సూక్ష్మ సేద్యం
- బిందు, తుంపర్ల సాగుపై చిన్నచూపు
- విస్తీర్ణం తగ్గించిన సర్కార్
- గత ఏడాది టార్గెట్‌లో 1,500 హెక్టార్ల కోత
- పరికరాలకు 1200 మంది ఎదురుచూపు
హన్మకొండ: తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో సాగుచేసే సూక్ష్మ సేద్యంపై రాష్ర్ట సర్కార్ చిన్నచూపు చూస్తోంది. పోరుున ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని తగ్గించింది. ఈ ఏడాది లక్ష్యాన్ని మరింత కుదించింది. జిల్లాలో పత్తి, మిర్చి పంటలు అధికంగా పండించడంతోపాటు ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో సూక్ష్మ సాగు సేద్యానికి డిమాండ్ బాగా ఉంది. ఈ క్రమంలో సూక్ష్మసాగు సేద్య విస్తీర్ణం తగ్గించడంతో రైతులకు మింగుడు పడడడం లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 4,230 హెక్టార్లలో బిందు సేద్యం, 1,023 హెక్టార్లలో తుంపర్ల సేద్యం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధారించుకుంది.
ఇందులో 1,500 హెక్టార్లకు మాత్రమే నిధులు మంజూరు చేసింది. దీంతో 2,730 హెక్టార్ల బిందు సేద్య విస్తీర్ణం తగ్గింది. ఈ విస్తీర్ణాన్ని 2015-16లో అమలు చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,653 హెక్టార్లలో బిందు సేద్యం, 684 హెక్టార్లలో తుంపర్ల సేద్యం చేపట్టాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. గత ఏడాది మిగిలిపోయిన 2730 హెక్టార్లను ఈ ఆర్థిక సంవత్సరానికి పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలేది 923 హెక్టార్లు మాత్రమే. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 1,200 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అరుుతే ఒక్కో రైతుకు రెండున్నర హెక్టార్ల చొప్పున డ్రిప్ కావాలని కోరితే 3 వేల హెక్టార్లవుతుంది.
కానీ, ఇక్కడ అందుబాటులో ఉంది 923 హెక్టార్లు మాత్రమే. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం కేటాయిస్తారు. ఈ మేరకు కొత్తగా దరఖాస్తు చే సుకునే రైతులకు ఈ ఏడాది సూక్ష్మసేద్యం అందడం కష్టమే. జిల్లాకు మంజూరైన డ్రిప్ సేద్యంలో 80 శాతం పత్తి, మిర్చి, కూరగాయల పంటలకు అందిస్తారు. 20 శాతం మాత్రం పండ్ల తోటలకు ఇస్తారు. కొత్తగా తోటలు పెట్టుకునే రైతులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. దీంతో పాటు పందిరి కూరగాయలు పండించే వారికి బిందు సేద్యం సాగుకు ప్రాధాన్యం ఇస్తారు.
సీనియారిటీ ప్రకారం రైతులకు మంజూరు : ఉద్యానశాఖ డీడీ సునీత
రైతులు దరఖాస్తు చేసుకున్నప్పుడు రికార్డులో నమోదు చేస్తున్నాం. ఈ రికార్డులో నమోదైన ప్రకారం ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా మంజూరు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీపై అందిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు అందిస్తున్నాం. పెద్ద రైతులకు 80 శాతం రాయితీపై అందిస్తున్నాం. ఈ సారి అదనపు బడ్జెట్ వచ్చే అవకాశముంది. ప్రభుత్వం నాబార్డు సహాయం కోరింది. నాబార్డు సూక్ష్మ సాగుకు ముందుకొస్తే జిల్లాకు మరిన్ని నిధులు వస్తాయి.