రంజాన్ ప్రారంభం | Start Ramzan | Sakshi
Sakshi News home page

రంజాన్ ప్రారంభం

Published Tue, Jun 7 2016 2:10 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

Start Ramzan

మసీదుల్లో ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచి ఉపవాసదీక్షలు
నెలంతా తరావీహ్
పగలు ఉపవాసం.. రాత్రి ప్రత్యేక ప్రార్థనలు


సాక్షి, మంచిర్యాల : ముస్లింల పవిత్ర రమజాన్ మాసం ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని మసీదుల్లో... సోమవారం రాత్రి నుంచి ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు(తరావీహ్) ప్రారంభమయ్యాయి. నెల పొడవునా ఇవి కొనసాగుతాయి. నేటి నుంచి ఉపవాస దీక్షలు మొదలవుతారుు. సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు నెల మొత్తం కఠిన ఉపవాసం, రాత్రి ప్రత్యేక ప్రార్థనలతో ముస్లింలు అల్లాహ్‌కు దగ్గరవుతారు. ప్రార్థనల కోసం వచ్చే ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. కమిటీలు జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు తరావీహ్‌లో ఖురాన్ విని.. పగలు దీక్షలో మంచి కార్యాలు చేయాలని ఇస్లాం ప్రబోధిస్తుంది. ఉపవాస దీక్ష చేపట్టే వారిపై అల్లాహ్ కరుణ ఎల్లవేళలా ఉంటుంది. ‘

బాలిగ్’ అయిన ప్రతి ముస్లిం యువతీ, యువకులు ఈ దీక్షలు చేపట్టడం తప్పనిసరి. ఈ నెలలో.. ఒక పుణ్యకార్యం చేస్తే అల్లాహ్ 70 పుణ్యకార్యాలు చేసినంత పుణ్యం ప్రసాదిస్తారు. ఒక సున్నత్ కార్యం చేపడితే ఒక ఫర్జ్‌కు తగ్గ పుణ్యం లభిస్తుంది. అదే ఒక నఫీల్ కార్యానికి అల్లాహ్ సున్నత్‌కు తగ్గ ప్రతిఫలం అందజేస్తారు. అబద్దాలాడడం.. చాడీలు చెప్పడం.. ఇతరులపై ద్వేషం పెంచుకోవడం.. తగువులాడడం.. ఈ నెలలో నిషిద్ధం. మనిషిలో ఉన్న చెడు అలవాట్లు.. దుర్గుణాలు పారద్రోలేందుకు అల్లాహ్ ఈ నెలను ప్రసాదిస్తారు. ఉపవాస దీక్షలు.. మంచి నడవడికతో మనిషిలో సహనం ఏర్పడుతుంది.

సహనాన్ని పాటించిన వ్యక్తికి స్వర్గంలో చోటు కల్పిస్తానని అల్లాహ్ పవిత్ర ఖురాన్‌లో చెప్పారు. ఈ నెలలో ముస్లింలు ముఖ్యంగా పేదల సంక్షేమంపై దృష్టి సారిస్తారు. అన్న, వస్త్ర.. డబ్బుల వంటి దానధర్మాలు చేపడతారు. దీక్ష విరమణ సమయంలో ఇఫ్తార్ విందులు.. ఉదయం 4గంటల ప్రాంతంలో సహర్ విందులు ఏర్పాటు చేసి అల్లాహ్ కృపకు పాత్రులయ్యేందుకు ముస్లింలు ప్రయత్నిస్తారు. షవ్వాల్(రమజాన్ తర్వాత నెల)కు ఒక రోజు ముందు ముస్లింలు రమజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement