ఠాణాల పునర్‌వ్యవస్థీకరణ
సుమారు లక్షన్నర జనాభా ఉన్న మంచిర్యాల పట్టణంలో ఉన్నది ఒక్కటే పోలీస్ స్టేషన్. జిల్లాలో అత్యధికంగా నేరాలు జరిగే ఈ పట్టణంలో ఒకే ఒక స్టేషన్ ఉండటంతో ఇక్కడ జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్న ఇక్కడ అదనంగా టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలంగా డిమాండ్ ఉంది. చిన్న మండలమైన తాండూరులో రెండు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మండల కేంద్రంలో తాండూరు ఒకటి, ఐబీలో మాదారం పోలీస్ స్టేషన్ ఉంది. మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుమని 3వేల జనాభా కూడా లేదు. ఇక్కడ నమోదయ్యే కేసులు నామమాత్రమే.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో అవసరం లేనిచోట్ల పోలీస్ స్టేషన్లు ఉండటం, అవసరం ఉన్నచోట్ల ఠాణాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక జనాభా ఉన్న పట్టణాల్లో శాంతిభద్రతలకు అవరోధాలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఆయా స్టేషన్లలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి పనిభారం పెరుగుతోంది. దీంతో కేసుల దర్యాప్తు కుంటుపడుతోంది. స్థానిక ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నడుం బిగించారు. పోలీస్ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు.
మూడు స్టేషన్లు మార్పులు
జిల్లాలో 73 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, శ్రీరాంపూర్‌లలో మహిళా పోలీస్ స్టేషన్లు ఉండగా, జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. స్టేషన్ల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతానికి మూడు స్టేషన్లను మార్చాలని నిర్ణయించారు. మాదారం పోలీస్‌స్టేషన్‌తోపాటు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి స్టేషన్లను ఇతర చోట్లకు తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మూడింటిని మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్‌లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మూడు పట్టణాల్లో జనాభా పెరగడంతో ప్రస్తుతం ఉన్న స్టేషన్లు సరిపోవడం లేదు.
ఈ మూడింటిని సర్దుబాటు చేయడం ద్వారా సమస్యను కొంత మేరకు పరిష్కరించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అదనపు పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయాలంటే తీవ్ర ఆర్థిక భారంతో కూడుకుంటుంది. అలాగే ఈ స్టేషన్లలో సిబ్బంది కోసం అదనపు నియామకాలు చేట్టాలి. ఇలాంటి అవసరం లేకుండానే ఉన్న సిబ్బందితో సర్దుబాటు జరుగుతుండటంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి జాప్యం లేకుండానే అనుమతి లభించే అవకాశాలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
అప్పటి అవసరాల మేరకు..
గతంలో తాండూరు మండల పరిధిలో సింగరేణికి చెందిన పది భూగర్భ గనులు, రెండు ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు ఉండేవి. వీటిలో పనిచేసే వేలాది మంది కార్మికులు మాదారం టౌన్‌షిప్‌లో నివాసముండేవారు. రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో నిషేధిత సంస్థ సికాస కదలికలు బాగా ఉండేవి. తరచూ దాడులు జరగడం, మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణ కోసం అప్పట్లో మాదారంతోపాటు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి స్టేషన్లను ఏర్పాటు చేశారు. తర్వాత క్రమంలో భూగర్భ గనులు మూతపడటంతో చాలా మట్టుకు సింగరేణి కార్మికులు అక్కడి నుంచి తరలిపోవడంతో ఈ స్టేషన్లలో పెద్దగా పనిలేకుండా పోయింది. దీంతో వీటిని అవసరమైన చోట్లకు మార్చాలని నిర్ణయించారు.
అనుమతి రాగానే చర్యలు- గజరావు భూపాల్, ఎస్పీ
పోలీస్ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణకు ఇటీవలే ప్రతిపాదనలు పంపాము. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ మూడు పోలీస్ స్టేషన్లను తరలించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ స్టేషన్లను తరలించడం ద్వారా ప్రధాన పట్టణాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలకు అవకాశం ఉంటుంది. త్వరలోనే సర్కారు నుంచి అనుమతి మంజూరయ్యే అవకాశాలున్నాయి.