
ఇటీవల కేరళలో సముద్రంలోకి వెళ్లిన చాలామంది జాలర్లు ఓక్కీ తుపాను తీవ్రతకు మరణించారు. గుర్తింపు పత్రాలేవీ లేకపోవడంతో ఏ మృతదేహం ఎవరిదో తెలుసుకోలేకపోయారు!! ఏం చేయాలి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పని చేసిన ఎన్.డి.తివారీ గుర్తున్నారా? ఆయన తన తండ్రి అంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేసి మరీ గెలిచాడు! ఎలా తెలిసింది?
హైదరాబాద్‌లోని నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఇటీవల చిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. ఒక నవజాత శిశువుకు పొరపాటున రెండు ట్యాగులు కట్టేయడంతో బిడ్డ ఎవరికి పుట్టారన్న విషయంపై గందరగోళం నెలకొంది. చివరికి ఈ కేసు ఎలా తేలింది?
ఈ మూడు చిక్కు ప్రశ్నలకు సమాధానం వెతకడం.. ఒకప్పుడైతే చాలా కష్టమయ్యేదేమో గానీ ఇప్పుడు రోజుల వ్యవధిలో పరిష్కారమైపోతాయి. డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ మహత్యమే ఇదంతా. మనిషి మాత్రమే కాదు.. భూమ్మీది ప్రాణి కోటిలోని ఈ ప్రత్యేక జన్యు సమాచార నిధిని సక్రమంగా వాడుకుంటే.. అటు నేర సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు, జంతు ప్రపంచాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సాధ్యమవుతుంది. మరి ఈ డీఎన్‌ఏ అంటే ఏమిటి? వేలిముద్రల కంటే డీఎన్‌ఏ ఆనవాళ్లు ఎంత ప్రత్యేకం? డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎలా చేస్తారు? అన్న సందేహాలు మీకూ ఉన్నాయా? చదివేయండి మరి!
నిచ్చెన ఆకారం.. సకల సమాచారం..
అతి సూక్ష్మ బ్యాక్టీరియా మొదలుకొని ఒకప్పటి రాక్షస బల్లుల వరకూ అన్ని జీవుల్లోని కణాల్లో ఉండే ప్రాథమికమైన విషయం డీఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్.. క్లుప్తంగా డీఎన్‌ఏ. మనం ఎంత పొడవు పెరగాలి? కళ్ల రంగు ఏంటి? వచ్చే జబ్బులేవి? వంటి అన్ని రకాల సమాచారం దీంట్లోనే ఉంటుంది. మన కణ కేంద్రకాల్లోని మైటోకాండ్రియాలో ఉండే క్రోమోజోమ్‌లలో ఈ డీఎన్‌ఏ ఉండ చుట్టుకుని ఉంటుంది. అడినైన్, గ్వానైన్, థయమీన్, సైటోసైన్ అనే నాలుగు రసాయనాలతో ఏర్పడే డీఎన్‌ఏ.. మెలితిరిగిన నిచ్చెన ఆకారంలో ఉంటుందని 1953లో జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిచ్చెన మెట్లు రెండు రకాలుగా ఉంటాయి. అడినైన్ కేవలం థయమీన్‌తో మాత్రమే జతకట్టి ఒక మెట్టులా ఉంటే.. సైటోసైన్ గ్వానైన్‌తో మాత్రమే జతకడుతుంది. ఇలాంటి ఒక్కో మెట్టును న్యూక్లియోటైడ్ బేస్ పెయిర్ అంటారు. మానవ డీఎన్‌ఏలో దాదాపు 300 కోట్ల బేస్ పెయిర్స్ ఉంటాయని అంచనా.
ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ ఇదీ
రక్తం, స్వేదం, ఎముక, వెంట్రుకలు, శుక్ర కణాలు, కణజాలం ఇలా ఏదైనా జీవ పదార్థాన్ని సేకరించడంతో డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నమూనాల ఆధారంగా వాటి కణాల్లోంచి డీఎన్‌ఏను ప్రత్యేక పద్ధతుల ద్వారా వేరు చేస్తారు. పాలిమరేస్ చైన్ రియాక్షన్ ద్వారా ఈ డీఎన్‌ఏ పోగుల సంఖ్యను కొన్ని వేల రెట్లు పెంచుతారు. ఈ పోగులన్నింటినీ ఓ ద్రావణంలోకి వేసి విద్యుత్తు ప్రసారం చేస్తారు. దీన్ని జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటారు. డీఎన్‌ఏ పోగులకు రుణావేశం ఉంటుంది కాబట్టి అవన్నీ ధనావేశమున్న చోట గుమిగూడతాయి. కొన్ని రసాయనాలను వాడటం ద్వారా ఈ పోగులను ప్లాస్టిక్ కాగితంపై కనిపించేలా చేస్తారు. ఇలా రెండు జన్యు క్రమాలను పోల్చినప్పుడు వాటిలో ఎంత మేరకు ఒకేలా ఉందో తెలిసిపోతుంది.
ఉపయోగాలేంటి?
నేర నిర్ధారణతోపాటు అనేక ఇతర రంగాల్లో డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎంతో ఉపయోగకరం. మాతృత్వ, పితృత్వ వివాదాల పరిష్కారానికి, అవశేషాల ఆధారంగా వ్యక్తులు, జంతువులను గుర్తించేందుకూ ఈ పద్ధతిని వాడుతున్నారు. ఆస్పత్రుల్లో నవజాత శిశువుల మార్పిడికి సంబంధించిన వార్తలు వింటూ ఉంటాం.. అలాంటి వివాదాలను పరిష్కరించేందుకు డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ మేలైన మార్గం.
ప్రతి ఒక్కరిదీ ప్రత్యేకం..
భూమ్మీద 730 కోట్ల మందికిపైగా మనుషులుంటే.. ఇందులో ఏ ఒక్కరి డీఎన్‌ఏ కూడా ఇంకొకరి మాదిరిగా ఉండదు. అయితే డీఎన్‌ఏలోని 300 కోట్ల బేస్ పెయిర్స్‌లో 99.7 శాతం అందరికీ సమానమే. మిగిలిన బేస్ పెయిర్స్‌లో ఉండే తేడాలే ఒకొక్కరినీ ప్రత్యేకం చేస్తాయి. ఈ తేడాలు ఎక్కడున్నాయో గుర్తించడం ద్వారా ఇద్దరి డీఎన్‌ఏను పోల్చవచ్చు. డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పని చేసేది ఇలాగే. బిడ్డకు తండ్రికి మధ్య ఉండే పోలికలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే.. తోబుట్టువుల మధ్య ఇది 25 శాతం నుంచి 75 శాతం వరకూ ఉంటుంది. ఒకే పిండం రెండుగా విడిపోయి పుట్టిన కవలల్లో మాత్రమే వంద శాతం పోలిక కనిపిస్తుంది.
ఎవరైనా డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకోవచ్చా?
భారత్‌లో ప్రస్తుతానికి ఇది సాధ్యం కాదు. మాతృత్వ, పితృత్వ పరీక్షల కోసం కోర్టు ఆదేశాలు తప్పనిసరి. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్‌తోపాటు తిరువనంతపురంలోని ద రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌జీసీబీ) ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ నియంత్రణ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు, ప్రమాదాల్లో మరణించి రూపురేఖలు తెలియని స్థితిలో ఉన్న వారి కి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు అందులో ప్రామాణిక పద్ధతులను నిర్దేశించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment