అమ్మ, నాన్న.. ఓ ఆటో మామయ్య | special story on auto driver anjaiah | Sakshi
Sakshi News home page

అమ్మ, నాన్న.. ఓ ఆటో మామయ్య

Published Sun, Dec 24 2017 10:46 AM | Last Updated on Sat, Sep 15 2018 5:14 PM

special story on auto driver anjaiah - Sakshi

రిమ్‌జిమ్‌ రిమ్‌జిమ్‌ హైదరాబాద్‌.. ఆటోవాలా జిందాబాద్‌! అమ్మో.. సిటీలో ఆటో ప్రయాణాన్ని ఇంతగా ఎంజాయ్‌ చేయగలమా..! మీటర్‌ వేయకుండా నోటికొచ్చినంత అడిగే ఆటోవాలాలు ఉన్నప్పుడు ఇలాంటి ఆనందం అసాధ్యమనకండి. ‘జిందాబాద్‌’ కొట్టాల్సిన వారూ ఉంటారు! ఇదిగో ఈ అంజయ్యలాగ. అంజయ్య ఆటోడ్రైవరే కాదు.. అమ్మానాన్నలు పంచే ప్రేమను పికప్‌ చేసుకొని పిల్లల దగ్గర డ్రాప్‌ చేస్తుంటాడు. స్కూల్లోని ఒత్తిడిని తగ్గించి టీచర్లు చెప్పే పాఠాలను ఫాలో అయ్యేలా చూస్తాడు. అతడి ఆటోలో స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లి, తండ్రి, టీచర్, గైడ్‌.. అంతకు మించి ఫ్రెండ్‌. అందుకే పిల్లలంతా ఆప్యాయంగా ‘మామయ్యా’ అని పిలుచుకుంటారు. ఇంతకీ ఈ ఆటోవాలా ఏం చేస్తాడు..!

ఆటో అంజయ్య అంటే.. అందరికీ అభిమానమే.. ముఖ్యంగా చిన్నారులకు..ఉదయమే స్కూలుకెళ్లాలంటే పిల్లలుమారాం చేస్తారు.. అయితే అంజయ్య ఆటో కనపడగానే హ్యాపీగా వచ్చి ఆటోఎక్కేస్తారు.. అదీ ఆయన స్పెషాలిటి.  

సాక్షి, సిటీబ్యూరో: నెల్లుట్ల అంజయ్యది నల్లగొండజిల్లా.  ఓ కెమికల్‌ కంపెనీలో ఉద్యోగం రావడంలో హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాడు. కాలక్రమంలో ఆ కంపెనీ లాకవుట్‌ అయ్యేసరికి ఉద్యోగం పోయింది. బతుకుదెరువు ప్రయత్నాల్లో కొన్ని ప్రైవేట్‌ కంపెనీల్లో చేరాడు. కాని అవీ ఎక్కువకాలం సాగలేదు. ఒక క్రమబద్ధమైన పనికి అలవాటు పడిన అతనికి తర్వాత ఏం చేయాలో అర్థంకాలేదు. భార్య సలహా ఇచ్చింది.. ‘‘హైదరాబాద్‌లో ఆటో లాభసాటిగా సాగకపోయినా పొట్టకు, బట్టకు లోటుండదు ఆటో డ్రైవింగ్‌ నేర్చుకో’ అని.  దీంతో సెకండ్‌ హ్యాండ్‌ ఆటో కూడా కొనేసుకున్నాడు. ఆ ప్రయాణం నల్లేరు మీద నడక కాదు గానీ నల్లని గతుకుల తారు మీద ఒడిదుడుకులుగానే వెళ్తొంది.

