కామారెడ్డి క్రైం, నిజామాబాద్ అర్బన్: పబ్‌జీ గేమ్.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారిలో దాని గురించి తెలియనివారుండరు. ప్రధానంగా యువతను ఉర్రూతలూగిస్తున్న ఆన్‌లైన్ ఆట. తిండి, నిద్ర హారాలు మానేసి ఆటకు బానిసలవుతున్నారు. సరదాగా మొదలై అతి తక్కువ కాలంలోనే యువతను తనకు బానిసను చేసుకుంటున్న క్రీడ. తమకు తెలియకుంగానే పబ్‌జీకి అంకితమవుతున్న యువత మానసికంగా, శారీరకంగా స్థిమితాన్ని కోల్పోతున్నారు. ఆట వద్దని చెబితే విచక్షణ కోల్పోయి హత్యలు, ఆత్మహత్యలకు సైతం వెనుకాడటం లేదు. ఈ ఆట కారణంగా కొందరికి మానసిక వ్యాధులు, మరికొందరి సంసారాల్లో విడాకులు, చాలా కుటుంబాల్లో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.
అందుకే ఈ క్రీడను గేమింగ్ డిజార్డర్‌గా గుర్తించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం మన దేశంలో మొబైల్ ఫోన్‌ల క్రీడల్లో 60 శాతం యువత నిత్యం పబ్‌జీ గేమ్‌లో మునిగిపోతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు పెరుగుతున్న నేటి కాలంలో పిల్లలు సెల్‌ఫోన్‌లతో ఏం చేస్తున్నారో గమనించే తీరిక లేకుండా పోతోంది. ఇటీవలే నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఈ మృత్యుక్రీడకు బలయ్యాడు. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు తప్పవంటున్నారు వైద్యనిపుణులు.
పబ్‌జీ గేమ్ అంటే..
పబ్‌జీ అంటే ప్లేయర్ అన్‌నౌన్ బ్యాటిల్ గ్రౌండ్స్. ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తిగా ఆన్‌లైన్ వేదికగా సాగే ఆట ఇది. 2018లో ఈ గేమ్ మార్కెట్‌లోకి విడుదలైంది. దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ సంస్థ దీన్ని యాప్‌లా తయారుచేసింది. యాప్‌ను ఫోన్‌లో వేసుకొని ప్రారంభించగానే ఎంతమందితో ఆడాలో నిర్ణయించుకోవాలి. ఆన్‌లైన్‌లో స్నేహితులంతా జట్టుగా ఏర్పడి ఆడతారు. ఆ సమయంలో స్నేహితులంతా ఎప్పటికప్పుడు మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. గరిష్టంగా వందమంది ఆడవచ్చు. ఎంచుకున్న జట్టు తప్ప మిగితా వారంతా శత్రువుల కిందే లెక్క. శత్రువులనను తుపాకులతో, బాంబులతో చంపడమే లక్ష్యంగా ఆట సాగుతోంది. ప్రత్యేకమైన సైనికుల తరహాలో వేషధారణలతో కూడిన జట్లు పరస్పరం దాడులు చేసుకుంటూ యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుంది. ఆటగాడు చనిపోతే అతడి గేమ్ ముగుస్తుంది. ఎలాగైనా అందర్ని చంపి గెలవాలన్న తపనతో చనిపోయిన ప్రతిసారీ యువత మళ్ళీ గేమ్‌లోకి ప్రవేశి స్తూ ఆటను ప్రారంభిస్తారు. ఇలా నిద్రాహారాలు మానేసి సెల్‌ఫోన్‌లో పబ్‌జీ ఆటకు బానిసలుగా మారుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఇరవై కోట్ల మంది యువత పబ్‌జీ ఆటలో లీనమవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
పెరుగుతున్న నేర ప్రవృత్తి..
పబ్‌జీ ఆటలో ఉండేది మొత్తం నేర ప్రవృత్తే. ఎదుటివారిని తుపాకులతో కాల్చడం, బాంబు లు వేసి చంపడమే లక్ష్యంగా సాగుతోంది. దీం తో పబ్‌జీలో ఉన్నట్లుగానే నేర ప్రవృత్తికి అలవాటుపడే అవకాశం ఉందటున్నారు నిపుణులు. ఈ ఆటను ఆడవద్దని తల్లిదండ్రులు మందలిస్తే, సెల్‌ఫోన్‌లు లాక్కుంటే ఎందరో యువకులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు వెలుగుచూశాయి. వారం రోజుల క్రితం నిజామాబాద్‌లో ఓ యువకుడు, మెదక్‌లో ఓ యువకుడు చనిపోయారు. పబ్‌జీ ఆడకపోతే నిమిషం నిలు వలేని స్థితిలోకి వెళ్ళిన హైదరాబాద్‌లోని మల్కా జ్‌గిరికి చెందిన పదో తరగతి విద్యార్థి సాంబశివ తల్లిదండ్రులు వారిస్తే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్‌జీ ఆటకు బానిసలై వింతగా ప్రవర్తిస్తున్న ఎందరో యువకుల వీడియోలు వాట్సప్, ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పబ్‌జీ ఆడవద్దని మందలిస్తే తల్లిదండ్రులని కూడా చూడకుండా వారిపైనే పిల్లలు దాడి చేసిన సంఘటనలు సైతం వెలుగుచూశాయి.
చాలా చోట్ల నిషేధం...
పబ్‌జీతో ఎదురవుతున్న దుష్పరిణామాలను గుర్తించిన చైనా దేశం ఈ ఆటను పూర్తిగా నిషేధించింది. తాజాగా మన దేశంలోని గుజరాత్ ప్రభుత్వం సైతం పాఠశాలల్లో ఈ ఆటను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఈ గేమ్‌ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ కేంద్రానికి గుజరాత్ ప్రభుత్వం సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వస్తుండటంతో ఈ ఆటను ఒక ఖాతాదారుడు కేవలం ఆరు గంటలు మాత్రమే ఆడేలా పరిమితి విధించారు. అయినా యువత ఒక్కొక్కరు ఒకటికి మించి అకౌంట్లు సృష్టించుకొని మరీ గంటల తరబడి ఆడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మాయదారి క్రీడను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది. లేదంటే ఎందరో యువత ఈ మృత్యు క్రీడ కారణంగా తమ విలువైన జీవితాలను కోల్పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పరీక్షా ఫలితాలపై ప్రభావం...
ఈ క్రీడ మూలంగా విద్యార్థులు అస్సలు చదవడం లేదని, ఎప్పుడు చూసిన సెల్‌ఫోన్‌లోనే మునిగితేలుతున్నారనే ఫిర్యాదులు పెరిగాయి. ఈ ప్రభావం పరీక్షా ఫలితాలపై పడుతోంది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో ఎంతో మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. చదువుకోవడానికి సమయం కేటాయించకపోవడమే కారణం అవుతోంది. విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. దీంతో పరీక్షా ఫలితాలు ఎందరో తల్లిదండ్రులకు నిరుత్సాహాన్ని మిగుల్చుతోంది. పబ్‌జీకి బానిసలుగా మారిన పిల్లలను మామూలు స్థితికి తెచ్చేందుకు మానసిక వైద్యులను సంప్రదిస్తున్న కేసులు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment