
సెంట్రల్ హాల్‌లో చదువుకుంటున్న విద్యార్థులు
రాయదుర్గం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ సంస్థలోని లైబ్రరీ నగరంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. పర్యాటక, ఆతిథ్య రంగంలో కోర్సులు, శిక్షణ కల్పించాలనే ఉద్దేశంతో గచ్చిబౌలి టెలికామ్ నగర్‌లోని 30 ఎకరాల విశాల స్థలాన్ని కేటాయించిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిథమ్ సంస్థను 2004 అక్టోబర్‌లో నెలకొల్పారు. అనంతరం నిర్మించిన భవనాలను 2005 మార్చి 16న అప్పటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో గ్రంథాలయాన్ని కూడా నిథమ్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ లైబ్రరీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంది. నూతన తరహాలో సేవలందిస్తోంది.
వీటిలో నిథమ్ ఒకటి..
నగరంలో కేవలం కొన్ని గ్రంథాలయాల్లోనే వినియోగించే అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) సాకేంతికతను వినియోగిస్తున్న విద్యా సంస్థగా నిథమ్ గుర్తింపు పొందింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ– హైదరాబాద్, నగరంలోని బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీతో పాటు మరికొన్ని విద్యాసంస్థల్లోనే దీనిని వినియోగిస్తున్నారు. వీటిలో నిథమ్ ఒకటి.
100 మంది కూర్చునేలా లైబ్రరీ హాల్
నిథమ్ గ్రంథాలయంలో ఓ మినీ హాల్‌ను కూడా అందుబాటులో ఉంచారు. లైబ్రరీ హాల్ పేరిట 5వేల చదరపు అడుగుల విశాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 100 మంది కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు.
గ్రంథ చౌర్యాన్ని ఇట్టే పట్టేస్తుంది..
ఈ గ్రంథాలయంలో పుస్తకాలను తస్కరించే వీలు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. లైబ్రేరియన్ ధ్యాస మరల్చి పుస్తకాన్ని తస్కరించి ప్రధాన ద్వారం దాటే ప్రయత్నంలోనే అప్రమత్తం చేస్తుంది. దీనికి ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతికతను వినియోగిస్తున్నారు. పుస్తకంలో ఏర్పాటు చేసిన చిప్ ద్వారా అనుమతి లేకుండా దానిని ఎవరైనా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే గుర్తించేలా ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ అండ్ డాటా క్యాప్చర్ (ఏఐడీసీ) అనే సాంకేతికతను వినియోగిస్తున్నారు.
అత్యాధునిక సౌకర్యాలు..
2006లో గ్రంథాలయాన్ని ఆధునీకరించడంలో భాగంగా ఆటోమేషన్ ఆఫ్ లైబ్రరీలో లిబ్‌సైస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడం ఆరంభించారు. ఆ తర్వాత సోహా ఓపెన్ సోర్స్ లైబ్రరీ ఆటోమేషన్ చేశారు. 2016లో ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతికను వినియోగించడం అమలు చేశారు. ఆర్‌ఎఫ్‌ఐడీ సెక్యూరిటీ గేట్, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్స్, సెల్ఫ్‌చెక్ ఇన్/ఔట్ కియోక్స్, రెప్రోగ్రఫీ ఫెసిలిటీ, మల్టీమీడియా ఫెసిలిటీ, ఇంటర్నెట్ కనెక్టెడ్ కంప్యూటర్స్, నాన్–బుక్ మెటీరియల్ మ్యాప్స్, సీడీరోమ్స్, డీవీడీలు, వైఫై ఫెసిలిటీ, నిథమ్ ఈ– న్యూస్‌లెటర్ వంటి అత్యాధునిక సాంకేతికతను లైబ్రరీలో అందుబాటులో ఉంచడం విశేషం. ఈ క్రమంలోనే గ్రంథాలయంలో నూతనంగా ఆన్‌లైన్ పబ్లిక్ యాక్సెస్ కేటలాగ్– లైబ్రరీ కేటలాగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
విద్యార్థుల సౌకర్యార్థమే ‘సెల్ఫ్ చెక్’
దక్షిణ భారతంలోనే ఎక్కడా లేని విధంగా బయోమెట్రిక్ విధానం ద్వారా సెల్ఫ్‌చెక్ వ్యవస్థను నిథమ్‌లో అమలు చేస్తున్నాం. ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతికను వినియోగించడం ద్వారా పనిచేయడం ఎంతో సులువుగా మారింది. గ్రంథాలయాన్ని మరింత ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – యాదగిరి, నిథమ్ లైబ్రేరియన్
డిజిటల్ లైబ్రరీ ఏర్పాటే లక్ష్యం
డిజిటల్ లైబ్రరీగా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. డీ స్పేస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి పుస్తకాలు, ఇతర వాటిని డిజిటలైజ్ చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నాం. లైబ్రరీలో డిస్కషన్ రూమ్‌ను ఏర్పాటు చేశాం. సెంట్రల్ ఏసీ, కుషన్ వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచాం. – డాక్టర్ ఎస్.చిన్నంరెడ్డి, నిథమ్ డైరెక్టర్