గుడిలో సమ్మె గంట
రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు, దేవాలయ ఉద్యోగుల నిరసనలు
ఆలయాల్లో నిలిచిన ఆర్జిత సేవలు
నల్లబ్యాడ్జీలతో విధులకు సిబ్బంది
నేటి నుంచి ర్యాలీలు.. ఆందోళన
సమ్మె ప్రభావం నామమాత్రమే అంటున్న వ్యతిరేక వర్గం
సాక్షి, హైదరాబాద్: తమకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణవ్యాప్తంగా అర్చకులు, దేవాలయ ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం వంటి కొన్ని ప్రధాన దేవాలయాల్లో మినహా మిగతా ఆలయాలన్నింటిలో గురువారం ఉదయం నుంచి ఆర్జిత సేవలన్నీ నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయంలో అర్చకులు ప్రాతఃకాల సేవలు నిర్వహించి అనంతరం సమ్మె పాటించారు.
అలాగే ఆమనగల్లు మైసిగండి సహా పలు ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిలిచిపోయాయి. అర్చక సంఘం రెండుగా చీలిన నేపథ్యంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘం నేతలు సమ్మె వద్దని వారించినా మిగతా అర్చకులు, ఉద్యోగులు వెనక్కితగ్గలేదు. సమ్మెను నిర్వీర్యం చేసే కుట్రలో ఇది భాగమంటూ జేఏసీ ఇచ్చిన పిలుపునకు ఎక్కువ మంది స్పందించినట్టు తెలుస్తోంది. అయితే నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రధాన దేవాలయాల్లో మాత్రం సమ్మె ఛాయలు పెద్దగా కనిపించలేదు. యాదగిరిగుట్టలో నిత్య కైంకర్యాలు యథావిధిగా జరిగాయి. కానీ కొన్ని దేవాలయాల అర్చకులు, ఉద్యోగులు సమ్మెకు సంఘీభావం ప్రకటించారని, రెండుమూడు రోజుల్లో వారు కూడా సమ్మెలో పాల్గొంటారని జేఏసీ ప్రతినిధి గంగు భానుమూర్తి ప్రకటించారు. మరోవైపు కొన్ని దేవాలయాల్లో మాత్రమే సమ్మె జరిగిందని దానిని వ్యతిరేకిస్తున్న అర్చక సంఘం నేత గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు.
నల్లబ్యాడ్జీలతో..
గురువారం అర్చకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆలయాలకు వచ్చారు. సాధారణ సేవల అనంతరం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆలయాల ఆవరణలో నినాదాలు చేశారు. శుక్రవారం నుంచి ర్యాలీలు ప్రారంభించబోతున్నారు. అయితే అర్చకుల పట్ల సానుకూలంగా ఉండే సీఎం కేసీఆర్‌ను కొందరు తప్పుడు మాటలతో పక్కదారి పట్టిస్తున్నారని, డిమాండ్ల విషయంలో ఆయన సానుకూలంగానే ఉంటారని అర్చకులు పేర్కొనడం విశేషం. ఇక సమ్మె వల్ల సాధారణ భక్తు లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మొక్కులు చెల్లించే వీలు లేకపోవటంతో కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు.
అర్చకులంటే సీఎంకు ప్రేమ: అర్చకులు, దేవాలయ ఉద్యోగుల సమ్మెకు రాజకీయ, ఉద్యోగ సంఘాల నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో సమ్మె చేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, బీజేఎల్పీ నేత లక్ష్మణ్ సంఘీభావం ప్రకటిం చారు. అర్చకులంటే సీఎంకు చాలా ప్రేమ ఉందని, అధికారుల నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని కోదండరాం పేర్కొన్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడాలని బీజేపీ శాసనసభా పక్షనేత కె.లక్ష్మణ్ అన్నారు. అర్చకుల సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది.