పారిశుధ్యం పట్టని సర్కారు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించిందని కాగ్ విమర్శించింది. పారిశుధ్యం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పూర్తిగా వినియోగించుకోకపోగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంటును కూడా విడుదల చేయలేదంటూ అక్షింతలు వేసింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం పదిహేనేళ్లుగా అమలవుతున్నా.. ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నంలో విఫలమైందని వ్యాఖ్యానించింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక వసతులు కల్పించలేదని విమర్శించింది.
వరంగల్ జిల్లాలో రూ. 60.27 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, సైడు కాలువలు నిర్మించాల్సి ఉన్నా.. మార్గదర్శకాలు లేవంటూ కేవలం రూ. ఆరు లక్షలు మాత్రమే ఖర్చు చేశారని కాగ్ పేర్కొంది. రంగారెడ్డి జిల్లాలో పారిశుధ్యం కోసం 1.26 కోట్లు కేటాయిస్తే.. అందులో 51.06 లక్షలతో సైకిల్ రిక్షాలు, 25 వేల చెత్తకుండీలు కొన్నారేగాని వాటి పంపిణీ పూర్తి చేయలేదని తప్పుబట్టింది. మంచినీరు, పారిశుధ్య మిషన్‌కు నిధులు వచ్చిన పక్షం రోజుల్లోగా అమలు సంస్థలకు నిధులు పంపిణీ చేయాలని కేంద్ర మార్గదర్శకాలు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10 నెలల వరకు ఆ నిధులు విడుదల చేయలేదని పేర్కొంది.