ని సీట్లలో ప్రవేశాలకు ఆమోదం తెలుపుతారో కూడా తెలియదు. ఈ సందిగ్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుని ‘దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న’ చందంగా గుర్తింపు కాలేజీలను జేఎన్టీయూహెచ్ ప్రకటించేలోపే ఎలాగైనా సీట్లు భర్తీ చేయాలని చూస్తున్నాయి. జేఎన్టీయూహెచ్ ఇటీవల చేపట్టిన తనిఖీల్లో టాప్ కాలేజీలుగా చెప్పుకొంటున్న వాటిల్లోనూ లోపాలున్నట్లు వెల్లడైంది. అయినా కూడా తమవి టాప్ కాలేజీలంటూ ప్రచారం చేసుకుని మేనేజ్‌మెంట్ సీట్లకు లక్షలకు బేరం కుదుర్చుకుంటున్నాయి.
ప్రభుత్వమే కల్పించిన అవకాశం!
మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ విషయంలో గతంలో కోర్టును ఆశ్రయించిన యాజమాన్యాలు.. విద్యార్థి స్థితిగతులు తెలుసుకునేందుకు వారి తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసుకునే వీలు కల్పించాలని కోరాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో యాజమాన్యాలకు అనుగుణంగా కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై అప్పటి ఏపీ ఉన్నత విద్యామండలి రివ్యూ పిటిషన్ వేయలేదు. కనీసం నిబంధనల అమలులోనైనా సరిగ్గా వ్యవహరించలేదని విమర్శలు ఎదుర్కొంది.
రాష్ట్రంలో అమల్లో ఉన్న కామన్ ఫీజు విధానం ప్రకారం అన్ని కేటగిరీల సీట్ల ఫీజులు కాలేజీల ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఒకే ఫీజు విధానం అమలు చేయాలి. ఒకటీ అరా కాలేజీలు తప్ప చాలా కాలేజీలు ఈ విధానాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు కూడా ఆధారాలు లేవని పట్టించుకోవడం లేదు. ఈ కామన్ ఫీజు విధానం అమలయ్యేలా పకడ్బందీ కార్యాచరణ చేపడితే తప్ప కాలేజీల యాజమాన్యాల దూకుడును అరికట్టడం సాధ్యం కాదని పలువురు సూచిస్తున్నారు.