పిల్లలు.. పెద్దలు
అప్పటికే అంజయ్యకు ఇద్దరు పిల్లలు. ఒకపాప, బాబు. వాళ్లను తన ఆటోలో స్కూల్లో దింపుతుంటే తోటి ఆటో స్నేహితులు..‘‘ ఎట్లాగూ మీ పిల్లలను దింపుతున్నావ్‌ కదా.. స్కూల్‌ పిల్లలను మాట్లాడుకుంటే ఎంతోకొంత ఆదాయం వస్తుందికదా..  అని సూచించారు. అంజయ్యకూ నిజమే అనిపించింది. పైగా పిల్లలంటే తనకు చాలా ఇష్టం. ముందు కేంద్రీయ విద్యాలయలో చదివే ముగ్గురు  పిల్లలను మాట్లాడుకున్నాడు. మూడునెలల్లో మచ్చికైపోయారు వాళ్లు. అంజయ్యతో ఇంట్లో మనిషితో కబుర్లు చెప్పినట్టే చెప్పేవారు. ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో.. టీచర్లు ఏం చెప్పారో పిల్లలను అడిగివాడు. వాళ్లు అంతే ఉత్సాహంగా అన్నీ చెప్పేవాళ్లు. పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు ఆటో వేగాన్ని, తన ప్రవర్తనను ఎప్పుడూ హద్దు మీరనివ్వలేదు. ఈ మంచితనమే మౌత్‌పబ్లిసిటీ అయి మరింత మంది పిల్లలను స్కూల్లో దింపే ఆఫర్‌ వచ్చింది. నిజానికి ఉదయమే పిల్లల్ని స్కూల్లో దింపడంతో రోజు హుషారుగా మొదలయ్యేది. సాయంకాలం ఆ పిల్లలను ఇంట్లో దింపేటప్పుడు వాళ్లతో గడిపే ఆ సమయం.. ఆరోజు పడ్డ బడలికనంతా మాయం చేసేది.  

వెల్‌కమ్‌ అండ్‌ ఫేర్‌వెల్‌
అప్పుడే జాయిన్‌ చేసిన పిల్లలు, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలు స్కూల్‌కి వెళ్లమని మారాం చేస్తారు. అసలు ఆటో ఎక్కడానికే మొండికేస్తారు. సముదాయించలేక తల్లులు సతమతమవుతుంటారు. అప్పుడు అంజయ్య అసలు వాళ్లను ఆటో ఎక్కిస్తే చాలు.. స్కూల్‌ వరకు వాళ్లే వస్తారు అనుకునేవాడు. దాంతో ఉదయమే వచ్చేటప్పుడు గుప్పిటి నిండా వాళ్లకిష్టమైన చాక్లెట్లను తెచ్చి ఏడుస్తున్న పిల్లలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచేస్తాడు. ఆ పిల్లలు ఆరునొక్కరాగం తీయకుండా ఎంచక్కా తయారై ఆటో ఎక్కేస్తారు. చాక్లెట్‌ చప్పరించేసరికి స్కూలూ వచ్చేస్తుంది. ఇలా మంచి చేసుకొని తల్లులనే మరిపించేయడం అంజయ్య ప్రత్యేకత. అదే ఆయన ఆప్యాయత. అంతే స్కూళ్లు మొదలవగానే ఫస్ట్‌డే పిల్లలందరినీ బేకరీకి తీసుకెళ్లి వాళ్లకు ఇష్టమైనవి కొనిపెడ్తాడు. అలాగే స్కూల్‌ లాస్ట్‌డే కూడా పానీపూరీ, పేస్ట్రీలు.. ఎవరికి ఏది నచ్చితే అది తినిపించి ఫేర్‌వెల్‌ ఇస్తాడు. ‘‘పిల్లలు లేని ఎండాకాలం రెండు నెలల సెలవులు నాకు బోరే! పిల్లలుంటేనే ఆటో సందడి.. నాకు సంబరం’’ అంటాడు అంజయ్య.  

