విశాఖ విద్య: ‘పెదవాల్తేరుకు చెందిన అవినాష్ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. రాత్రి వేళ నిద్రలో కూడా వింత వింత శబ్దాలు చేస్తున్నాడు. బాలుడి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు ఏమైందోననే ఆందోళనతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. రెండు పర్యాయాల పరిశీలన అనంతరం బాలుడి అసలు సమస్యను వైద్యులు గుర్తించారు. గంటల తరబడి సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడడం వల్ల అబ్బాయి మొదడుపై ప్రభావం చూపిందని తేచ్చిచెప్పారు. స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉంచి, కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు’.
విశాఖ నగరంలోని ఒక్క అవినాషే కాదు.. వందలాది మంది విద్యార్థులు, యువత ఆన్‌లైన్ గేమ్‌లతో రేయింబవళ్లు కాలక్షేపం చేస్తూ మానసిక ఆనందానికి దూరమైపోతున్నారు. స్మార్ట్ ఫోన్‌తో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగం బాగా పెరిగింది. పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిందే. దీంతో స్మార్టు ఫోన్లు వినియోగం తప్పనిసరైంది. అయితే స్మార్ట్ ఫోన్‌తో ఎంతటి లాభం ఉందో, అదే స్థాయిలో నష్టాన్ని చేకూరిస్తోంది.
బెట్టింగ్‌కు బలైపోతున్న యువత
గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. విశాఖ కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్ మాఫియాను పోలీసులు సైతం గుర్తించారు. వివిధ యాప్స్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పేకాటకు అన్ని వర్గాల వారు బానిసలైపోతున్నారు. దీంతో పాటు డ్రీమ్ యాప్ ద్వారా క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ ఆటలు ఉన్నాయి. గేమ్‌లో కొంత మందిని ఎంపిక చేసుకుని బెట్టింగ్ పెడతారు. వారు బాగా ఆడినట్‌లైతే వచ్చే పాయింట్లు బట్టి గెలుపును నిర్ధారిస్తారు. ప్రైజ్ మనీగా రూ.10 నుంచి రూ.లక్ష వరకు ఉండడంతో ఎక్కువ మంది ఈ గేమ్‌లోనే మునిగి తేలుతూ డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, సమయం వృథా చేస్తూ వాటికి బానిసలైపోతున్నారు.
పబ్జీతో మొద్దుబారుతున్న మెదడు
కొన్నేళ్లు బ్యాన్ చేసిన పబ్జీగేమ్ మళ్లీ సరికొత్త గా స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చి చేరింది. పబ్జీతో పాటు, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ఆన్‌లైన్ ఆటలు ఎక్కువ మంది ఆడుతున్నారు. వీటిని నలుగురు కలసి ఒకేసారి ఆడవచ్చు. వేర్వేరు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా సరే నలుగురు మాట్లాడుకుంటూ గేమ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఎక్కువగా పాఠశాల, కాలేజీ స్థాయి విద్యార్థులు పబ్జీ గేమ్‌లకు బానిసలవుతున్నారు.
ఆన్‌లైన్ గేమ్‌లతో ప్రమాదం
పిల్లలు, అందులోనూ చదువుకునే వారు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఆన్‌లైన్ గేమ్‌ల వల్ల మానసిక ఆనందం కోల్పోతారు. మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరకంగా అలసట కలిగే ఆటలు ఆడుకోవాలి. పుస్తక పఠనం మంచి పద్ధతి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమైనదే. – డాక్టర్ రమేష్‌బాబు, మానసిక వైద్య నిపుణులు, విశాఖపట్నం
తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి
ఏదో కాలక్షేపం కోసమని కొద్దిసేపు ఆన్‌లైన్ గేమ్ ఆడితే పరవాలేదు. కానీ అదే పనిగా గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతుంటే, ఓ కంట కనిపెట్టాల్సిందే. ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లాడి ఆనందం కోసమని స్మార్ట్‌ఫోన్ ఇచ్చేసి, వదిలేయకూడదు. వారితో రోజులో కొద్దిసేపు అయినా గడిపి, కబుర్లతో కాలక్షేపం చేయాలి. – డాక్టర్ జి.సీతారాం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment