స్వైప్ రిజర్వేషన్
కాజీపేట రైల్వేస్టేషన్‌లో ప్రారంభం
నగదు రహిత లావాదేవీల్లో ముందడుగు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రాత్రి స్వైప్ మిషన్ ఈ–పాయింట్ సిస్టంను రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్ వైజర్ ఐఎస్‌ఆర్.మూర్తి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ స్వైప్ మిషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వీసా కార్డు, రూపే కార్డు, మ్యాస్ట్రో, మ్యాస్టర్ డెబిట్ కార్డులు ఇందులో స్వైప్ చేయవచ్చని, ఈ సౌకర్యం కేవలం రిజర్వేషన్ టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికుల మాత్రమేనని తెలిపారు.
ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత ఏ గ్రేడ్ రైల్వేస్టేషన్లు అయిన కాజీపేట, వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్‌లలో ఈ స్వైప్ సర్వీస్ విధానం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ సజ్జన్‌లాల్, సిబ్బంది పాల్గొన్నారు.