సినిమాలు..సీరియళ్లు..
అంజయ్య ఆటో అంటే పిల్లలకు ఎంత ఇష్టమో.. తల్లిదండ్రులకు అంత భరోసా! ‘‘రోజూ వచ్చే టైమ్‌కన్నా ఆలస్యమైనా భయం ఉండదు. వచ్చేస్తారు.. అంజయ్య క్షేమంగా పిల్లల్ని దింపేస్తాడు అన్న థిలాసా.. ధీమా తప్ప’’ అంటారు తల్లిదండ్రులు. పిల్లలూ అంతే.. అంజయ్యను వదలరు. స్కూల్లో టీచర్‌ తిట్టినా.. ఇంట్లో అమ్మ కొట్టినా అంజయ్యకు చెప్పి.. బాధను పంచుకోవాల్సిందే.. బరువు దించుకోవాల్సిందే! అంజయ్య ఊరడిస్తుంటే హ్యాపీగా ఫీలవ్వాల్సిందే. అయితే పిల్లల కబుర్లు ఇక్కడితో ఆగవు... ఆ రోజు వాళ్లు చూసిన సీరియల్స్, పోగో చానల్‌లోని కార్టూన్‌ క్యారెక్టర్స్‌ నుంచి ఆ వీకెండ్‌లో మమ్మీడాడీతో కలిసి వెళ్లిన సినిమా స్టోరీ దాకా.. సాంతం అంజయ్యకు చెప్పాల్సిందే. లేకుంటే నిద్రపట్టదు. డ్రైవింగ్‌ మీద దృష్టిపెడుతూనే పిల్లల ముచ్చట్లకు ఊ కొట్టడం.. వాళ్లను ఉషారు పర్చడం 20 ఏళ్లలో అంజయ్యకు అలవడిన విద్య. ‘‘పిల్లలు కదా.. వినకపోతే చిన్నబోతరు. వాళ్లు కోరుకునేదీ అదే.. వాళ్లను వినడం.. వాళ్లను పట్టించుకోవడం. ఆటోలో స్కూల్‌పిల్లలను తీసుకెళ్లనంత వరకు నాకు ఇద్దరు పిల్లలే.

ఇప్పుడు వీళ్లంతా నా పిల్లలే’’ అని ఆనందంగా చెప్తాడు ఆటోలో పిల్లలను చూపిస్తూ అంజయ్య. అతని ఆటోలో స్కూల్‌ కెళ్లిన చాలామంది పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లై ఉద్యోగాలు చేస్తున్నవాళ్లున్నారు.. పెద్ద చదువుల కోసం యూనివర్శిటీల్లో చేరినవాళ్లూ ఉన్నారు. ‘‘మా స్టూడెంట్స్‌ ఫలానా అని టీచర్లు ఎంత గర్వంగా చెప్పుకుంటారో.. నాకూ అంతే గర్వంగా అనిపిస్తుంటుంది.. అరే..ఈ బాబును నా ఆటోల్నే తీసుకెళ్లిన.. ఈ పాప నా ఆటోల్నే స్కూల్‌కెళ్లేది అని గుర్తు చేసుకుంటుంటే. చాలా మంది పిల్లలు పెద్దవాళ్లై ఎక్కడెక్కడనో ఉన్నరు. నెలకు ఒక్కసారన్నా కాల్‌ చేసి మాట్లాడ్తారు. మంచిగనిపిస్తుంటుంది. డబ్బులు కావు.. ఇలాంటి జ్ఞాపకాలు మిగిల్తే చాలు అనిపిస్తుంటుంది. ఏం తీసుకపోతం పొయ్యేప్పుడు.. ఇలాంటి మంచి పేరు ఎప్పటికీ ఉంటది కదా’’ అంటాడు అంజయ్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ! 

నిజాయితీకి నిదర్శనం.. అంజయ్య
తమ పిల్లలను స్కూల్లోకి తీసుకెళ్లి ఇంట్లో దింపే ఓ డ్రైవర్‌గా చూడనే చూడరు ఆ తల్లిదండ్రులు. తమ ఇంటిమనిషిలా గౌరవిస్తారు. ఏ ఫంక్షనైనా.. పండగైనా పిలుస్తారు. నిజాయితీ ఆయన నమ్మిన సూత్రం. ఒకసారి ఆయన ఆటోలో ఒక పెళ్లివాళ్లు షాపింగ్‌ వెళ్లారు. చీరలు, నగలు కొని మళ్లీ ఆయన ఆటోలోనే ఇంటికి చేరారు. నగల బ్యాగ్‌ సీట్‌ వెనకాల పెట్టారు. చీరల బ్యాగ్‌లు ఒళ్లో పెట్టుకొని ఇల్లు రాగానే వాటిని మాత్రమే తీసుకెళ్లిపోయారు వెనక బ్యాగ్‌ మరిచిపోయి. ఆ విషయం అంజయ్యకూ తెలీదు. ఇంతలో ఇంకో గిరాకీ రావడంతో వాళ్లను తీసుకుని వెళ్లాడు ఆయన. ఆ ప్యాసెంజర్స్‌ దిగిపోతూ ఎందుకో సీట్‌ వెనకాల చూసి.. ‘‘ఏదో బ్యాగ్‌ ఉందయ్యా.. ఎవరిదో మరి’’ అని చెప్పి వెళ్లిపోయారు. ఆ బ్యాగ్‌ ఇందాకటి పెళ్లివాళ్లది. నేరుగా ఆటోని దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు పోనిచ్చి ఆ బ్యాగ్‌ను అప్పజెప్పి ఎవరిదో కూడా చెప్పి వాళ్ల వివరాలు ఇచ్చి వచ్చేశాడు ఆటో స్టాండ్‌కి. ఈలోపే ఆ పెళ్లివాళ్లు వచ్చారు అంజయ్య దగ్గరకు వగరుస్తూ. ‘‘కంగారు పడకండీ.. మీ బ్యాగ్‌ ఎటూ పోలేదు. ఇందాకే పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చాను. పద తీసుకెళ్తాను’’ అని వాళ్లను పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లాడు. ఆ బ్యాగ్‌లో 40 తులాల బంగారం ఉంది. అది తీసుకున్న పెళ్లి వాళ్ల ఆనందం అంతాఇంతా కాదు. అంజయ్యను మొక్కినంత పని చేశాడు.

‘‘ఇది నాకు మామూలే. చాలా మంది ఆటోలో ఎన్నో విలువైన వస్తువులు మర్చిపోతుంటారు. చాలా సార్లు వాళ్ల ఇంటికి వెళ్లి మరీ ఇచ్చిన సందర్భాలున్నాయి. చీపురుకట్టలతో సహా. పరాయి సొమ్ము పాములాంటిది. కష్టపడ్డ ఫలితం ఆవగింజైనా సరే అది మనది. ఒంటికి పడ్తుంది. మనది కానిది కోట్లలో వచ్చినా సరే.. కన్నెత్తి చూడొద్దు. ఇది మా పెద్దలు నేర్పిన నీతి. నా పిల్లలకూ నేను పంచింది ఇదే’’ అంటాడు అంజయ్య. ఒకరోజు ఒక చాట్‌ వ్యాపారి తన ఆటోలో గప్‌చిప్‌ల సంచీ మర్చిపోతే.. అతని అడ్రస్‌దొర్క ఆ సంచీని ఇంట్లోనే మూడు రోజులు పెట్టుకున్నాడు మానాన్న. ఆ గప్‌చిప్‌లేమో మమ్మల్ని ఊరిస్తున్నాయి. మనమే ఉంచుకుందాం నాన్నా వాటిని అని నేను, మా తమ్ముడు ఏడ్చినా.. మీకు వేరేవి కొనిస్తాను అని అన్నాడు తప్ప వాటిని ఇవ్వలేదు. మూడు రోజులకు అతని అడ్రస్‌ కనుక్కొని వెళ్లి ఇచ్చేసి వచ్చాడు’’ అని తమ చిన్ననాటి సంఘటను గుర్తు చేసుకుంది అంజయ్య కూతురు నిఖిత. అది ఆయన వ్యక్తిత్వం. 

ఆటోవాలా.. అంటే అన్యాయంగా మీటర్‌ తిప్పేవాడు కాదు.. ఆకాశన్నంటే బేరం చెప్పేవాడు అంతకన్నా కాదు! బరువు, బాధ్యత కోసం బతుకు బండీ లాగే మనలాంటి మనిషే!అందరూ కాకపోవచ్చు కొందరైనా ఇలాంటి వాళ్లున్నారు. ప్రయాణికులను భద్రంగా గమ్యం చేర్చేవాళ్లు! నిదర్శనం.. అంజయ్యే! అర్బన్‌ డైరీ పుటల్లో గుర్తుంచుకోవాల్సిన పేజీనే!

అంకుల్‌కీ ఫేర్‌వెల్‌ ఇచ్చాం
నేను చిన్నప్పటి నుంచీ అంకుల్‌ ఆటోలో వెళ్తున్నా. ఇప్పుడు నేను ఇంటర్‌ సెకండియర్‌. మేం టెన్త్‌లో ఉన్నప్పుడు లాస్ట్‌ వర్కింగ్‌ డే రోజు.. అందరం కలిసి అంకుల్‌కు ఫేర్‌వెల్‌ ఇచ్చాం. మళ్లీ అంకుల్‌ ఆటోలో వెళ్లలేం కదా. అది తల్చుకున్నప్పుడు ఆరోజు చాలా బాధనిపించింది. ఏడ్చేశాం కూడా! చాలా బాగుండేవాళ్లు. ఎన్నో జాగ్రత్తలు చెప్పేవాళ్లు. బాగా సరదాగా ఉండేది.
– డి. సాహితి

విసుక్కోడు
‘‘ఆటోలో చాలా అల్లరి చేస్తాం. అయినా అంకుల్‌ ఏమీ అనడు. వెళ్తూ వెళ్తూ ఏదైనా షాప్‌కనపడి మాకేమన్నా కావాలని అడిగితే ఆటో ఆపి కొనిస్తాడు. కాని ఎందుకు అని విసుక్కోడు.
– చందు

కోపం రాదు
మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు. జాగ్రత్తగా దింపుతాడు. ఎన్ని కబుర్లు చెప్తామో.. ఎంత అల్లరి చేస్తామో! అయినా పాపం.. అంకుల్‌ అస్సలు కోపగించుకోడు.
–  చిక్కీ

హాకీలో ప్రోత్సహించేవారు
ఇప్పుడు నేను ఓ ఎమ్‌ఎన్‌సీలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నా. నైన్త్‌ క్లాస్‌ వరకూ  అంకుల్‌ ఆటోలోనే  వెళ్లాను. ఆయన మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. మాకు ఇంట్లో కానీ స్కూల్‌లో కానీ లేట్‌ అయినా అడ్జస్ట్‌ అయ్యేవారు. నాకు హాకీ అంటే చాలా ఇష్టం. దాంతో క్లాసెస్‌ అయ్యాక, హాకీ ఆడుతుండేవాణ్ని. అప్పుడు నాకు లేట్‌ అయ్యేది. అయినా అంకుల్‌ వెయిట్‌ చేసేవాళ్లు. ఆటోలో కూడా ‘ఎలా చదువుతున్నావ్‌?’, ‘హాకీ  ప్రాక్టీస్‌ ఎలా జరుగుతోంది?’ అని అడిగి నన్ను ఎంకరేజ్‌ చేసేవాళ్లు. హి ఈజ్‌ వెరీ కూల్‌ పర్సన్‌.       
– రాజీవ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement