యాజమాన్య సీట్లు హాంఫట్‌! | irregular allotment of engineering management seats | Sakshi
Sakshi News home page

యాజమాన్య సీట్లు హాంఫట్‌!

Published Sat, Jun 11 2016 6:49 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

యాజమాన్య సీట్లు హాంఫట్‌! - Sakshi

యాజమాన్య సీట్లు హాంఫట్‌!

- ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్డగోలు దందా
- వసూళ్ల పర్వానికి తెరలేపిన టాప్‌ కాలేజీలు
- కంప్యూటర్‌ సైన్స్‌కు రూ.14 లక్షల వరకు డొనేషన్‌.. కాస్త పేరున్న కాలేజీల్లో
- రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు
- ఏజెంట్లను పెట్టుకొని మరీ సీట్ల అమ్మకాలు
- ముందుగానే రిజిస్ట్రేషన్లు.. అడ్వాన్సులు తీసుకుంటున్న వైనం
- అడ్మిషన్ల విధానం ఖరారు కాకముందే అంగట్లో సరుకులైన సీట్లు
- ఈసారి సీట్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందంటున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌

కోటిరెడ్డి ఓ ప్రైవేటు ఉద్యోగి. తన కొడుకు అక్షయ్‌కి ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాలేదు. అయినా టాప్‌ కాలేజీలో చదివించాలన్నది కోటిరెడ్డి కోరిక. ఓ కాలేజీని సంప్రదించాడు. కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు కావాలన్నాడు. ఆ కాలేజీ యాజమాన్య ప్రతినిధి కొద్ది రోజులు ఆగండని చెప్పాడు. చాంబర్‌ బయటే ఉన్న ఏజెంట్‌ మాత్రం రూ.14 లక్షలిస్తే సీటు వస్తుందన్నాడు. చివరగా రూ.12 లక్షలకు తాను సీటు ఇప్పిస్తానన్నాడు. ముందు రూ.50 వేలు చెల్లించి సీటు రిజర్వ్‌ చేసుకొమ్మని చెప్పాడు.
శ్రీధర్‌రావు.. ఓ ప్రభుత్వ ఉద్యోగి. తన కూతురు శ్రావ్యను కంప్యూటర్‌ సైన్స్‌ చదివించాలని మేనేజ్‌మెంట్‌ కోటా సీటు కోసం ఓ కాలేజీకి వెళ్లాడు. సీటు కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని యాజమాన్య ప్రతినిధి తెగేసి చెప్పాడు. ‘ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటాం.. సీటు వస్తే ఇస్తారా..?’ అని శ్రీధర్‌రావు అడగ్గా.. ‘ఇక మీరు వెళ్లిపోవచ్చు..’ అని యాజమాన్య ప్రతినిధి బదులిచ్చాడు.

...ఇదీ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో సాగుతున్న దందా! ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ కాకముందే యాజమాన్యాలు సీట్ల అమ్మకాలకు తెరదీశాయి. కొన్ని యాజమాన్యాలు నేరుగా తల్లిదండ్రులతోనే బేరాలు చేస్తుండగా.. మరికొన్ని యాజమాన్యాలు ఏజెంట్లను రంగంలోకి దింపుతున్నాయి. రాష్ట్రంలో పేరున్న టాప్‌ కాలేజీల్లో కొన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని కాలేజీలు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు బేరాలు పెట్టాయి. అడ్వాన్సులు
మిగతా తీసుకుంటున్నాయి. కనీసం రూ.50 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని చెబుతున్నాయి. కన్వీనర్‌ కోటాలో తమ పిల్లలకు పేరున్న మంచి కాలేజీలో సీటు రాదేమోన్న ఆందోⶠనతో తల్లిదండ్రులు ముందే డబ్బు చెల్లించి మరీ రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.

తల్లిదండ్రుల ఆశలే ఆసరాగా
తమ పిల్లలను కాస్త మంచి కాలేజీలో చదివించాలని, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఉన్న కళాశాలల్లో చేర్పించాలన్న తల్లిదండ్రుల ఆశలను యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. వాస్తవానికి 70 శాతం కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేశాక యాజమాన్యాలు మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలి. తర్వాత ప్రతిభ ఆధారంగా సీట్లను భర్తీ చేయాలి. కానీ ఆ ప్రక్రియే మొదలు కాలేదు. కాలేజీల్లో ఫీజులు కూడా ఖరారు కాలేదు. అయినా కాలేజీలు అప్పుడే డొనేషన్ల దందాకు తెరదీయడం గమనార్హం.

ఎన్ని ఉంటాయో.. ఎన్ని ఊడుతాయో తెలియకుండానే..
గతేడాది లెక్కల ప్రకారం రాష్ట్రంలో 247 కాలేజీల్లో 1.26 లక్షల సీట్లు ఉన్నాయి. ఈసారి ఎన్ని కాలేజీల్లో, ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయో ఇంకా తెలియదు. అసలు ఏయే కాలేజీల్లో ఏయే బ్రాంచీలు ఉంటాయో, ఏయే బ్రాంచీలకు అనుబంధ గుర్తింపు వస్తుందో? ఎన్నింటికి రద్దు అవుతుందో కూడా తెలియదు. చివరకు ఎన్ని కాలేజీల్లో ఏయే బ్రాంచీల్లో, ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయన్న అంశం తేలలేదు. జేఎన్‌టీయూహెచ్‌ జారీ చేయాల్సిన కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఖరారు కాలేదు. ప్రభుత్వం చేపట్టిన విజిలెన్స్‌ తనిఖీలు సైతం కొలిక్కి రాలేదు. ఈ తనిఖీలు పూర్తయ్యాక.. ఆ నివేదికలను జేఎన్‌టీయూ నివేదికలతో సరిపోల్చి అప్పుడు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కూడా ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు. అలాగే ప్రభుత్వం ఈసారి మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను కూడా కన్వీనర్‌ కోటా తరహాలోనే ఆన్‌లైన్‌ ద్వారా భర్తీ చేయాలని భావిస్తోంది. ఇవేవీ తేలకముందే కాలేజీ యాజమాన్యాలు మాత్రం సీట్లను అంగడి సరుకుగా మార్చేశాయి.

కంప్యూటర్‌ సైన్స్‌కు భలే గిరాకీ
ప్రస్తుతం తల్లిదండ్రులు ఎక్కువ మంది కంప్యూటర్‌ సైన్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆ కోర్సుకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. దీన్ని యాజమాన్యాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. భారీగా డొనేషన్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. కాలేజీ ప్రతినిధులను మాటలను నమ్మి తల్లిదండ్రులు అడ్వాన్స్‌లు చెల్లించి సీట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.

ఈసారి భారీగా తగ్గనున్న సీట్లు!
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈసారి సీట్ల సంఖ్య భారీగా తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కాలేజీలో ల్యాబ్, ల్రైబరీ, తదితర వసతులు 250 మంది విద్యార్థులకు సరిపడ ఉంటే అనుమతులు మాత్రం 550 నుంచి 750 విద్యార్థుల వరకు తెచ్చుకుంటున్నట్టు జేఎన్‌టీయూహెచ్‌ గుర్తించింది. దీంతో కాలేజీల్లో ఉన్న సదుపాయాల ప్రకారమే విద్యార్థుల అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఫలితంగా ఈసారి కాలేజీల్లో సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే విషయం బయటకు పొక్కడంతో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు ఆందోళనలో పడ్డారు. కొంతమంది తమ డబ్బును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement