పేదలకు కష్టమే | Special Story On Online Education To Students Not Getting Information | Sakshi
Sakshi News home page

పేదలకు కష్టమే

Published Thu, Jul 23 2020 1:33 AM | Last Updated on Thu, Jul 23 2020 4:57 AM

Special Story On Online Education To Students Not Getting Information - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈ ఫొటోలో కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని కందిబండ గ్రామం. ఈ గ్రామంలో దాదాపు 5 వేలు జనాభా ఉంది. గ్రామ పరిధిలో గాంధీనగర్‌ తండా, మంగలికుంట తండా, నల్లబండ గూడెం ఆవాస గ్రామాలు ఉన్నాయి. వాటిలో 1,450 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామాల విద్యార్థులు అందరూ ఉన్నత పాఠశాల విద్య కోసం కందిబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వస్తారు. 1976 నుంచి ఈ గ్రామంలో హైస్కూల్‌ విద్య ప్రారంభమైంది. ప్రస్తుతం కందిబండ ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులున్నారు. వీరిలో 30 మంది పదోతరగతి చదవాల్సి ఉంది. ఈ పాఠశాలలో ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చిన కేయాన్‌ ప్రొజెక్టర్‌ ఉంది కానీ అది పేరుకు మాత్రమే. దాన్ని ఎన్నడూ ఉపయోగించింది లేదు... అది పనిచేస్తుందో లేదో కూడా తెలియదు.

ఇక ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో 90 శాతం మందికి ఫోన్లు ఉన్నాయి. కానీ ఆన్‌లైన్‌ తరగతులకు ఉపకరించే స్మార్ట్‌ఫోన్‌లు మాత్రం 30 శాతం మందికే ఉన్నాయి. ఈ పాఠశాలలో చదువుకుంటోంది కూడా ఎక్కువ శాతం మధ్యతరగతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల విద్యార్థులు. వీరిలో స్మార్ట్‌ఫోన్‌లు వాడేవారు చాలా తక్కు వ. సాధారణ ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తుంటారు. గ్రామంలోని ఏ ఒక్క కుటుంబం కూడా రెండు లేదా మూడు స్మార్ట్‌ఫోన్‌లు కలిగి లేదు. ఉన్న ఒక్క స్మార్ట్‌ ఫోనూ ఇంటి యజమాని చేతిలో ఉంటుంది. ఇక, విద్యార్థులకు ఫోన్‌ల ద్వారా ఆన్‌లైన్‌ తరగతులంటే మాత్రం ఈ పాఠశాలలో చదువుకుంటున్న వారిలో 90 శాతానికి పైగా విద్యార్థులు పాఠాలు వినే పరిస్థితి లేదు. స్మార్ట్‌ఫోన్‌లున్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కూడా సమయానికి ఫోన్‌ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.

ఇంటర్నెట్‌ మాటేంటి?
గ్రామీణ విద్యార్థులు సమీపంలోని పట్టణాల్లో ఉండే ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులంటే వీరికి కష్టకాలమే. ఎందుకంటే అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. మారుమూల ప్రాంతాల్లో వీడియో రూపంలో ఏకధాటిగా 30–60 నిమిషాల పాటు పాఠం వినే విధంగా మొబైల్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సహకరించడం అనుమానమే. 

కొత్త ఫోన్‌ కొనాలంటే
స్మార్ట్‌ఫోన్‌ లేని కుటుంబాలు కొత్తగా ఫోన్లు కొనాలంటే వారి ఆర్థిక స్తోమత సరిపోదు. ప్రస్తుతం కనీసం రూ.10వేలు పెట్టి స్మార్ట్‌ఫోన్‌ కొని, పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాలు నేర్పించడం కష్టమే. ఆన్‌లైన్‌ పాఠాలు వినాలంటే ముందు స్కూలు ఫీజు కట్టాలి. పుస్తకాలు కొనాలి. అప్పుడే విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు ఇస్తున్నారు. కరోనా తెచ్చిపెట్టిన ఫోన్‌ చదువులు గ్రామీణ, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా భారం కానున్నాయి. ఇక ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుకునే లక్షలాది మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పాలంటే ట్యాబ్‌లు ఇవ్వడం వంటి ప్రత్యేక చర్యలు చేపడితే తప్ప ఉపయోగం కనిపించట్లేదు. 

టీవీలు పాతవి...
ఇక టీవీల విషయానికి వస్తే 95 శాతం ఇళ్లలో టీవీలు మాత్రం ఉన్నాయి. ఈ టీవీల్లో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఉన్న టీవీలు 10 శాతం కూడా లేవు. ఎప్పటి నుంచో వినియోగిస్తున్న ఈ టీవీల్లో సరిగా బొమ్మ కనిపించడమే కష్టమని, ఈ టీవీల్లో చూసి పాఠాలు నేర్చుకునే పరిస్థితి లేదని విద్యార్థులంటున్నారు. ఫిజిక్స్, గణితం లాంటి సబ్జెక్టుల్లో రాసుకుని చదువుకునేదే ఎక్కువ ఉంటుందని, అలా రాసుకునేందుకు తమ ఇళ్లలో ఉన్న టీవీలు పనికిరావని వారు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్తాం... టీవీ చానెల్‌లో చూసి నేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే కందిబండ గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థుల పరిస్థితి ఏంటనేది అంతుపట్టడం లేదు. 

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన చింతల రాజు, ఎల్లమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరు పాత ఇనుప సామాన్ల బేరం చేస్తూ జీవనం సాగి స్తున్నారు. రాజు కుమార్తె అనూష ఏడో తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభం కావడంతో అనూష దిక్కుతోచని స్థితిలో పడింది. తమకు స్మార్ట్‌ఫోన్‌ కొనే స్తోమత లేదని తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని అనూష తన టీచర్‌కు చెప్పింది. దీంతో అదే పాఠశాలకు చెందిన ఇంకో విద్యార్థిని ఇంటికయినా వెళ్లి చదువుకోవాలని టీచర్‌ సూచిం చింది. కానీ కరోనా భయం అనూషను బయటకు వెళ్లనీయడం లేదు. ఈ నేపథ్యంలో తమలాంటి నిరుపేద కుటుంబాలకు ఆన్‌లైన్‌ విద్య భారమేనని అనూష కుటుంబం చెపుతోంది. 

రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో 68.37 లక్షల కుటుంబాలు, 2.4 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు తెలంగాణ వ్యాప్తంగా 40 శాతం కుటుంబాలకు లేవని అధికారిక గణాంకాలే చెపుతున్నాయి. అనేక సర్వేల్లోనూ ఈ విషయం వెల్లడయింది. దీంతో ఫోన్ల ద్వారా పాఠాలు చెప్పాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఈ 40 శాతం కుటుంబాల్లోని విద్యార్థులు చదువుకు దూరమయినట్టే. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో టీవీ చానెల్‌ ద్వారా పాఠాలు చెప్పాలనుకున్నా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చాలా కుటుంబాల్లో పాత టీవీలే ఉపయోగిస్తున్నారు. ఎల్‌ఈడీ టీవీలు లేని కుటుంబాలు 50 శాతానికి పైగా ఉన్నాయి. ఇక, ఈ టీవీల్లో ఒక కుటుంబంలోని ఇద్దరు పిల్లలు పాఠాలు నేర్చుకోవాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే... కరోనా కారణంగా విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఇప్పటికే ప్రారంభించిన ఆన్‌లైన్‌ తరగతులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థుల మధ్య అంతరానికి దారి తీయడమే కాదు...ప్రభుత్వ, ప్రైవేటు విద్యారంగాల మధ్య అగాధాన్ని కూడా పెంచుతున్నాయి. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 28 లక్షల మంది విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement