పాన్‌ మండే.. నోరు పండే! | special story on fire pan | Sakshi
Sakshi News home page

పాన్‌ మండే.. నోరు పండే!

Feb 19 2018 7:35 AM | Updated on Sep 5 2018 9:52 PM

special story on fire pan - Sakshi

హిమాయత్‌నగర్‌: పంచ భక్ష్య పరమాన్నంతో భోజనం చేశాక పచ్చని తమలపాకులతో చక్కగా ఓ పాన్‌ చుట్టి నోట్లో వేసుకుంటే.. ఆ మజానే వేరు. అప్పుడే కదా విందు చేసిన సంతృప్తి ఉండేది. భోజన ప్రియులు ఎవరన్నా ఇలాగే చెబుతారు. అంతలేకున్నా కడుపు నిండా ఇష్టమైన భోజనం చేశాక పాన్‌ వేసుకునేవారు చాలామందే ఉన్నారు. ఇక దమ్‌ బిర్యానీ లాంగిచేశాక ఓ పాన్‌ వేసుకుంటే బాగా జీర్ణమవుతుందనా చాలామంది సిటీవాసులు అభిప్రాయం అదే నమ్మకంతో చాలామంది పాన్‌ కోసం క్యూ కడతారు. సిటీలో ఎన్ని పాన్‌షాపులు ఉన్నా.. ఒక్కో షాపుది ఒక్కో ప్రత్యేకత. ఇదే కోవలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు నిలోఫర్‌ ఆస్పత్రి సమీపంలోని ‘ఎన్‌ఎన్‌ఎస్‌ పాన్‌ మహల్‌’ వారు. ‘భగభగ మండే’ పాన్‌తో పాన్‌ప్రియులను అలరిస్తూ సిటీకే ‘ఫైర్‌’ టాపిక్‌గా మారారు. 

ఓల్డ్‌సిటీలోని హుస్సేనీ ఆలంకు చెందిన నజర్‌నభీ సాలార్‌ (ఎన్‌ఎన్‌ఎస్‌)కు పాన్‌ అంటే అమితమైన ప్రేమ. ఈ ప్రేమతోనే 1950లో ఓల్డ్‌సిటీలో ‘షేరాన్‌ పాన్‌’ పేరుతో ‘ఫైర్‌ పాన్‌’ను ప్రారంభించారు. అప్పట్లో ఇక్కడ దొరికే ఈ ఫైర్‌ పాన్‌ కోసం నగరవాసులు బారులు తీరేవారు. అనుకోకుండా కొంతకాలానికి పాన్‌ అమ్మకాలను నిలిపివేశారు. ఆ తర్వాత నిలోఫర్‌ ఆస్పత్రి సమీపంలో ఎన్‌ఎన్‌ఎస్‌ కుటుంబ సభ్యులు ‘ఎన్‌ఎన్‌ఎస్‌ పాన్‌ మహల్‌’ పేరుతో ఫైర్‌పాన్‌ అమ్మకాలను ప్రారంభించారు.

ప్రత్యేకత ఏమిటి..  
ఫైర్‌పాన్‌లో ‘స్ట్రాబెర్రీ ఫ్లేవర్, హాట్‌చీజ్, ఇంట్లో తయారు చేసిన గుల్హాకన్, కోకోనట్, డౌట్స్, ఖర్జూర, స్వీట్‌మసాలా, హెర్బల్‌ మసాలా’తో పాన్‌ తయారు చేస్తారు. తమలపాకుపై ఇవన్నీ వేసిన తర్వాత మంటను వెలిగిస్తారు. భగభగ మండుతున్న ఆ పాన్‌ను నోట్లో వేసుకుంటే ఓ కరమైన కూల్, హాట్, స్వీట్‌ వంటి టేస్ట్‌లు నాలుకకు తగలడం విశేషం. నాలుక ఎర్రగా పండడంతో పాటు రోజంతా నోరు ఫ్రెష్‌గా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంత టేస్ట్‌ కలిగిన ఈ పాన్‌ను ప్రస్తుతం రూ.50కి విక్రయిస్తున్నారు.

రోజుకు 100కు పైగానే..  
ఫైర్‌పాన్‌ తయారీ, విక్రయం దేశంలోనే మాది ఫస్ట్‌ ప్లేస్‌. మా తాత నజర్‌నబీ సాలార్‌ (ఎన్‌ఎన్‌ఎస్‌) చూపించిన ఈ చక్కటి అవకాశాన్ని వంశ పారంపర్యంగా కొనసాగిస్తున్నాం. ఫైర్‌పాన్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ప్రతిరోజూ వందకుపైగా అమ్మకాలు జరుగుతున్నాయి. వీకెండ్స్‌లో అయితే ఐదారొందల మంది తింటుంటారు.   – మహ్మద్‌ జయుద్దీన్, పాన్‌షాపు యజమాని

టేస్ట్‌ మస్తుంది..  
నిలోఫర్‌లో మా బంధువుల్ని చూసేందుకు కొద్దిరోజుల క్రితం వచ్చాను. ఇక్కడ ఫైర్‌పాన్‌ బాగుంటుందని అందరూ అనుకుంటుంటే విన్నా. ఫ్రెండ్స్‌తో వచ్చి మరీ టేస్ట్‌ చేశా. ఓ పక్క మంట మండుతుండగానే నోట్లో పెట్టుకోవాలంటే ముందు భయపడ్డా, తింటుంటే టేస్ట్‌ మస్త్‌ ఉంది.– చందుగౌడ్, ప్రైవేట్‌ ఉద్యోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement