సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభు త్వం ఏటా ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తుండగా, ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తోంది. నోబెల్ అవార్డు గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ ఏర్పాటు చేసిన అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్(జే–పాల్)కు చెందిన విద్యా విభాగం పాఠశాల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల లెక్కలు తేల్చింది. కాలిఫోర్నియా వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ మురళీధరన్ కో–చైర్‌గా వ్యవహరించే ఈ విభాగం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఐదేళ్లపాటు పనిచేసేందుకు ఇటీవల పాఠశాల విద్యాశాఖతో ఒప్పందం చేసుకుంది. ఇందు లో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, వారి వేతనాలు, విద్యా పథకాల నిధులు తదితర వివరాలను క్రోడీకరించింది. వాటిని విశ్లేషించి పాఠశాల విద్యాశాఖకు లెక్కలు అందజేసింది.
9,505 స్కూళ్లలో 30 మందిలోపే..
ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క విద్యార్థీ, ఒక్క టీచర్ కూడా లేని పాఠశాలలను మినహాయించగా, విద్యార్థులు, టీచర్లు గల పాఠశాలలు 24,550 ఉన్నట్లు తేల్చింది. అందులో 30 మందిలోపు విద్యార్థులు గల పాఠశాలలు 9,505 ఉన్నట్లుగా పేర్కొంది. వాటిల్లో ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.63,637 వెచ్చిస్తోందని లెక్కలు తేల్చింది. అదే ఎక్కువమంది విద్యార్థులు ఉన్న స్కూళ్లలో ఖర్చు గణనీయంగా తగ్గుతోందని పేర్కొంది. 30 నుంచి 100 మంది వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.39,814 ఖర్చు చేస్తుండగా, 100 నుంచి 200 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లలో ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.30,234 ఖర్చవుతోందని తెలిపింది. 200 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లలో ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.22,715 ఖర్చు అవుతోందని వెల్లడించింది. అంటే 200కు పైగా విద్యార్థులున్న పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై అయ్యే ఖర్చు కంటే 30 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లలో ఒక్కో విద్యార్థిపై 3 రెట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తోందని తేలింది.
హేతుబద్ధీకరణ కోసమేనా..
విద్యార్థుల్లేని స్కూళ్లను, విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్లను సమీప పాఠ శాలల్లో విలీనం చేసేందుకు ఇదివరకే విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. టీచర్ల సేవలను సద్వినియోగం చేసుకునేందుకు హేతుబద్ధీకరణ తప్పదని నిర్ణ యానికి వచ్చింది. స్కూళ్లను విలీనం చేసి ఆయా ఆవాస ప్రాంతాల విద్యార్థుల కు రవాణాæ సదుపాయం కల్పించడం వంటి ఆలోచన చేసింది. దీనిపై టీచర్ల సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో ముందుకు వెళ్లలేదు. మరోవైపు ఆవాస ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. దూరంలో ప్రాథమికోన్నత పాఠశాల, 5కి.మీ. పరిధిలో ఉన్నతపాఠశాల ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోంది. అన్నింటికి 5 కి.మీ. దూరాన్ని పరిగణనలోకి తీసుకు నేలా విద్యాహక్కు చట్టంలో మార్పుల కు అవకాశాలపై కమిటీ వేసింది. దీనిపై నా వ్యతిరేకత రావడంతో ఆగిపోయింది. తాజా గా జే–పాల్ తేల్చిన లెక్కలు హేతుబద్ధీకరణ అవసరమన్న వాదనకే బలం చేకూర్చుతున్నాయి.
లెక్కల్లోని మరికొన్ని అంశాలు..
►30 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లలో 17,808 మంది టీచర్లు పనిచేస్తున్నారు.
►ఇద్దరికంటే ఎక్కువమంది టీచర్లున్న స్కూళ్లలో 3,750 ఉన్నట్లుగా పేర్కొంది.
►రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్లలో 1,37,471 మంది టీచర్లు ఉండగా, వారికి ఏటా వేతనాల రూపంలో రూ.7956,44,31,195 వెచ్చించాల్సి వస్తోందని పేర్కొంది.
►సగటున ఒక్కో టీచర్‌కు ఏటా 5,78,772 వేతన రూపంలో చెల్లిస్తున్నట్లు తేల్చింది.
►ఇక రాష్ట్రంలో ఒక్క విద్యార్థీ లేని స్కూళ్లు 916 ఉంటే వాటిల్లో 748 మంది టీచ ర్లున్నారు. (పై లెక్కలకు ఇవి అదనం)
Comments
Please login to add a commentAdd a comment